Begin typing your search above and press return to search.

అది 2003 ప్ర‌పంచ క‌ప్.. భార‌త్ కు శివ‌రాత్రి.. పాక్ కు కాళ‌రాత్రి..!

భార‌తీయులు అత్యంత నిష్టగా జ‌రుపుకొనే పండుగ‌ల్లో ఒక‌టి శివ‌రాత్రి..! ఆ రోజు జాగ‌ర‌ణ‌తో పాటు ఉప‌వాసాలు కూడా ఉంటారు.

By:  Tupaki Desk   |   3 Feb 2026 9:00 PM IST
అది 2003 ప్ర‌పంచ క‌ప్.. భార‌త్ కు శివ‌రాత్రి.. పాక్ కు కాళ‌రాత్రి..!
X

భార‌తీయులు అత్యంత నిష్టగా జ‌రుపుకొనే పండుగ‌ల్లో ఒక‌టి శివ‌రాత్రి..! ఆ రోజు జాగ‌ర‌ణ‌తో పాటు ఉప‌వాసాలు కూడా ఉంటారు. స‌రిగ్గా అదే రోజు క్రికెట్ మ్యాచ్ ఉంటే...? అది కూడా పాకిస్థాన్ తో అయితే..? అందులోనూ మ‌న జ‌ట్టే గెలిస్తే? ఇక చెప్పేదేముంది? 2003లో స‌రిగ్గా అదే జ‌రిగింది...! అప్ప‌టికి టి20లు లేవు. క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ అంటే వ‌న్డేలే! సెల్ ఫోన్లు కూడా పెద్ద‌గా లేవు..! స్మార్ట్ ఫోన్లు అస‌లే లేవు.. అలాంటి స‌మ‌యంలో టీవీలే క్రికెట్ మ్యాచ్ ల మ‌జా అందించే వేదిక‌లు..! ఆ ఏడాది ప్ర‌పంచ క‌ప్ ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగింది. భార‌త్ పాక్ మ్యాచ్ మార్చి 1న శివ‌రాత్రి సంద‌ర్భంగా సెంచూరియ‌న్ లోని సూప‌ర్ స్పోర్ట్స్ పార్క్ లో జ‌రిగింది. 1999 కార్గిల్ యుద్ధం, 2001 భార‌త పార్ల‌మెంటుపై పాక్ మ‌ద్ద‌తున్న ఉగ్ర‌వాదుల దాడి త‌దిత‌ర ఘ‌ట‌న‌ల అనంత‌రం భార‌త్-పాక్ సంబంధాలు బాగా క్షీణించాయి. ఇలాంటి స‌మ‌యంలో రెండు దేశాల మ‌ధ్య జ‌రిగిన క్రికెట్ మ్యాచ్ హైఓల్టేజ్ గా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 273 ప‌రుగులు చేసింది. నాటి ప‌రిస్థితుల్లో ఇది పెద్ద స్కోరే. వ‌సీం అక్ర‌మ్, వ‌కార్ యూనిస్, షోయ‌బ్ అక్త‌ర్ వంటి పేస్ బౌల‌ర్లు, అజ‌హ‌ర్ మొహ‌మూద్, అబ్దుల్ ర‌జాక్ వంటి పేస్ ఆల్ రౌండ‌ర్లు, షాహిద్ ఆఫ్రిది వంటి స్పిన్ ఆల్ రౌండ‌ర్ పాక్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ భార‌త్ టార్గెట్ ను అల‌వోక‌గా ఛేదించింది. మ‌రీ ముఖ్యంగా క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ అప్ప‌ర్ క‌ట్ ల‌తో అల‌రిస్తూ 75 బంతుల్లోనే 98 ప‌రుగులు చేసి భార‌త ప‌తాకాన్ని స‌గ‌ర్వంగా ఎగుర‌వేశాడు. డాషింగ్ బ్యాట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ 14 బంతుల్లో 21 ప‌రుగుల‌తో సూప‌ర్ స్టార్ట్ అందించాడు. రాహుల్ ద్ర‌విడ్ (44 నాటౌట్), యువ‌రాజ్ సింగ్ (50 నాటౌట్) నిల‌వ‌డంతో భార‌త్ 45.4 ఓవ‌ర్లలోనే 276 ప‌రుగులు చేసింది. దీంతో నాటి మీడియాలో... భార‌త్ కు శివ‌రాత్రి.. పాక్ కు కాళ‌రాత్రి శీర్షిక‌న పెట్టిన హెడింగ్ పేలింది. పైగా పండుగ నాడు జ‌రిగిన మ్యాచ్ కావ‌డంతో చాలామందికి సెంటిమెంట్ గా నిలిచింది. మ‌ళ్లీ ఇప్పుడు అదే శివ‌రాత్రి.. అదే పాక్ తో మ్యాచ్..!

ఈ సారి జ‌రుగుతుందా?

గ‌త ఏడాది పెహ‌ల్గాంలో పాకిస్థాన్ మ‌ద్ద‌తు ఉన్న ఉగ్ర‌వాదులు.. భార‌త టూరిస్టుల‌పై జ‌రిపిన పాశ‌విక దాడి, అనంత‌రం భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్, త‌ర్వాత జ‌రిగిన ఆసియా క‌ప్ లో షేక్ హ్యాండ్ లు ఇవ్వ‌కుండా పాక్ క్రికెట‌ర్ల‌కు భార‌త ఆట‌గాళ్లు బుద్ధి చెప్ప‌డం.. ఇలా అనేక ప‌రిణామాలు జ‌రిగాయి. వీటి మ‌ధ్య‌నే బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువుల‌పై దాడులు, హ‌త్య‌ల అంశం వివాదాస్ప‌ద‌మైంది. ఆ దేశ క్రికెట‌ర్ ను ఐపీఎల్ నుంచి త‌ప్పించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. బంగ్లాదేశ్.. టి20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకొంది. ఇదే అద‌నుగా పాకిస్థాన్.. భార‌త్ తో మ్యాచ్ ను ఆడ‌బోమ‌ని బీష్మించింది. కాగా, ఈ సారి శివ‌రాత్రి ఫిబ్ర‌వ‌రి 15 (వ‌చ్చే ఆదివారం) రానుంది. టి20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్ -పాక్ మ్యాచ్ అదే రోజు జ‌ర‌గ‌నుంది. కొలంబో వేదిక. కానీ, ఇప్ప‌టికైతే పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడ‌నంటోంది.

ఆడినా భార‌త్ కు శివ‌రాత్రి.. పాక్ కు కాళ‌రాత్రే..

వ‌చ్చే టి20 ప్రపంచ క‌ప్ లో భార‌త్ హాట్ ఫేవ‌రెట్. డిఫెండింగ్ చాంపియ‌న్ కూడా అయిన మ‌న జ‌ట్టును ఓడించ‌డం అంత సులువు కాదు. పైగా జ‌ట్టు చాలా ప‌టిష్ఠంగా ఉంది. మ‌రోవైపు పాకిస్థాన్ బ‌ల‌హీనంగా ఉంది. కాబ‌ట్టి ఒక‌వేళ భార‌త్ తో మ్యాచ్ ఆడినా.. ఓట‌మి త‌ప్ప‌దు. అంటే..భార‌త్ కు శివ‌రాత్రి.. పాక్ కు కాళ‌రాత్రే అన్న‌మాట‌. ఈ నేప‌థ్యంలోనే 2003 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ నాటి ఉదాహ‌ర‌ణ గుర్తుకొస్తోంది.