Begin typing your search above and press return to search.

కష్టాల టీమిండియాకు విశాఖలో నిజంగా ‘‘టెస్టు’’ సమయమే..

అంటే.. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ కు సమానంగా సహకరించేలా చూడాలని పరోక్షంగా భావిస్తోంది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 11:30 PM GMT
కష్టాల టీమిండియాకు విశాఖలో నిజంగా ‘‘టెస్టు’’ సమయమే..
X

స్టార్ బ్యాటర్ వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నాడు.. స్టార్ ఆల్ రౌండర్ గాయపడ్డాడు.. మిడిలార్డర్ లో కీలక బ్యాట్స్ మన్ గాయం తిరగబెట్టింది.. వన్ డౌన్ లో ఆడుతున్న కుర్రాడు నిలకడ తప్పాడు.. కెప్టెన్ నుంచి భారీ స్కోర్లు రావడం లేదు.. వీటన్నిటికి మించి మొదటి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో అనూహ్యంగా ఓటమి.. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టు జరగనున్న మైదానంలో పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే చాన్సే లేదు. ఇది ప్రస్తుతం టీమిండియా పరిస్థితి.

విశాఖలో స్పిన్ అతిగా తిరగొద్దు..

మొదటి టెస్టులో ఓటమి అనుభవంతో విశాఖపట్నంలో స్పిన్ ను నమ్ముకుని ఇంగ్లండ్ ను దెబ్బకొడదామని టీమిండియా భావిస్తుండగా.. బీసీసీఐ మాత్రం దానికి అడ్డుకట్ట వేసింది. విశాఖలో మరీ స్పిన్ కు అనుకూలంగా తిరిగే పిచ్ ను రూపొందించవద్దంటూ ఆదేశాలిచ్చింది. అంటే.. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ కు సమానంగా సహకరించేలా చూడాలని పరోక్షంగా భావిస్తోంది. బీసీసీఐ నిర్ణయంలో ఇంకో అసలు విషయం కూడా ఉంది. హైదరాబాద్ టెస్టులో టీమిండియాను రెండో ఇన్నింగ్స్ లో కొత్త స్పిన్నర్ కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్ లోనూ పార్ట్ టైం స్పిన్నర్ రూట్ దెబ్బకొట్టాడు. ఇప్పుడు విశాఖలో ఏకంగా పూర్తి స్పిన్ పిచ్ ఎదురై.. మనవాళ్లు బ్యాట్ విడిచేస్తే పరువు పోతుంది. అందుకనే వెనుకాముందు ఆలోచిస్తోంది.

ఓడితే కష్టమే..

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా రెండో టెస్టును కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి. అయితే, అనూహ్యంగా సిరాజ్ ప్రదర్శనతో మన జట్టు ఆ టెస్టును గెలుచుకుని 1-1తో సిరీస్ ను సమం చేసింది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్టు ఓడి ఐదు మ్యాచ్ ల సిరీస్ 0-1తో వెనుకబడింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కూడా ఓడితే మిగిలిన మూడూ గెలిస్తే గాని సిరీస్ ను చేజిక్కించుకోలేం. ఒకవేళ 2-2తో డ్రా అయినా.. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లొ పాయింట్లు తగ్గుతాయి.

వాళ్ల పే భారం..

బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్, బౌలింగ్ లో అశ్విన్, బుమ్రా పైనే విశాఖ టెస్టును గెలిపించాల్సిన భారం ఉంది. మరీ ముఖ్యంగా రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితేనే మిగతా బ్యాట్స్ మెన్ లో విశ్వాసం వస్తుంది. యువ శుభ్ మన్ గిల్ ఫామ్ గొప్పగా లేదు. రజత్ పటీదార్ లేదా సర్ఫరాజ్ ఇద్దరూ కొత్తవారే. శ్రేయస్ అయ్యర్ గత 10 ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతోనే రోహిత్ చెలరేగాల్సిన అవసరం ఉంది.