Begin typing your search above and press return to search.

సంజూ సున్నా శాంస‌న్..కెప్టెన్ సూర్య వెట‌కారాల నుంచి టేక్ ఏ బౌ దాక‌

వ‌రుస‌గా సెంచ‌రీలు.. లేదంటే సున్నాలు..! ప్ర‌తిభావంతుడే కానీ అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదంటూ అభిమానుల గ‌గ్గోలు..! చాన్స్ దొరికితే స‌ద్వినియోగం చేజేతులా చేజార్చుకోవ‌డం..!

By:  Tupaki Desk   |   2 March 2026 1:26 PM IST
సంజూ సున్నా శాంస‌న్..కెప్టెన్ సూర్య వెట‌కారాల నుంచి టేక్ ఏ బౌ దాక‌
X

వ‌రుస‌గా సెంచ‌రీలు.. లేదంటే సున్నాలు..! ప్ర‌తిభావంతుడే కానీ అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదంటూ అభిమానుల గ‌గ్గోలు..! చాన్స్ దొరికితే స‌ద్వినియోగం చేజేతులా చేజార్చుకోవ‌డం..! ఎంతో న‌మ్మ‌కంతో టి20 ప్ర‌పంచ క‌ప్ న‌కు ఎంపిక చేస్తే.. దానికి ముందు సిరీస్ లోనే దారుణ వైఫ‌ల్యం...! అనూహ్యంగా ప్ర‌పంచ క‌ప్ తుది జ‌ట్టులో చోటు ద‌క్కితే, సాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌..! విధిలేని ప‌రిస్థితుల్లో.. అత్యంత కీల‌క‌మైన‌ సూప‌ర్ 8 చివ‌రి మ్యాచ్ లో బ‌రిలోకి..! కానీ, అక్క‌డే అనూహ్యం జ‌రిగింది..! సున్నా నుంచి వంద‌కు చేరిన‌ట్లు.. ఫీనిక్స్ ప‌క్షి బూడిద నుంచి ఆకాశానికి ఎదిగిన‌ట్లు..! సంజూ శాంస‌న్ కెప్టెన్ సూర్య వెట‌కారాల నుంచి టేక్ ఏ బౌ దాక ఎదిగాడు. ఒకే ఒక్క మ్యాచ్..! ఆదివారం నాటి వెస్టిండీస్ తో సూప‌ర్ 8 మ్యాచ్ సంజూను ఎక్క‌డికో తీసుకెళ్లింది. ఇన్నాళ్ల‌కు అత‌డి ప్ర‌తిభ‌కు త‌గిన ఇన్నింగ్స్ ఆడాడంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అనుకోకుండా వ‌చ్చినా...

మొద‌టి నుంచి సంజూది వింత ప‌రిస్థితి. కేర‌ళ వంటి ఫార్వ‌ర్డ్ రాష్ట్రం నుంచి వ‌చ్చిన అత‌డు.. ప‌దేళ్ల కిందటే టీమ్ ఇండియా త‌ర‌ఫున ఆడాడు. కానీ, ఇప్ప‌టికీ టి20 జ‌ట్టులో మాత్ర‌మే చోటు స్థిరం చేసుకున్నాడు. ఈ ప్ర‌పంచ క‌ప్ ముందు ఫామ్ కోల్పోవ‌డంతో ఈ ఫార్మాట్ లోనూ స్థానం కోల్పోయాడు. స‌హ‌చ‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ అనారోగ్యం- వైఫ‌ల్యం, మ‌రో స‌హ‌చ‌రుడు రింకూ సింగ్ తండ్రి అస్వ‌స్థ‌త‌-మ‌ర‌ణంతో సంజూకు తుది జ‌ట్టులో చోటు ద‌క్కింది. కానీ, దీనికి కూడా అత‌డి వైఫ‌ల్యంతో వెక్కిరింత‌లు ఎదుర‌య్యాయి.

ఎవ‌రి బ‌దులు ఆడిద్దాం నుంచి..

ఇటీవ‌లి కాలంలోనిది ఎప్ప‌టిదో కానీ... కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ప్రెస్ మీట్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. సంజూను తుదిజ‌ట్టులో ఉంచుతారా? అని మీడియా అడ‌గ్గా, ఎవ‌రి బ‌దులు ఆడిద్దాం.. అభిషేక్ స్థానంలోనా, తిల‌క్ వ‌ర్మను త‌ప్పించా? అంటూ ఒకింత వెట‌కారంగా స‌మాధానం ఇచ్చాడు సూర్య‌. కానీ, అదే సూర్య వెస్టిండీస్ తో మ్యాచ్ ను సంజూ గెలిపించాక మైదానంలోకి వ‌చ్చి క్యాప్ తీసి టేక్ ఎ బౌ అని అభివాదం చేశాడు.

ఇప్పుడే ముగియ‌లేదు..!

సంజూ ఆదివారం నాడు ఆడిన ఇన్నింగ్స్ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది అన‌డంలో సందేహం లేదు. అయితే, అంత‌టితోనే అయిపోలేదు. సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్ మీద కూడా రాణించాలి. త‌న ఆట‌లో స్థిర‌త్వం లేద‌నే విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టాలి.

కొస‌మెరుపుః టి20 ప్ర‌పంచ క‌ప్ న‌కు ముందు అంద‌రూ అభిషేక్ అభిషేక్ అంటూ ఊగిపోయారు. ప్ర‌పంచ క‌ప్ మొద‌ల‌య్యాక ఇషాన్ కిష‌న్ ఇషాన్ కిష‌న్ అంటూ హ‌ల్ చ‌ల్ చేశారు. సంజూను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు సంజూ బాబా జ‌య‌హో అంటున్నారు.