Begin typing your search above and press return to search.

ఐపీఎల్ జట్టులో లుకలుకలు.. దిగ్గజ ఆటగాడితో కెప్టెన్ కు చెడిందా?

నాలుగేళ్ల తర్వాత ఈ సీజన్ లో సూపర్ ఓవర్ జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్- ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో స్కోర్లు సమం అయ్యాయి.

By:  Tupaki Desk   |   18 April 2025 4:05 PM IST
ఐపీఎల్ జట్టులో లుకలుకలు.. దిగ్గజ ఆటగాడితో కెప్టెన్ కు చెడిందా?
X

ఆ కుర్రాడు టీమ్ ఇండియాలోకి ఎంపికవడానికి, కెరీర్ కు మెంటార్ గా పనిచేసిన దిగ్గజ క్రికెటర్ తోనే పొసగడం లేదా..? ఐపీఎల్ జట్టులో ఓటముల కారణంగా వారిద్దరి మధ్య విభేదాలు ముసిరియా? పరిస్థితులు చూస్తుంటే వీటికి ఔననే సమాధానమే వస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత ఏడాది మెరుగైన ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి కిందామీదా పడుతోంది. పైగా వరుసగా మ్యాచ్ లు ఓడడంతో కెప్టెన్, హెడ్ కోచ్ మధ్య పట్టింపులు పెరిగినట్లు తెలుస్తోంది.

భారత క్రికెట్లో రికార్డుల పరంగా సచిన్ తర్వాత దిగ్గజం ఎవరంటే రాహుల్ ద్రవిడ్. టీమ్ ఇండియా కూ గత ఏడాది వరకు హెడ్ కోచ్ గా పనిచేశాడు. టి20 ప్రపంచ కప్ అందించాడు. ప్రస్తుతం కాలికి సర్జరీ జరిగినా.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వీల్ చైర్ లోనే గ్రౌండ్ కు వస్తున్నాడు ద్రవిడ్.

ఇక రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. పక్కటెముకల గాయంతోనే సీజన్ తొలి మ్యాచ్ లలో ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగాడు. ఇక ద్రవిడ్ తో సంజూకు విభేదాలు తలెత్తిన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

నాలుగేళ్ల తర్వాత ఈ సీజన్ లో సూపర్ ఓవర్ జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్- ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో స్కోర్లు సమం అయ్యాయి. అయితే, సూపర్ ఓవర్ లో ఢిల్లీ గెలిచింది. ఈ సమంయలోనే సంజూ-ద్రవిడ్ మధ్య విభేదాలు తలెత్తినట్లు చెబుతున్నారు. కొందరైతే మరింత ముందుకెళ్లి సంజూ.. చెన్నై సూపర్ కింగ్స్ కు వచ్చేయ్ అని కోరుతున్నారు.

సూపర్ ఓవర్ లో రాజస్థాన్ రెగ్యులర్ ఓపెనర్లు సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్ కాకుండా రియాన్ పరాగ్, హెట్ మెయిర్ బ్యాటింగ్ కు దిగారు. పరాగ్ ఔటయ్యాక జైశ్వాల్ వచ్చాడు. శాంసన్ అంతకుముందు ఇన్నింగ్స్ ప్రారంభించినా.. పక్కటెముకల నొప్పితో సూపర్ ఓవర్ లో దిగలేదు. ఇక సూపర్ ఓవర్‌ కు ముందు ద్రవిడ్ జట్టు సభ్యులతో మాట్లాడుతుండగా.. సంజూ డగౌట్‌ దగ్గర ఉన్నాడు. రమ్మని ఆహ్వానించినా.. అతడు వెళ్లలేదు. అతడిని బ్యాటింగ్‌ కు దింపొద్దని మేనేజ్‌ మెంట్ భావించిందని.. దీంతోనే సంజూ డిస్కషన్‌ కు వెళ్లలేదని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక సోషల్ మీడియా గురించి చెప్పేదేముంది? ఇంత అంటే అంత అని ప్రచారం చేస్తారు. ద్రవిడ్‌ తో సంజూకు ఎప్పుడూ సమస్యలే అని.. టీమ్ ఇండియాలో ఉన్నప్పడూ ఇదే పరిస్థితి అని ఆరోపిస్తున్నారు. విలువ లేనప్పుడు రాజస్థాన్ లో ఉండడం కంటే చెన్నై సూపర్ కింగ్స్ కు వచ్చేయని కోరుతున్నారు. ద్రవిడ్-సంజూ మధ్య లడాయి ఉందని, మేనేజ్‌ మెంట్‌ సంజూను పట్టించుకోవడం లేదని ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. కొందరు రియాన్ పరాగ్ ను నిందిస్తున్నారు.

కాగా, సంజూ ప్రతిభను గుర్తించిందే రాహుల్ ద్రవిడ్. వ్యక్తిగతంగానూ ద్రవిడ్ ను సంజూ బాగా గౌరవిస్తాడు. సంజూ పెళ్లికి వెళ్లిన అతికొద్ది మంది టీమ్ ఇండియా మాజీ స్టార్లలో ద్రవిడ్ ఒకడు.