Begin typing your search above and press return to search.

రేపటి నుంచే ‘సఫారీ’.. ఈసారైనా అందేనా మరి?

ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో మాత్రం ఆ రికార్డును సాధించలేదని తెలుసా? ఒకటికి రెండు సార్లు టెస్టు సిరీస్ విజయానికి దగ్గరగా వచ్చి మరీ చేజార్చుకుంది.

By:  Tupaki Desk   |   25 Dec 2023 6:23 PM GMT
రేపటి నుంచే ‘సఫారీ’.. ఈసారైనా అందేనా మరి?
X

ఇంగ్లండ్ పిచ్ లంటే.. స్వింగ్. ఆస్ట్రేలియా పిచ్ లంటే పేస్.. న్యూజిలాండ్ పిచ్ లంటే బౌన్స్.. మరి దక్షిణాఫ్రికా పిచ్ లంటే..?? ఇంగ్లండ్ లో టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా.. ఆస్ట్రేలియా గత రెండుసార్లు ఓడించిన భారత జట్టు.. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో మాత్రం ఆ రికార్డును సాధించలేదని తెలుసా? ఒకటికి రెండు సార్లు టెస్టు సిరీస్ విజయానికి దగ్గరగా వచ్చి మరీ చేజార్చుకుంది. మరి ఈసారి ఏం జరగనుంది?

3 దశాబ్దాలుగా గెలుపు ముచ్చటే లేదు

దక్షిణాఫ్రికాతో మంగళవారం నుంచి రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. సఫారీలను వారి సొంతగడ్డపై మూడు దశాబ్దాలుగా ఓడించలేకపోయింది మన జట్టు. 1990 నుంచి ఎనిమిది సార్లు టెస్టు సిరీస్‌ ఆడినా ఒక్కటీ నెగ్గలేదు. సరిగ్గా రెండేళ్ల కిందట (2021-22) జరిగిన సిరీస్‌లో మొదటి టెస్టు గెలిచి మిగతా రెండూ ఓడింది. కాగా, నాటికి నేటికీ టీమిండియాలో చాలా మార్పులు జరిగాయి.

కెప్టెన్ మారాడు.. మరి ఆట..?

గత సఫారీ సిరీస్ సందర్భగా టీమిండియాలో అనూహ్య మార్పులు జరిగాయి. టి20, వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా కోహ్లి తప్పుకొన్నాడు. తర్వాత టెస్టు కెప్టెన్సీనీ వదిలేశాడు. ఇప్పుడు పుజారా, రహానే వంటి సీనియర్లు లేరు. నాటికీ నేటికీ జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. మళ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టుల కోసం వెళ్లిన కోహ్లి.. కేవలం ఆటగాడిగానే ఆడబోతున్నాడు. గత సిరీస్ లో జట్టుతో ఉన్న మయాంక్‌ అగర్వాల్, సాహా, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్, పంత్, షమి, ప్రియాంక్‌ పాంచల్, హనుమ విహారి, జయంత్‌ యాదవ్‌ కూడా ఇప్పుడు లేరు. వాస్తవానికి నాడు గాయంతో రోహిత్‌, జడేజా, శుభ్‌మన్‌ గిల్‌ జట్టుకు దూరమయ్యారు. కేఎల్‌ రాహుల్, కోహ్లి, అశ్విన్, శార్దూల్, బుమ్రా, సిరాజ్‌ మాత్రమే నాడు, నేడూ జట్టుతో ఉన్నారు.

కుర్రాళ్లు ఏం చేస్తారో?

రెండేళ్ల కిందటి సిరీస్ లో లేని యశస్వి జైస్వాల్, కేఎస్‌ భరత్, ముకేశ్‌ కుమార్, ప్రసిద్ధ్‌ కృష్ణ కొత్తగా వచ్చాడరు. వాస్తవానికి గత సిరీస్ సందర్భంగా టీమిండియా చరిత్రకెక్కే అవకాశం దక్కింది. బలహీనంగా ఉన్న దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్‌ గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి రెండు టెస్టుల్లో ఓడింది.

పేస్.. బౌన్స్..

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పోలిస్తే దక్షిణాఫ్రికా పిచ్ లు చాలా భిన్నం. బౌన్స్, పేస్ కలగలిపి ఉండే పిచ్ లవి. ఇలాంటిచోట రాణించాలంటే బ్యాట్స్ మన్ చాలా జాగ్రత్తగా ఆడితేనే భారీ స్కోర్లు సాధించగలరు. ఇక బౌలర్లు కూడా పేస్ ను నియంత్రించుకుంటూ బంతులు వేయాల్సి ఉంటుంది. స్పిన్ కు మాత్రం అసలు సహకారం ఉండదనే అనుకోవాలి. అందుకే టీమిండియా ఏకైక స్పిన్నర్ రవీంద్ర జడేజాతోనే బరిలో దిగే వీలుంది. మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్ లోతుగా ఉండడమూ కీలకమే. అందుకనే నాలుగో పేసర్ గా పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు అవకాశం ఉంటుంది. అయితే, మంగళవారం నుంచి జరిగే తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. కనీసం రెండు రోజుల ఆట సాధ్యమయ్యే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.