Begin typing your search above and press return to search.

గెలుపు నంబర్ 135... టీమిండియా ప్రపంచ రికార్డు

ఇప్పుడంటే మూడు ఫార్మాట్లు ఉన్నాయి కానీ.. 1970ల వరకు క్రికెట్లో టెస్టులు మాత్రమే ఉండేవి. 52 ఏళ్ల కిందట వన్డేలు మొదలయ్యాయి.

By:  Tupaki Desk   |   27 Nov 2023 10:51 AM GMT
గెలుపు నంబర్ 135... టీమిండియా ప్రపంచ రికార్డు
X

ఇప్పుడంటే మూడు ఫార్మాట్లు ఉన్నాయి కానీ.. 1970ల వరకు క్రికెట్లో టెస్టులు మాత్రమే ఉండేవి. 52 ఏళ్ల కిందట వన్డేలు మొదలయ్యాయి. 2004 ఆగస్టు నుంచి టి20లు వచ్చాయి. ఇప్పటికీ సంప్రదాయ క్రికెట్ అంటే టెస్టులే. టి20లు కుర్రాళ్ల క్రీడ. విచితర్ ఏమంటే.. టెస్టు క్రికెట్ మనుగడకు ఢోకాలేదు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్ ల రూపంలో టి20లు మరింత ఆదరణ పొందుతున్నాయి. కానీ, వన్డే క్రికెట్ వెనుకబడిపోయింది.

ముందుముందు టి20ల రాజ్యమే..

ఇప్పటికిప్పుడు కాకున్నా.. వచ్చే ఐదారేళ్లలో టి20లదే రాజ్యం కానుంది. అయితే, కొన్ని నిబంధనలను మార్చి మరింత జనరంజకం చేయనున్నారు. మరోవైపు టి10లు అంటూ ప్రచారం జరుగుతున్నా.. అవి కార్యరూపం దాల్చతాయని చెప్పలేం. కాగా, ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలితో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో తలపడుతోంది. ఆదివారం జరిగిన రెండో టి20లో ఆసీస్ పై 44 పరుగులు తేడాతో గెలిచింది. మంగళవారం జరిగే మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే సిరీస్ మన సొంతం అవుతుంది. కాగా, నిన్నటి గెలుపుతో టీ20 క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో పాకిస్థాన్ తో కలిసి మొదటి స్థానంలో ఉంది. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు 135 మ్యాచ్‌ ల చొప్పున గెలిచాయి. అయితే, పాకిస్థాన్ 226 మ్యాచ్ లు ఆడింది. భారత్ మాత్రం 211 మ్యాచ్ లలోనే 135 విజయాలు సాధించింది. వేగానికి మారుపేరైన టి20ల్లో వేగంగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది.

ఒక్క మ్యాచ్ పలు రికార్డులు..

ఆదివారం తిరువనంతపురంలో జరిగిన టి20తో టీమిండియా ఖాతాలో పలు రికార్డులు చేరాయి. ఈ మ్యాచ్ లో పవర్ ప్లేలో మన జట్టు ఒకే వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై టీ20ల్లో పవర్ ప్లేకు భారత్ కు ఇదే అత్యధిక స్కోరు. 2016లో సిడ్నీలో జరిగిన టీ20 మ్యాచ్‌ లో ఒక వికెట్ కోల్పోయి పవర్ ప్లేలో చేసిన 74 పరుగుల స్కోర్ ను అధిగమించింది.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ పవర్‌ ప్లేలోనే 53 పరుగులు చేశాడు. దీంతో పవర్‌ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌ ఇతడే. ఇదివరకు రోహిత్, రాహుల్ కూడా హాఫ్ సెంచరీలు చేసినా.. వారు పవర్ ప్లేలో 50 పరుగులకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ వరుసగా రెండో అర్ధ సెంచరీ కొట్టాడు. మొత్తమ్మీద టి20 ఫార్మాట్‌ లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన భారత వికెట్ కీపర్‌ గా నిలిచాడు. మూడుసార్లు ఈ మార్కు అందుకున్న కేఎల్ రాహుల్‌ తో కలిసి టాప్ లో ఉన్నారు. మరోవైపు నిన్నటి మ్యాచ్ లో చేసిన 235 పరుగులు ఆస్ట్రేలియాపై టీ20ల్లో భారత్ కు అత్యధికం. ఇప్పటివరకు 209/8 అత్యధిక స్కోర్‌ గా ఉంది. మరోవైపు ఓపెనర్లు జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు సాధించారు. కాగా టీ20 ఫార్మాట్‌లో టాప్ 3 బ్యాటర్లు అర్ధ సెంచరీలు కొట్డడం భారత్ కు ఇదే మొదటిసారి. న్యూజిలాండ్ (243) తర్వాత టి20ల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన జట్టు కూడా మనదే కావడం విశేషం.

కొసమెరుపు: ప్రపంచ క్రికెట్ లోని ప్రధాన జట్లలో 200, అంతకుపైగా టి20లు ఆడిన జట్లు మూడు మాత్రమే. ఇందులో పాకిస్థాన్, భారత్ తర్వాత న్యూజిలాండ్ (200) ఉంది. చిత్రమేమంటే.. పాకిస్థాన్ లో చాన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ సాగలేదు. అయినప్పటికీ ఆ జట్టు అత్యధిక టి20లు ఆడడం విశేషం. ఇక ఆస్ట్రేలియాతో మరో మూడు మ్యాచ్ లు ఆడనున్న భారత్ రెండైనా గెలిచి తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంటుంది.