Begin typing your search above and press return to search.

నెంబర్ 136... పాకిస్థాన్ రికార్డ్ బద్దలు కొట్టిన టీం ఇండియా!

గత మ్యాచ్‌ లో భారీ స్కోరు చేసినా పేలవమైన బౌలింగ్ ప్రదర్శన కారణంగా పరాజయంపాలైన భారత్‌.. ఈసారి 174 పరుగులను కాపాడుకుంది.

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:14 AM GMT
నెంబర్ 136... పాకిస్థాన్  రికార్డ్  బద్దలు కొట్టిన టీం ఇండియా!
X

వరల్డ్ కప్ ఫైనల్ పరాభవం అనంతరం ఆసిస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లోని నాలుగో మ్యాచ్ లో కంగారూలను మట్టికరిపించిన టీం ఇండియా.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌ లో భారీ స్కోరు చేసినా పేలవమైన బౌలింగ్ ప్రదర్శన కారణంగా పరాజయంపాలైన భారత్‌.. ఈసారి 174 పరుగులను కాపాడుకుంది. దీంతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.

అవును... నాలుగో టీ20లో ఆసిస్ ని మట్టికరిపించింది భారత్. టీం ఇండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ అద్భుత బౌలింగ్‌ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకంటే ముందు రింకు సింగ్‌ (46: 29 బంతుల్లో 4×4, 2×6) మరోసారి బ్యాటుతో ఆకట్టుకున్నాడు. అతడికి జితేశ్‌ శర్మ (35: 19 బంతుల్లో 1×4, 3×6) మెరవడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్‌ 9 వికెట్లకు 174 పరుగులు చేసింది.

వాస్తవానికి ఇది ఆసిస్ బ్యాటర్స్ ఉన్న ఫాం కి పెద్ద స్కోరేమీ కాదనే చెప్పాలి. కానీ.. మూడో మ్యాచ్ లో తప్పు మీద తప్పు చేసిన టీం ఇండియా బౌలర్లు... పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇందులో ప్రధానంగా "ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌" అక్షర్‌ పటేల్‌ (3/16) విజృంభించడంతో ఆసీస్‌ 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ క్రమంలో పాకిస్థాన్ రికార్డ్‌ ను టీం ఇండియా బద్దలు కొట్టింది. ఇందులో భాగంగా... టీ20 ఫార్మెట్ లో 135 విజయాలతో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా.. 136 విజయాలతో టీమిండియా ఆ రికార్డ్ బద్దలు కొట్టింది. ఇదే సమయంలో... అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన జట్టుగానూ భారత్ చరిత్రకెక్కింది.

ఈ ఫార్మేట్ లో 213 మ్యాచ్‌ లు ఆడిన టీమిండియా.. 136 విజయాలు సాధించింది. కేవలం 67 మ్యాచ్‌ ల్లో ఓడింది. మరో 6 మ్యాచ్‌ ల్లో ఫలితం తేలలేదు. దీంతో అత్యంత వేగంగా రికార్డ్ విజయాలు నమోదు చేసిన రికార్డ్ సృష్టించింది. ఇక... 226 మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్... 135 మ్యాచ్‌ ల్లో విజయం సాధించగా.. 82 మ్యాచ్‌ ల్లో ఓటమిపాలైంది.

ఈ జాబితాలో భారత్, పాకిస్థాన్ తర్వాత న్యూజిలాండ్ (200 మ్యాచ్‌ ల్లో 102 విజయాలు), సౌతాఫ్రికా (171 మ్యాచ్‌ ల్లో 95 విజయాలు), ఆస్ట్రేలియా( 181 మ్యాచ్‌ ల్లో 95 విజయాలు), ఇంగ్లండ్( 177 మ్యాచ్‌ ల్లో 92 విజయాలు) కొనసాగుతున్నాయి.