Begin typing your search above and press return to search.

ధోనీ ఆడ‌తాడు.. సంజూ వ‌స్తాడు!

గ‌త సీజ‌న్ లో జ‌ట్టు వ‌రుస వైఫ‌ల్యాల‌తో పాటు రుతురాజ్ గాయం కార‌ణంగా ధోనీ మ‌ళ్లీ ప‌గ్గాలు అందుకోవాల్సి వ‌చ్చింది. ఇదంతా అయిపోయింది.. మ‌రి వ‌చ్చే సీజ‌న్ కు ఎలా..?

By:  Tupaki Desk   |   7 Nov 2025 9:00 PM IST
ధోనీ ఆడ‌తాడు.. సంజూ వ‌స్తాడు!
X

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)..! అటు ఫ్యాన్ బేస్ లో కాని.. ఇటు బ్రాండ్ వ్యాల్యూలో కానీ.. సీఎస్కేను కొట్టే జ‌ట్టే లేదంటే ఒప్పుకోక త‌ప్ప‌దు..! అలాంటి జ‌ట్టు గ‌త రెండు సీజ‌న్లుగా దారుణంగా విఫ‌లం అవుతోంది.. స్టార్ ఆట‌గాళ్లు రాణించ‌క‌పోవ‌డం, ఆల్ రౌండ‌ర్లు ఆదుకోక‌పోవ‌డం, బౌల‌ర్లు తేలిపోవ‌డం.. కెప్టెన్ అనే ఆట‌గాడు న్యాయం చేయ‌లేక‌పోవ‌డంతో సీఎస్కే జ‌ట్టు చాలా బ‌ల‌హీనంగా మారింది. ఒక‌ప్పుడు ఐదుసార్లు టైటిల్ కొట్టిన టీమ్ ఇదేనా? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు వ‌స్తున్నాయి. ఇక దీనికి అస‌లు కార‌ణం ఏమిటి? అని ఆలోచిస్తే సార‌థ్యంలో దిగ్గ‌జ ఆట‌గాడు మ‌హేంద్ర‌సింగ్ ధోనీని మ‌రిపించే స్థాయి ఆట‌గాడు లేక‌పోవ‌డ‌మే. కొన్నాళ్లు ఆల్ రౌండ‌ర్ రవీంద్ర జ‌డేజా, మ‌రికొన్నాళ్లు బ్యాట్స్ మ‌న్ రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ ఇచ్చినా రాణించ‌లేక‌పోయారు. గ‌త సీజ‌న్ లో జ‌ట్టు వ‌రుస వైఫ‌ల్యాల‌తో పాటు రుతురాజ్ గాయం కార‌ణంగా ధోనీ మ‌ళ్లీ ప‌గ్గాలు అందుకోవాల్సి వ‌చ్చింది. ఇదంతా అయిపోయింది.. మ‌రి వ‌చ్చే సీజ‌న్ కు ఎలా..?

45 ఏళ్ల వ‌య‌సులో...

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ వ‌య‌సు ఇప్పుడు 44 ప్ల‌స్. అంటే 45 న‌డుస్తోంది. 2008 నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ అంటే ధోనీ.. ధోనీ అంటే చెన్నై సూప‌ర్ కింగ్స్. లీగ్ లో ఏకైక ఫ్రాంచైజీకి మాత్ర‌మే ఆడిన‌ (మ‌ధ్య‌లో రెండేళ్లు పుణె సూప‌ర్ జెయింట్స్) ఇద్ద‌రే ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌లో ధోనీ ఒక‌రు. మ‌రొక‌రు దిగ్గ‌జ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి (రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు). అయితే, ధోనీ వ‌చ్చే సీజ‌న్ కు అందుబాటులో ఉంటాడా..? ఈ వ‌య‌సులోనూ అత‌డు కెప్టెన్సీ చేస్తాడా? అనే అనుమానాలు బ‌లంగా ఉన్నాయి. ఈ ఏడాది సీజ‌న్ లో ధోనీ త‌ల్లిదండ్రులు ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు గ్రౌండ్ కు రావ‌డంతో అత‌డి రిటైర్మెంట్ పై బ‌లంగా ఊహాగానాలు వినిపించాయి. అయితే, అవి నిజం కాలేదు.

అత‌డు ఆడ‌తాడు.. ఇత‌డు వ‌స్తాడు...

వ‌చ్చే సీజ‌న్ లో సీఎస్కే బ‌లంగా పుంజుకోవాలంటే జ‌ట్టును రీవ్యాంప్ చేయాల్సిందే. మ‌రి.. కెప్టెన్ ఎవ‌రు..? అస‌లు ధోనీ ఆడ‌తాడా? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వ‌చ్చింది. ధోనీ 2026లోనూ ఆడ‌తాడ‌ని సీఎస్కే వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. ఈ మేర‌కు అత‌డు త‌మ‌కు స‌మాచారం ఇచ్చాడ‌ని సీఎస్కే సీఈవో విశ్వ‌నాథ‌న్ తెలిపాడు. కాగా, రాబోయే సీజ‌న్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ను తీసుకోవాల‌ని సీఎస్కే భావిస్తోంది. దీనిపై చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. సంజూ రాజ‌స్థాన్ కెప్టెనే అయినా.. అక్క‌డ కొంత ఇబ్బంది ప‌డుతున్నాడు. చెన్నైకు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ క‌మ్ ఓపెన‌ర్ అవ‌స‌రం ఉండ‌డంతో ఇటువైపు వ‌చ్చే చాన్సుంది. అదే జ‌రిగితే.. బ్యాటింగ్ లో చాలా వీక్ గా ఉన్న చెన్నైకు బ‌లం చేకూరిన‌ట్లే.