Begin typing your search above and press return to search.

ఓరేయ్ అమీరూ.. లగెత్తరోయ్.. నెటిజన్లు తగులుకుంటున్నారు..

టి20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో “గెలిస్తేనే సెమీఫైనల్” అనే ఒత్తిడిలో దిగిన టీమిండియా.. మాటల్లో కాదు.. బ్యాట్‌తో సమాధానం చెప్పింది.

By:  A.N.Kumar   |   2 March 2026 1:24 PM IST
ఓరేయ్ అమీరూ.. లగెత్తరోయ్.. నెటిజన్లు తగులుకుంటున్నారు..
X

టి20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో “గెలిస్తేనే సెమీఫైనల్” అనే ఒత్తిడిలో దిగిన టీమిండియా.. మాటల్లో కాదు.. బ్యాట్‌తో సమాధానం చెప్పింది. వెస్టిండీస్ వంటి బలమైన జట్టును ఎదుర్కొన్నప్పటికీ.. భారత జట్టు ఎక్కడా బెదరకుండా 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో టీమిండియా దర్జాగా సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇక తదుపరి పోరులో ఇంగ్లాండ్‌తో ఢీకొనబోతోంది.

కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అసలైన హీరోగా నిలిచింది సంజు శాంసన్. 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. టీమిండియా విజయానికి పునాది వేసాడు. మ్యాచ్ మొదట్లోనే ఒత్తిడి ఉన్నప్పటికీ, సంజు తన స్టైలిష్ షాట్స్‌తో మ్యాచ్‌ను ఒక్కసారిగా భారత్ వైపు తిప్పేశాడు. అతడి బ్యాటింగ్ చూస్తే “టార్గెట్ 196 కాదు.. 146 అన్నట్టు” అనిపించేలా సునాయాసంగా ఆడాడు. దీంతో మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు సంజుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో మరో మ్యాచ్ కూడా మొదలైంది… అది అమీర్ vs నెటిజన్స్! మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అతనికే బూమరాంగ్ అయ్యాయి. ఒక స్పోర్ట్స్ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్న అమీర్.. “వెస్టిండీస్ బౌలింగ్ ముందు టీమిండియా బ్యాటర్లు నిలబడలేరు.. ఇండియా ఓడిపోతుంది” అని ధీమాగా చెప్పాడు.

కానీ మ్యాచ్ ఫలితం వచ్చేసరికి… ఆ జోష్యం గాలి కబురుగా మారిపోయింది. టీమిండియా గెలిచింది మాత్రమే కాదు.. స్టైలిష్‌గా సెమీఫైనల్‌లోకి కూడా వెళ్లిపోయింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు అమీర్‌పై సెటైర్లు పేలుస్తున్నారు.

“బ్రో… నీ జోష్యం ఐపీఎల్ వేలం రేట్లలా పడిపోయింది!” అంటూ ఒకరు కామెంట్ చేయగా… “టీమిండియా గురించి మాట్లాడే ముందు నీ జట్టు సూపర్ 8 దాటిందా చూడూ!” అంటూ మరొకరు కౌంటర్ ఇచ్చారు. “నువ్వు చెప్పిందే నిజమైతే.. ఈరోజు భారత్ ఇంటికి వెళ్లేది.. కానీ సెమీస్ లో ఉంది!” అంటూ మరొక నెటిజన్ సెటైర్ వేశాడు.

కొంతమంది అయితే మరింత కఠినంగా స్పందిస్తున్నారు. “టీవీ షోలో అబద్దాలు చెబుతావా? ముందుగా నిన్ను , నీ జోష్యాల్ని జైలులో పెట్టాలి” అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంకొందరు “సొంత మైదానంలో ఓడిపోవడానికి ఇండియా పాకిస్తాన్ కాదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఏమిటంటే… అమీర్ జోష్యం చెప్పిన పాకిస్తాన్ జట్టే ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. మరోవైపు అతడు తేలిపోతుందని అన్న టీమిండియా మాత్రం సెమీఫైనల్ చేరింది. దీంతో “మాటల మ్యాచ్‌లో అమీర్ గెలిచినా.. అసలు మ్యాచ్‌లో భారత్ గెలిచింది” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇక 2024లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన విషయం గుర్తు చేస్తూ… “ట్రోఫీ గెలిచిన జట్టు గురించి ఇలా మాట్లాడటమే పెద్ద కామెడీ” అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. “పాకిస్తాన్ చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ ఎప్పుడు గెలిచిందో ముందుగా చెప్పు” అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి సంజు శాంసన్ బ్యాట్‌తో ఇచ్చిన సమాధానం కంటే… నెటిజన్లు ఇచ్చిన రియాక్షన్ మరింత గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు సెమీఫైనల్‌పై ఉంది. ఇంగ్లాండ్‌ను కూడా ఇదే దూకుడుతో ఎదుర్కొని ఫైనల్ చేరుతుందా టీమిండియా? లేక మరోసారి ఎవరైనా కొత్త జోష్యం చెబుతారా? అన్నది చూడాలి!