Begin typing your search above and press return to search.

సెమీస్ ఢోకా లేదు.. ప్రపంచ కప్ లో ఆ జట్టుతోనే పెద్ద ముప్పు

టీమిండియాకు ఇంగ్లండ్ నుంచి మాత్రమే ముప్పు పొంచి ఉంది. లీగ్ దశలో అయినా, సెమీస్ లో అయినా బ్రిటిష్ జట్టను ఓడించడం కాస్త సవాలే.

By:  Tupaki Desk   |   5 Oct 2023 7:49 AM GMT
సెమీస్ ఢోకా లేదు.. ప్రపంచ కప్ లో ఆ జట్టుతోనే పెద్ద ముప్పు
X

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ప్రపంచ కప్ మొదలైంది. పది జట్లూ సర్వ సన్నద్ధం అయ్యాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచ్ లు ఆడతాయి. అంతా మిగతా 9 జట్లతో తలపడతాయి. లీగ్ దశ పూర్తయ్యేసరికి టాప్ 4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు వెళ్తాయి.

ఈ ఆరులో ఆ నాలుగేవో..? సంచలనాత్మకంగా ఆడగల సత్తా ఉన్న వెస్టిండీస్ ప్రస్తుతం ప్రపంచ కప్ లో లేదు. చరిత్రలో తొలిసారి ఆ జట్టు క్వాలిఫై కాలేకపోయింది. దీంతో సెమీస్ కు చేరగల సత్తా ఉన్న ఒక జట్టు పేరు తొలగింది. ఇక కచ్చితంగా సెమీస్ చేరతాయన్న అంచనాలున్న జట్లు ఆరు. అవి భారత్ , ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా. వీటిలోంచి కూడా నాలుగింటిని సెమీస్ కు పరిగణించాలి. అంటే రెండింటిని తీసివేయాలి.


వేటినీ కాదనలేం..ఈ ఆరు జట్లలో సెమీస్ చేరే మూడింటిని మాత్రమే చెప్పమంటే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అని అనుకోవచ్చు. మరొక బెర్తుకు మూడు జట్ల మధ్య మ్యూజికల్ చైర్. వీటిలోనూ పాకిస్థాన్, న్యూజిలాండ్ ను ప్రధాన పోటీదారులుగా పరిగణించవచ్చు. ఐసీసీ టోర్నీల్లో బ్యాడ్ లక్ కు పెట్టింది పేరయినప్పటికీ దక్షిణాఫ్రికాను మరీ తీసిపారేయలేం. కాకపోతే ఉపఖండ పరిస్థితులను బట్టి పాకిస్థాన్ కు అవకాశాలెక్కువ అని చెప్పొచ్చు.

సెమీస్ లో భారత్-పాక్?2011లో భారత్ –పాక్ సెమీస్ లో తలపడ్డాయి. నాడు దాయాదిని మట్టికరిపించిన టీమిండియా ఫైనల్లో శ్రీలంకనూ ఓడించి కప్ కట్టేసింది. కాగా, భారత్ ఈసారి కూడా సెమీస్ లో పాక్ తో తలపడే అవకాశం ఉంది.

ఎందుకంటే.. లీగ్ దశలో టీమిండియా టాప్ లో నిలుస్తుంది అంచనా. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉంటాయి. అప్పుడు 1వ స్థానంలోని టీమిండియాకు, నాలుగో స్థానంలో నిలిచిన పాక్ కు మధ్య సెమీస్ జరుగుతుందని అంచనా వేయొచ్చు.

మనకు ముప్పు..? అంచనా కాస్త అటుఇటు అయిందనుకుంటే.. టీమిండియాకు ఇంగ్లండ్ నుంచి మాత్రమే ముప్పు పొంచి ఉంది. లీగ్ దశలో అయినా, సెమీస్ లో అయినా బ్రిటిష్ జట్టను ఓడించడం కాస్త సవాలే. మలన్ ,బెయిర్ స్టో, రూట్, బట్లర్, బ్రూక్, లివింగ్ స్టోన్ తదితరులతో దుర్బేధ్య బ్యాటింగ్ తో ఉన్న ఇంగ్లిష్ టీమ్.. భారత బౌలర్లకు కఠిన పరీక్ష పెడుతుంది. బౌలింగ్ లోనూ కరన్, వోక్స్, మోయిన్ అలీ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టే చాన్సుంది. ఈ ఒక్క గండం గనుక దాటితే టీమిండియా ప్రపంచ కప్ కొట్టేయడం ఖాయం.