ఐపీఎల్‌లో ట్రోఫీలకే కాదు.. వ్యాపారానికీ జాక్‌పాట్! అన్ని జట్లకు కోట్లలో లాభాలు
అవును.. మీరు చదివింది నిజమే! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగిసేసరికి ఒక విషయం క్రిస్టల్ క్లియర్ అయిపోయింది.
By: A.N.Kumar | 1 Jun 2026 10:46 AM ISTమైదానంలో వికెట్లు పడుతున్నాయో లేదో కానీ.. ఫ్రాంచైజీల బ్యాంక్ అకౌంట్లలో మాత్రం పైసల వర్షం కురుస్తోంది. అవును.. మీరు చదివింది నిజమే! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగిసేసరికి ఒక విషయం క్రిస్టల్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ కప్పు గెలవడం అనేది కేవలం అభిమానుల సెంటిమెంట్‌కు సంబంధించిన విషయం మాత్రమే... ఓనర్స్ బిజినెస్‌కు దానికి అస్సలు సంబంధం లేదు!
టాస్ గెలిచినా, మ్యాచ్ ఓడిపోయినా... చివరకు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచినా సరే, ఐపీఎల్ టీమ్ ఓనర్ల ముఖాల్లో మాత్రం 'నవ్వుల నవాబు'లే కనిపిస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్‌లో సిక్సర్లు కొట్టడం కంటే, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడంలో మన ఫ్రాంచైజీలు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాయి.
ఈసాల కప్పు నమదే.. కానీ 'క్యాష్' మాత్రం మనదే!
తాజా ఆర్థిక నివేదికలు చూస్తుంటే క్రికెట్ ప్రేమికులకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మైదానంలో "ఈసాల కప్పు నమదే" అంటూ ఏళ్ల తరబడి ట్రోఫీ కోసం తపిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , బిజినెస్ పిచ్‌పై మాత్రం అందరికంటే ముందు నిలిచింది. ఏకంగా రూ.595 కోట్ల లాభంతో టేబుల్ టాప్ పొజిషన్‌లో కూర్చుంది. ట్రోఫీ రూమ్‌లో ఖాళీగా ఉన్నా, అకౌంట్‌లో మాత్రం స్పేస్ లేనంతగా లాభాలు వచ్చి పడుతున్నాయి.. మిగతా జట్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. లాభాల వేటలో కోట్లు సంపాదించారు.. ఏ టీంకు ఎంత లాభం అంటే?
రాజస్థాన్ రాయల్స్ – ₹549 కోట్ల లాభం
కోల్ కతా నైట్ రైడర్స్– ₹538 కోట్ల లాభం
పంజాబ్ కింగ్స్ – ₹534 కోట్ల లాభం
ముంబై ఇండియన్స్ – ₹501 కోట్ల లాభం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – ₹595 కోట్ల లాభం
చెన్నై సూపర్ కింగ్స్ – ₹552 కోట్ల లాభం
గుజరాత్ టైటాన్స్ – ₹498 కోట్ల లాభం
ఢిల్లీ క్యాపిటల్స్ – ₹486 కోట్ల లాభం
లక్నో సూపర్ జెయింట్స్ – ₹512 కోట్ల లాభం
సన్ రైజర్స్ హైదరాబాద్ – ₹495 కోట్ల లాభం
ఇలా అందరూ వందల కోట్ల లాభాలతో జేబులు నింపుకున్నారు. ఇక్కడ నష్టపోయిన వాడు ఎవడైనా ఉన్నాడంటే.. వందల రూపాయల నెట్ ప్యాక్ రీఛార్జ్ చేసుకుని, మ్యాచ్ చూస్తూ బీపీ పెంచుకున్న సగటు అభిమాని మాత్రమే..
నో లూజింగ్ ఫార్ములా: అసలు ఈ మాయాజాలం ఏంటి?
ఒక్క మ్యాచ్ కూడా ఆడకముందే.. కనీసం టాస్ కూడా వెయ్యకముందే ఐపీఎల్ జట్లు ఎలా లాభాల్లోకి వచ్చేస్తున్నాయో తెలుసా? ఇదంతా బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ మీడియా హక్కులు మహత్యం. ప్రతి ఫ్రాంచైజీకి టీవీ, డిజిటల్ ప్రసారాల ద్వారా కేంద్ర ఆదాయంగా కదలకుండా మెదలకుండా రూ. 480 కోట్లకు పైగా వచ్చి అకౌంట్‌లో పడిపోతుంది. మరి ఖర్చుల సంగతి.. ఆటగాళ్ల వేతనాలు, కోచ్‌లు, విమాన ప్రయాణాలు, హోటల్ స్టేలు, సిబ్బంది ఖర్చులు అన్నీ కలిపినా సగటున అయ్యేది కేవలం రూ. 170 కోట్లు మాత్రమే.. వచ్చిన ఆదాయం రూ. 480+ కోట్లు కాగా.. పెట్టిన ఖర్చు రూ. 170 కోట్లు గా ఉంది. నికర లాభం కనీసం రూ. 310 కోట్లు ఉన్నాయి.
ఇక ఇది కాకుండా జెర్సీపై ముద్రించే స్పాన్సర్‌షిప్‌లు, మైదానంలో విక్రయించే టికెట్లు, డిజిటల్ వ్యూయర్‌షిప్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ఇవన్నీ అదనం. అంటే హోటల్ రూమ్‌లో కూర్చుని కాఫీ తాగుతున్నా సరే ఓనర్లకు నిమిషానికి లక్షల్లో లాభాలు వచ్చి పడుతుంటాయి.
లలిత్ మోదీ మార్క్ 'మనీ మంత్రం'
ఈ అద్భుతమైన బిజినెస్ మోడల్‌ను అప్పట్లోనే డిజైన్ చేసిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి నిజంగా హాట్సాఫ్ చెప్పాలి. క్రికెట్‌ను కేవలం ఒక ఆటలా కాకుండా ప్రతి గల్లీలోనూ అమ్ముడయ్యే ఒక హై-వోల్టేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్ట్‌గా మార్చేశారు.
కార్పొరేట్ బ్రాండ్లకు ఒక జట్టు గెలుస్తుందా.. ఓడుతుందా అనేది అనవసరం. ఆ జట్టును ఎంతమంది చూస్తున్నారు.. తమ లోగో ఎంతమందికి కనిపిస్తుందనేదే ముఖ్యం. టీమ్ 49 పరుగులకే ఆలౌట్ అయినా సరే... ట్రోల్స్ రూపంలోనో మీమ్స్ రూపంలోనో డిజిటల్ మీడియాలో వచ్చే హైప్ స్పాన్సర్లకు చాలు!
కాబట్టి మిత్రులారా.. వచ్చే సీజన్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఓడిపోతే గుండెలు బాదుకోకండి.. నిరుత్సాహపడకండి. ఎందుకంటే మైదానంలో మీ టీమ్ ఓడిపోవచ్చు కానీ.. మీ టీమ్ ఓనర్ మాత్రం కలెక్షన్ల బాక్సాఫీస్ వద్ద భారీ మెజారిటీతో గెలుస్తూనే ఉంటాడు.. ఐపీఎల్‌లో "ఏ జట్టు నష్టపోదు".. కేవలం అభిమానుల గొంతులు తప్ప..
