Begin typing your search above and press return to search.

టి20 ఇన్నింగ్స్ లో 300... బ‌జ్ బాల్ ఇంగ్లండ్ బాదేసింది..

టి20ల్లో ఒకే ఇన్నింగ్స్ లో 300.. ఈ రికార్డు స్కోరును కొట్టేది టీమ్ ఇండియానే అని అంద‌రూ అనుకుంటున్న మాట‌.

By:  Tupaki Desk   |   13 Sept 2025 11:19 AM IST
టి20 ఇన్నింగ్స్ లో 300... బ‌జ్ బాల్ ఇంగ్లండ్ బాదేసింది..
X

టి20ల్లో ఒకే ఇన్నింగ్స్ లో 300.. ఈ రికార్డు స్కోరును కొట్టేది టీమ్ ఇండియానే అని అంద‌రూ అనుకుంటున్న మాట‌. ఈ స్కోరుకు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ఆగిపోయింది మ‌న జ‌ట్టు. అయితే, కొన్నేళ్లుగా టెస్టుల‌ను వ‌న్డే మాదిరిగా... వ‌న్డేల‌ను టి20 త‌ర‌హాలో ఆడుతోంది ఇంగ్లండ్...! ఇప్పుడు టి20ల్లో 300 కొట్టేసింది. ఈ మైలురాయిని చేరిన తొలి జ‌ట్టుగా నిలిచింది. వ‌న్డేల్లో అత్య‌ధికంగా 498 ప‌రుగులు కొట్టింది ఇంగ్లండ్... మూడేళ్ల కింద‌ట ఈ స్కోరును సాధించింది. వ‌న్డేల్లో 500 కొట్టే జ‌ట్టుగా కూడా ఇప్ప‌టికే ఇంగ్లండ్ కు పేరుంది. ఇలా చూస్తే టి20ల‌ను ఎలా ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తుందో అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇటీవ‌లి కాలంలో కాస్త జోరు త‌గ్గినా.. తాజాగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టి20లో దుమ్మురేపింది.

సాల్ట్... ద‌బిడి దిబిడి...

ఫిల్ సాల్ట్.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో మ‌నంద‌రికీ సుప‌రిచిత‌మే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త‌ర‌ఫున సాల్ట్ ఆడిన విధ్వంస‌క‌ ఇన్నింగ్స్ లు చూశాం. ఇప్పుడు ఇంగ్లండ్ ఓపెన‌ర్ గా వ‌చ్చిన అత‌డు 141 ప‌రుగుల బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 60 బంతుల్లోనే 15 ఫోర్లు, 8 సిక్సుల‌తో ఈ స్కోరు సాధించాడు. మ‌రో ఓపెన‌ర్ జాస్ బ‌ట్ల‌ర్ 30 బంతుల్లో 83, 8 ఫోర్లు, 7 సిక్సులు కూడా చెల‌రేగ‌డంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లే కోల్పోయి 304 ప‌రుగుల రికార్డు స్కోరు సాధించింది. సాల్ట్, బ‌ట్ల‌ర్ 47 బంతుల్లోనే 126 ప‌రుగులు చేశారు. వీరికి ఆల్ రౌండ‌ర్ బెతెల్ (26), కెప్టెన్ బ్రూక్ (41) అండ‌గా నిలిచారు. సాల్ట్ 39 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. టి20ల్లో అత‌డిది మూడో అత్య‌ధిక స్కోరు.

300 కొట్టిన తొలి టెస్టు జ‌ట్టు...

నిరుడు గాంబియాతో జ‌రిగిన టి20 మ్యాచ్ లో జింబాబ్వే 344 ప‌రుగులు చేసింది. ఇది టి20ల్లో రికార్డు. రెండేళ్ల కింద‌ట నేపాల్ 314 ప‌రుగులు చేసింది. కానీ, ఒక టెస్టు దేశం సాధించిన అత్య‌ధిక స్కోరు మాత్రం ఇంగ్లండ్ దే. గ‌త ఏడాది భార‌త్... బంగ్లాదేశ్ పై 297 ప‌రుగులు బాదేసింది.

-గ‌త వారం ద‌క్షిణాఫ్రికాను వ‌న్డేల్లో 342 ప‌రుగుల అత్యంత భారీ తేడాతో ఓడించింది ఇంగ్లండ్‌. ఇప్ప‌డు టి20లోనూ తొలిసారిగా 300 స్కోరు చేయ‌డ‌మే కాదు.. ద‌క్షిణాఫ్రికాను 158 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. దీంతో 146 ప‌రుగుల తేడాతో నెగ్గింది. అంత‌ర్జాతీయ టి20లో ఇదే అతిపెద్ద మార్జిన్.