Begin typing your search above and press return to search.

అస‌లు గొడ‌వ భార‌త్-బంగ్లాది.. కేసులు, రూ.350 కోట్లు బొక్క పాక్ కు

లేని పెత్త‌నం నెత్తినేసుకుని.. బొక్క పెట్టుకోవ‌డం అంటే ఇదేనేమో..? అస‌లు వివాదం భార‌త్-బంగ్లాదేశ్ మ‌ధ్య అయితే, పాకిస్థాన్ వేలు పెట్టి విర‌గ్గొట్టుకుంది.

By:  Tupaki Desk   |   5 Feb 2026 7:00 PM IST
అస‌లు గొడ‌వ భార‌త్-బంగ్లాది.. కేసులు, రూ.350 కోట్లు బొక్క పాక్ కు
X

లేని పెత్త‌నం నెత్తినేసుకుని.. బొక్క పెట్టుకోవ‌డం అంటే ఇదేనేమో..? అస‌లు వివాదం భార‌త్-బంగ్లాదేశ్ మ‌ధ్య అయితే, పాకిస్థాన్ వేలు పెట్టి విర‌గ్గొట్టుకుంది. టి20 ప్ర‌పంచ క‌ప్ లో ఆడొద్దు అనే ఉద్దేశం మొద‌ట బంగ్లాదేశ్ కు లేదు. కానీ, వారి దేశంలో హిందువుల‌పై దాడులు, హ‌త్య‌లు జ‌ర‌గుతుండ‌గా.. భార‌త్ స్పందించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదురైంది. బంగ్లా పేస్ బౌల‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) నుంచి త‌ప్పించింది. దీంతో క‌క్ష పెంచుకున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌భుత్వం త‌మ క్రికెట‌ర్ల‌ను భార‌త్ కు పంపేందుకు డొంక తిరుగుడు కార‌ణాలు చెప్పింది. సాధ్యం కాద‌ని తెలిసీ.. భ‌ద్ర‌త లేద‌ని, మ్యాచ్ ల వేదిక‌ల‌ను మార్చాల‌ని ప‌ట్టుబ‌ట్టి తెగే దాక లాగింది. చివ‌ర‌కు మెగా టోర్నీ నుంచి త‌ప్పుకొంది. దీని ప‌ర్య‌వ‌సానాలు మున్ముందు ఆ దేశ క్రికెట్ బోర్డు ఎదుర్కోక త‌ప్ప‌దు. అయితే, బంగ్లాను చూసి పాకిస్థాన్ తోక జాడించింది. అస‌లు సంబంధ‌మే లేని అంశం అయినా.. భార‌త్ తో మ్యాచ్ జ‌రిగేది శ్రీలంక రాజ‌ధాని కొలంబోలో అయినా బ‌హిష్క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీని ప్ర‌భావం ఆ దేశ బోర్డుపై భారీగా ప‌డ‌నుంది.

ఆడేది లేదంటూ డాంబికాలు

పాకిస్థాన్ క్రికెట్ ఎప్పుడో రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయింది. ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ మొహిసిన్ న‌ఖ్వీనే మంత్రిగా ఉన్నాడు. ఇక రాజ‌కీయాలు ఏం త‌క్కువ‌. తాజాగా పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ మాట్లాడుతూ తాము టి20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్ తో ఆడేది లేద‌ని చెప్పాడు. ఈ మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 15న కొలంబోలో జ‌ర‌గాల్సి ఉంది. క్రీడ‌ల్లో రాజ‌కీయాలు ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు భార‌త్ ను ఉద్దేశించి చెప్పాడు. కానీ, అస‌లు వారి దేశంలోనే రాజ‌కీయం ఉంద‌న్న సంగ‌తి మ‌ర్చిపోయాడు.

బ్రాడ్ కాస్ట‌ర్ల దెబ్బ మామూలుగా ఉండ‌దు

కార్పొరేట్ స్ట‌యిల్ వ్య‌వ‌హారాలు ఎలా ఉంటాయో పాకిస్థాన్ కు పూర్తిగా తెలియ‌న‌ట్లుంది. భార‌త్ తో మ్యాచ్ ఆడేది లేద‌ని తేలిగ్గా చెప్ప‌డం స‌రే.. కానీ, బ్రాడ్ కాస్ట‌ర్ల ఆర్థిక ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటే ఏం జ‌రుగుతుందో ఆలోచించిన‌ట్లు లేదు. భార‌త్ మ్యాచ్ ను బ‌హిష్క‌రించిన పాక్ పై బ్రాడ్ కాస్ట‌ర్లు ఏకంగా కోర్టు కేసు వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ చిక్కులు చాల‌ద‌న్న‌ట్లు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక ఆదాయంలో పాక్ వాటా కోల్పోనుంది. ఇది రూ.350 కోట్ల వ‌ర‌కు ఉండ‌నుంది. అనంత‌రం పాక్ బోర్డుపై ఐసీసీ ఆంక్ష‌లు బోన‌స్. ఇన్ని ఎదురుదెబ్బ‌లు బ‌హుశా పాకిస్థాన్ ఊహించి ఉండ‌దేమో?