భారత్ – పాక్ మ్యాచ్... 10 సెకన్లకు రూ.40 లక్షలు.. గాల్లో రూ.2,200 కోట్లు!
టీ20 వరల్డ్ కప్ - 2026లో శ్రీలంక వేదికగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను పాకిస్థాన్ బహిష్కరించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Feb 2026 11:01 PM ISTటీ20 వరల్డ్ కప్ - 2026లో శ్రీలంక వేదికగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను పాకిస్థాన్ బహిష్కరించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ టోర్నమెంట్ లోని అన్ని మ్యాచ్ ల కంటే ఎక్కువగా అన్నట్లుగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో... అత్యంత ఆకర్షణీయమైన ఈ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయనే కామెంట్ల వేళ దాదాపు రూ.2,200 కోట్ల విషయం చర్చకు వచ్చింది. ఈ సమయంలో.. పాక్ టైం చూసి ఐసీసీతో ఆడుకుంటుందా అనే చర్చా మొదలైంది!
అవును... టీ20 వరల్డ్ కప్ లో అత్యంత హాట్ టాపిక్ అయిన భారత్ - పాక్ మ్యాచ్ ను ఎలాగైనా నిర్వహించాలని ఐసీసీ ఓ పక్క పట్టుదలతో ఉంటే.. ఇదే అదనుగా తన పంతం నిలుకోవాలన్నట్లుగా పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మెలికలు పెడుతోంది. ఈ సమయంలో.. లాహోర్ లో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖీ, ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం సమావేశమై చర్చించారు. ఈ సమయంలో ఐసీసీ ముందు పీసీబీ పలు డిమాండ్లు ఉంచింది.
ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ లో క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ పరిహారం పెంచడం, టీ20 వరల్డ్ కప్ లో ఆడకపోయినా పార్టిసిపేషన్ ఫీజు చెల్లించడంతో పాటు భవిష్యత్ ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్య హక్కులు ఇవ్వడం వంటి మూడు కండిషన్స్ ను పీసీబీ, ఐసీసీ ముందు పెట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో కండిషన్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. భారత్ - పాక్ - బంగ్లాదేశ్ ట్రైసిరీస్ ప్రతిపాదనను ఐసీసీ ముందు పీసీబీ ఉంచిందని తెలుస్తోంది.
అయితే ఈ నాలుగో కండిషన్ తమ పరిధి వెలుపల ఉంటుందంటూ ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తో శీలంకలో ఆడే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పై స్పష్టత ఇచ్చేందుకు పాక్ కు 24 గంటల డెడ్ లైన్ ను ఐసిసీ విధించినట్లు సమాచారం.
తెరపైకి రూ.2,200 కోట్ల ఆదాయం!:
టోర్నమెంట్ ఏదైనా, వేదిక మరేదైనా.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్ – పాక్ మధ్య మ్యాచ్ అత్యంత లాభదాయమైన మ్యాచ్ గా స్థిరపడింది! ఈ మ్యాచ్ ద్వారా సుమారు రూ.2,200 కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. అందుకే 2012 నుంచి ప్రతీ ప్రధాన టోర్నమెంట్ లోనూ ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉంచేలా ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ విషయంలో మొండిగా ఉంటే మాత్రం... ఐసీసీకి భారీ నష్టం తప్పదని అంటున్నారు!
ఇదే సమయంలో.. ఈ అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ లేకపోవడం వల్ల 10 సెకన్ల కమర్షియల్ స్లాట్ ప్రకటనలకు రూ.40 లక్షల వరకూ ఖర్చవ్వనున్న నేపథ్యంలో... హోస్ట్ బ్రాడ్ కాస్టర్ కు రూ. 200 నుంచి రూ.250 కోట్ల వరకూ ప్రకటనల ఆదాయ నష్టాలను చవిచూడవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ రద్దయితే తమ బోర్డు కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందని చెబుతూ పీసీబీకి శ్రీలంక క్రికెట్ బోర్డు లేఖ రాసి.. మ్యాచ్ ఆడాలని కోరిందని చెబుతున్నారు!
