పరుగులు 71.. మ్యాచ్ ఫీజు 30 శాతం కోత.. సూర్య.. ఇలాగైతే కష్టమే
కెప్టెన్ గానూ సూర్యపై విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ తో సూపర్ 4 మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ను అసలు బ్యాటింగ్ కే దింపకపోవడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
By: Tupaki Desk | 27 Sept 2025 9:28 AM ISTటీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్.. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ.. టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్..! ఈ మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండడం ఇప్పుడే. టి20లు మొదలైన ఈ 20 ఏళ్లలో చాలా కాలం ధోనీ, కోహ్లి, రోహిత్ కెప్టెన్లుగా కొనసాగారు. గత ఏడాది నుంచి మాత్రం 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం వచ్చింది. 17 ఏళ్ల వయసు నుంచే దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న సూర్యకు టీమ్ ఇండియా అవకాశం మాత్రం 30 ఏళ్లు దాటాక వచ్చింది. అయితే, తనదైన శైలి బ్యాటింగ్ తో టి20 జట్టులో పాతుకుని కెప్టెన్ కూడా అయ్యాడు. ఇప్పుడు ఆసియా కప్ వంటి పెద్ద టోర్నీలోనూ నడిపిస్తున్నాడు.
ఫైనల్ కు ముందు బెంగ..
బ్యాట్స్ మన్ గా సూర్య సత్తా ఏమిటో మనం అందరం చూశాం. స్వదేశంలో, ఇంగ్లండ్ లో, ప్రపంచ కప్ జరిగిన వెస్టిండీస్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు సూర్య. కానీ, కెప్టెన్ అయ్యాక అతడి నుంచి ఆ స్థాయి ఇన్నింగ్స్ లు రావడం లేదు. తాజాగా ఆసియా కప్ లో అతడు ఆరు మ్యాచ్ లలో చేసిన మొత్తం పరుగులు 71. పాకిస్థాన్ పై గ్రూప్ దశలో చేసిన 47 పరుగులే టాప్. గ్రూప్ స్థాయిలో వదిలేస్తే.. సూపర్ 4 లో మూడు మ్యాచ్ లలోనూ విఫలమయ్యాడు. పాకిస్థాన్ మీద అయితే డకౌట్ అయ్యాడు. బంగ్లాపై 5, శ్రీలంకతో మ్యాచ్ లో 12 కొట్టాడు. దీంతో ఆదివారం జరిగే ఫైనల్లో ఏం చేస్తాడో అనే బెంగ పట్టుకుంది. కాకపోతే.. టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉండడంతో సూర్య విఫలం అయినా ప్రభావం పడడం లేదు.
సంజూ ఉండగా.. వద్దంటూ
కెప్టెన్ గానూ సూర్యపై విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ తో సూపర్ 4 మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ను అసలు బ్యాటింగ్ కే దింపకపోవడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. వాస్తవానికి సంజూ టాప్ ఆర్డర్ బ్యాటర్. కానీ, వైస్ కెప్టెన్ గిల్ కోసం ఓపెనింగ్ ను, కెప్టెన్ గిల్ కోసం వన్ డౌన్ ను త్యాగం చేస్తున్నాడు. సూర్యనే విఫలం అవుతున్న నేపథ్యంలో జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకం అవుతోంది.
గిల్ తరుముతున్నాడు..
ఇంగ్లండ్ టూర్ లో టెస్టు కెప్టెన్ గా తన సత్తా చాటిన గిల్.. టి20 ఫార్మాట్ లో సూర్య కెప్టెన్సీకి ఎసరుపెట్టేలా ఉన్నాడు. గత ఏడాది గిల్ సారథ్యంలోనే టీమ్ ఇండియా జింబాబ్వే సిరీస్ ఆడింది. కానీ, అంతలోనే శ్రీలంక టూర్ కు సూర్యను కెప్టెన్ చేశారు. అక్టోబరులో ఆస్ట్రేలియా టూర్ లో భారత్ 3 టి20లు ఆడనుంది. అప్పటికీ సూర్య ఫామ్ అందుకోకుంటే... వచ్చే ఫిబ్రవరిలో జరిగే టి20 ప్రపంచ కప్ లో గిల్ కు కెప్టెన్సీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. సూర్యకు జట్టులో చోటు ఇవ్వకపోయినా ఆశ్చర్యం లేదు.
30 శాతం ఫీజు కోత...
బ్యాటర్ గా విఫలమైనప్పటికీ ఆసియా కప్ లో పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ద్వారా సూర్య దేశంలో హీరోగా నిలిచాడు. ఇక గ్రూప్ దశలో పాక్ తో మ్యాచ్ గెలిచాక సూర్య ఈ విజయాన్ని పెహల్గాం ఉగ్రదాడి బాధితులు, భారత సైనికులకు అంకితం ఇచ్చాడు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది. ఇది రాజకీయ ప్రసంగం అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సూర్య మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పెట్టారు.
ఇదే ఆసియా కప్ లో అనుచితంగా ప్రవర్తించిన పాక్ పేసర్ హారిస్ రౌఫ్ మ్యాచ్ ఫీజులోనూ ఐసీసీ 30 శాతం జరిమానా విధించింది.
