టీమ్ఇండియానే జగజ్జేత.. వరుసగా రెండో టి20 ప్రపంచకప్ టైటిల్
ఇటీవల వరుసగా టీమ్ఇండియాను టెస్టుల్లో క్లీన్ స్వీప్ చేసి, వన్డేల్లోనూ భారత్ గడ్డపై సిరీస్ సాధించి పరాభవం పాల్జేసిన న్యూజిలాండ్ కు సరైన సమాధానం దక్కింది
By: Tupaki Desk | 8 March 2026 10:55 PM ISTఇటీవల వరుసగా టీమ్ఇండియాను టెస్టుల్లో క్లీన్ స్వీప్ చేసి, వన్డేల్లోనూ భారత్ గడ్డపై సిరీస్ సాధించి పరాభవం పాల్జేసిన న్యూజిలాండ్ కు సరైన సమాధానం దక్కింది. టెస్టుల్లో వరుస ఓటములు.. వన్డేల్లో అనూహ్య పరాజయాలు.. కానీ, టి20 ఫార్మాట్ లో మాత్రం పటిష్ఠ జట్టుతో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా అందరి అంచనాలను నిజం చేస్తూ వరుసగా రెండోసారి టి20 ప్రపంచ కప్ టైటిల్ సాధించింది. ఆదివారం గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కఠినమైన ప్రత్యర్థి న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది. అచ్చం సెమీఫైనల్లో ఇంగ్లండ్ తరహాలో టాస్ గెలిచినా, ఫైనల్లోనూ టీమ్ ఇండియాకే బ్యాటింగ్ ఇచ్చి బోల్తాపడింది న్యూజిలాండ్. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏకంగా 255 పరుగులు చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (46 బంతుల్లో 89, 5 ఫోర్లు, 8 సిక్సులు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52, 6 ఫోర్లు, 3 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగి శుభారంభం అందించారు. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించి రికార్డులకెక్కాడు. అభిషేక్-సంజూ దూకుడుతో టీమ్ఇండియా 7.1 ఓవర్లోనే 98 పరుగులు సాధించింది. హాఫ్ సెంచరీ అనంతరం అభిషేక్ వెంటనే ఔటైనా.. అగ్నికి వాయువు తోడైనట్లు సంజూకు ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54, 4 ఫోర్లు, 4 సిక్సులు) జత కలిశాడు. ఇషాన్- సంజూ జోడీ 48 బంతుల్లోనే 105 పరుగులు చేసింది. దీంతో టీమ్ ఇండియా 15.1 ఓవర్లలోనే 200 మార్క్ దాటింది.
300 కొట్టేసేలా కనిపించినా...
15.1 ఓవర్లకే 203 పరుగులు.. సంజూ ఔటయ్యేటప్పటికి టీమ్ఇండియా స్కోరిది. ఈ ఊపు చూస్తే జట్టు 300 కొట్టేసేలా కనిపించింది. లేదా కనీసం 280 పరుగులైనా చేస్తుందని అనిపించింది. కానీ, నీషమ్ వేసిన 16వ ఓవర్లో సంజూ ఔటవడం, అదే ఓవర్ 5వ బంతికి ఇషాన్, చివరి బంతికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) వెనుదిరగడంతో షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 18, సిక్స్, ఫోర్), తిలక్ వర్మ (6 బంతుల్లో 8 నాటౌట్)లను న్యూజిలాండ్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో 16 వ ఓవర్ నుంచి స్కోరు మందగించింది. హార్దిక్ వెనుదిరిగాక.. శివమ్ దూబె (8 బంతుల్లో 26 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్స్ లు) రావడంతో పరిస్థితి మారిపోయింది.
దూబె ధనాధన్...
ఓ దశలో 250 దాటుతుందా? అనే అనుమానం వచ్చినా దూబె దూకుడుతో టీమ్ఇండియా 255 పరుగుల భారీ స్కోరు అందుకుంది. మరీ ముఖ్యంగా 20వ ఓవర్లో దూబె 2 సిక్సులు, 3 ఫోర్లు బాది 24 పరుగులు సాధించడం గమనార్హం. తొలుత సంజూ-అభిషేక్ పార్ట్ నర్ షిప్, చివర్లో దూబె ధనాధన్ మ్యాచ్ లో కివీస్ ను మానసికంగా వెనుకంజ వేసేలా చేశాయి.
బెంగ లేకుండా బౌలింగ్
టి20 ప్రపంచ కప్ లో టీమ్ఇండియాకు అతిపెద్ద బెంగ బౌలింగ్. పేస్ లో అర్షదీప్ సింగ్, స్పిన్ లో వరుణ్ చక్రవర్తిలు తురుపు ముక్కలు అనుకుంటే వారిద్దరే తీవ్రంగా నిరాశపరిచారు. ఎప్పటిలానే మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ దాడి కొనసాగించినా, పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అతడికి తోడుగా నిలిచినా... ప్రధాన బౌలర్లయిన అర్షదీప్, వరుణ్ వైఫల్యం ఇబ్బందిపెట్టింది. కానీ, ఫైనల్లో మాత్రం ఆందోళన లేకపోయింది. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (26 బంతుల్లో 52, 2 ఫోర్లు, 5 సిక్సులు) దూకుడు కొనసాగించినా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (9) విఫలమయ్యాడు. భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర (1)ను బుమ్రా వెనక్కు పంపాడు. ఇక అంతే, న్యూజిలాండ్ ఛేజింగ్ లో తేలిపోయింది. ఫిలిప్స్ (5), చాప్ మన్ (3) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సీఫర్ట్ కు తోడుగా నిలిచేవారు లేకపోవడంతో కివీస్ రెక్కలు విరిగాయి. ఇటీవలి వన్డే సిరీస్ లో వరుస సెంచరీలు కొట్టిన డారిల్ మిచెల్ (17)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో కివీస్ తేలిపోయింది. 16వ ఓవర్లో బుమ్రా వరుస బంతుల్లో నీషమ్ (8), హెన్రీ (0)ని ఔట్ చేసి ప్రత్యర్థి కథ త్వరగా ముగిసేలా చేశాడు. కెప్టెన్ శాంటర్న్ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు, 2 సిక్సులు) పోరాటం కేవలం టీమ్ ఇండియా గెలుపు అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది. 19 ఓవర్లలో 159 పరుగుల వద్ద కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. టీమ్ ఇండియా 95 పరుగుల తేడాతో నెగ్గింది.
