రూ.27 కోట్ల ప్లేయర్.. 3 మ్యాచ్ లు 17 రన్స్.. 2024 సీన్ రిపీట్
నిరుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక సంచలనం.. రెండు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)ని మెరుగ్గా నడిపించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ ను మైదానంలోనే నిందించాడు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా.
By: Tupaki Desk | 2 April 2025 3:15 PM ISTనిరుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక సంచలనం.. రెండు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)ని మెరుగ్గా నడిపించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ ను మైదానంలోనే నిందించాడు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా. అది కూడా దూకుడుగా ఆడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కావడం గమనార్హం.
సహజంగానే నిదానంగా ఆడే జట్టుగా పేరున్న లక్నోపై విరుచుకుపడింది సన్ రైజర్స్. దీంతో దారుణంగా ఓడింది లక్నో. ఆ దెబ్బకు రాహుల్ కెప్టెన్సీ ఊడుతుందని స్పష్టమైంది. గోయెంకాతో మళ్లీ రాయబారం నడిచినా చివరకు రాహుల్ ను రిటైన్ చేసుకోలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్ ను ఏకంగా రూ.27 కోట్ల ఐపీఎల్ రికార్డు ధరకు తీసుకుంది లక్నో. అతడికే కెప్టెన్ చేసింది. కానీ, పంత్ మూడు మ్యాచ్ లలో చేసిన పరుగులు 17. జట్టు కూడా రెండు మ్యాచ్ లలో ఓడింది.
దీంతో పంత్ పై గోయెంకా గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత సీజన్ లో రాహుల్ మాదిరిగానే నేడు పంత్ నూ గోయెంకా
మందలించినట్లు కనిపిస్తోంది. మంగళవారం పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి అనంతరం గోయెంకా కెప్టెన్ పంత్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది నిరుటి ’రాహుల్-గోయెంకా’ ఎపిసోడ్ ను తలపిస్తోందని పేర్కొంటున్నారు. గ్రౌండ్ లోనే కాక డ్రెస్సింగ్ రూమ్ లోనూ పంత్ తో గోయెంకా చర్చించినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది.
కోచ్ నా..? ఫ్రాంచైజీ ఓనరా?
గోయెంకా తీరు చూసినవారు ఆయన కోచ్ నా? లేక ఫ్రాంచైజీ ఓనరా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ ఫలితంపై కెప్టెన్ తో మాట్లాడాల్సిన అవసరం లేదని.. అలాగైతే కోచ్ లు ఎందుకని అంటున్నారు. రాహుల్ పట్ల కూడా గోయెంకా ప్రవర్తను గుర్తు చేస్తున్నారు. కెప్టెన్ కు స్వేచ్ఛ ఇస్తేనే ఫలితాలు బాగుంటాయని చెబుతున్నారు. లీగ్ లోని మిగతా ఫ్రాంచైజీల ఓనర్లు ఎవరూ గోయెంకా తరహాలో వ్యవహరించడం లేదని పేర్కొంటున్నారు.
