Begin typing your search above and press return to search.

అభి'షేక్' కాదు.. ఇషాన్ తుఫాన్.. ఒక‌వేళ ఇత‌డిని తీసుకోకుంటే?

స‌రిగ్గా రెండు నెలల కింద‌టి వ‌ర‌కు కూడా అత‌డు టీమ్ ఇండియా ప్ర‌పంచ‌కప్ ప్ర‌ణాళిక‌ల్లో లేడు.. క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పి.. జాతీయ జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు.

By:  Tupaki Desk   |   16 Feb 2026 9:20 AM IST
అభిషేక్ కాదు.. ఇషాన్ తుఫాన్.. ఒక‌వేళ ఇత‌డిని తీసుకోకుంటే?
X

స‌రిగ్గా రెండు నెలల కింద‌టి వ‌ర‌కు కూడా అత‌డు టీమ్ ఇండియా ప్ర‌పంచ‌కప్ ప్ర‌ణాళిక‌ల్లో లేడు.. క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పి.. జాతీయ జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. దేశ‌వాళీలు ఆడుకుంటూ.. ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తూ పోతున్నాడు. కానీ, ఇప్పుడు టి20 ప్ర‌పంచ క‌ప్ లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. దీనికి ముందు టి20 సిరీస్ ల‌లోనూ అత‌డు మెరిశాడు. వాటికి మించి ప్ర‌స్తుతం అద‌ర‌గొడుతున్నాడు. తాజాగా పాకిస్థాన్ తో లీగ్ మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ తో జ‌ట్టులో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. స‌హ‌చ‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్ ల‌తో, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతుంటే, ఆ లోటు క‌నిపించ‌కుండా మ్యాచ్ ల‌ను గెలిపిస్తున్నాడు. అత‌డే టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్. ఆదివారం కొలంబోలో పాకిస్థాన్ పై టీమ్ఇండియా చేసిన ప‌రుగులు 175. ఇందులో ఇషాన్ కిష‌న్ వే 77 ఉన్నాయంటే అత‌డెంత బాగా ఆడుతున్నాడో తెలుస్తోంది.

ధిక్క‌రించి.. త‌ప్పులు చేసి..

కిష‌న్ వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన అతికొద్ది బ్యాట్స్ మెన్ ల‌లో ఒక‌డు. అయితే, ఆ త‌ర్వాతే అత‌డి ప‌రిస్థితి మారింది. 2023 చివ‌ర్లో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో త‌న బెస్ట్ ఫ్రెండ్ శుబ్ మ‌న్ గిల్ అనారోగ్యం కార‌ణంగా ప్రారంభ మ్యాచ్ ల‌కు దూరం కావ‌డంతో కిష‌న్ కు చాన్స్ ద‌క్కింది. దీనిని అత‌డు స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. గిల్ కోలుకుని రావ‌డంతో జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. దీనిని కిష‌న్ స్పోర్టివ్ గా తీసుకోలేద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. పైగా అంత‌ర్జాతీయ మ్యాచ్ లు లేన‌ప్పుడు దేశ‌వాళీలు ఆడాల‌న్న బీసీసీఐ సూచ‌నను ప‌క్క‌న‌పెట్టాడు. అనారోగ్యం అని, గాయం అని కార‌ణాలు చెప్పాడు. దుబాయ్ లో ప్రైవేట్ పార్టీలో క‌నిపించాడు. అప్ప‌టి త‌న ఐపీఎల్ ఫ్రాంచైజీ నెట్స్ లో పాల్గొన్నాడు కానీ దేశ‌వాళీలు ఆడ‌లేదు. మ‌రో స్టార్ ప్లేయ‌ర్ రిష‌భ్ పంత్ గాయంతో దూరం అయిన స‌మ‌యంలో .. కిష‌న్ ను టెస్టుల్లోకి తీసుకుందాం అనుకునే లోపు ధ్రువ్ జురెల్ రూపంలో యువ వికెట్ కీప‌ర్ దూసుకొచ్చాడు. ఫ‌లితం ఇషాన్ టీమ్ ఇండియాకు దూర‌మ‌య్యాడు. అయితే, కాలం మ‌ళ్లీ అత‌డిని క‌రుణించింది.

ఫేట్ మార్చిన స్మాట్..

ఈ ఏడాది దేశ‌వాళీ టి20 టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో కిష‌న్ అద‌ర‌గొట్ట‌డం అత‌డికి మ‌ళ్లీ లైఫ్ ఇచ్చింది. జార్ఖండ్ కు సార‌థ్యం వ‌హిస్తూ, ఆ జ‌ట్టును చాంపియ‌న్ గా నిలిపిన కిష‌న్.. డిసెంబ‌రు 18న‌ జ‌రిగిన‌ ఫైన‌ల్లో ఏకంగా 49 బంతుల్లో 101 ప‌రుగులు చేసి సెల‌క్ట‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఫ‌లితంగా టీమ్ ఇండియా పిలుపుద‌క్కింది. అయితే, తుది జ‌ట్టులో మాత్రం స్థానం ల‌భించ‌లేదు. ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తో సిరీస్ ల‌లో మ‌రో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ విఫ‌లం కావ‌డంతో కిష‌న్ కు ల‌క్ క‌లిసొచ్చింది. ఏకంగా ప్ర‌పంచ‌క‌ప్ లో ఓపెనింగ్ స్లాట్ ద‌క్కింది.

అభి ఫెయిలైనా..

టి20ప్ర‌పంచ‌క‌ప్ లో రెండు మ్యాచ్ లు (అమెరికా, పాక్ ల‌పై) ఆడిన అభిషేక్ ఖాతానే తెర‌వ‌లేదు. ఒక మ్యాచ్ (న‌మీబియాపై) ఆడిన సంజూ శాంస‌న్ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేదు. కానీ, కిష‌న్ మాత్రం వ‌రుస‌గా 20, 61, 77 ప‌రుగుల‌తో నిల‌క‌డ చూపుతున్నాడు. అభిషేక్/ సంజూల‌ ఫెయిల్యూర్ ప్ర‌భావం జ‌ట్టుపై ప‌డ‌కుండా చూస్తున్నాడు. ఆదివారం పాకిస్థాన్ తో మ్యాచ్ లో మిగ‌తా బ్యాట‌ర్లు ప‌రుగుల‌కు తీవ్రంగా ఇబ్బంది ప‌డ‌గా.. కిష‌న్ మాత్రం అల‌వోక‌గా బాదేశాడు. రెండు జ‌ట్ల మ‌ధ్య తేడా ఎవ‌రు..? అంటే అది ఇషాన్ కిష‌నే. అత‌డు గ‌నుక ఇదే ఫామ్ ను కొన‌సాగిస్తూ ప్ర‌పంచ‌క‌ప్ అందిస్తే.. వ‌న్డే జ‌ట్టులోకి కూడా వ‌చ్చేసిన‌ట్లే..! చివ‌ర‌గా ఒక్క‌మాట‌.. ఒక‌వేళ ఇషాన్ విష‌యంలో సెల‌క్ట‌ర్లు స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోకుంటే..? ఇప్పుడు ప‌రిస్థితి ఎలా ఉండేదో?