వివాదాస్పద క్రికెటర్ పై మూడు సంవత్సరాల బ్యాన్.. ఇది రెండోసారి
తమ రాష్ట్రానికి చెందిన శ్రీశాంత్ ను కేరళ ప్రజలు బాగా ఆరాధిస్తారు. అయితే, తాజాగా అతడిపై కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) చర్యలు తీసుకుంది. మూడేళ్లు సస్పెండ్ చేసింది.
By: Tupaki Desk | 2 May 2025 4:59 PM ISTమొగుడు కొట్టినందుకు కాదు.. అత్త నవ్వినందుకు ఆవిడ బాధపడిందనే తెలుగు సామెతను గుర్తుచేసేలా కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) ఓ మాజీ క్రికెటర్ పై చర్యలు తీసుకుంది.. అసలు ఆ చర్య తీసుకుంటే ఎంత..? తీసుకోకుంటే ఎంత? అనే పరిస్థితుల్లో కేసీఏ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.
శ్రీశాంత్ గుర్తున్నాడా? టీమ్ ఇండియా మాజీ ఆటగాడు. వివాదాస్పద ప్రవర్తనకు తోడు ఫిక్సింగ్ ఆరోపణలతో పలుసార్లు వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నుంచి నిషేధానికి గురయ్యాడు. అలాంటి శ్రీశాంత్.. మళ్లీ నిషేధానికి గురయ్యాడు.
శ్రీశాంత్ ప్రత్యేకత ఏమంటే అతడు కేరళ నుంచి టీమ్ ఇండియాకు ఆడిన క్రికెటర్. మంచి పేస్ ఉన్న అతడు కొన్ని మ్యాచ్ లను గెలిపించాడు కూడా. పైగా 2007 తొలి టి20 ప్రపంచ కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై శ్రీశాంత్ పట్టిన క్యాచ్ ఎప్పటికీ భారత అభిమానుల గుండెల్లో నిలిచి ఉంటుంది. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడైన శ్రీశాంత్ అరుదైన ఘనత అందుకున్నడు. అయితే, ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన అతడు.. ఫిక్సింగ్ తో శాశ్వతంగా దూరమయ్యాడు. చివరకు సినిమాల్లోనూ నటించాడు.
తమ రాష్ట్రానికి చెందిన శ్రీశాంత్ ను కేరళ ప్రజలు బాగా ఆరాధిస్తారు. అయితే, తాజాగా అతడిపై కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) చర్యలు తీసుకుంది. మూడేళ్లు సస్పెండ్ చేసింది.
కేరళ క్రికెట్ లీగ్ లో కొల్లం ఏరీస్ ఫ్రాంచైజీకి శ్రీశాంత్ కో ఓనర్. కాగా, గత ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టు నుంచి శాంసన్ ను తప్పించడంపై శ్రీశాంత్ విమర్శలు చేశాడు. దీంతో సంజూను చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని ఆరోపించాడు. దీనిపై కేరళ క్రికెట్ సంఘం ఆగ్రహానికి గురైంది. గత నెల 30న జరిగిన సమావేశంలో శ్రీశాంత్ పై సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. తమ గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగించిందుకు శ్రీశాంత్ పై ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని కేసీఏ వివరించింది.
సంజూ తండ్రిపై కేసు..
సంజూ శాంసన్ ఎంపికపై నిరాధార ఆరోపణలు చేసినందుకు అతడి తండ్రి శాంసన్ విశ్వనాథన్, మరో ఇద్దరిపై కేసీఏ పరువునష్టం దావా వేయాలని నిర్ణయించింది.
