Begin typing your search above and press return to search.

సచిన్ పేరు పెట్టుకుని.. అతడి రికార్డునే చెరిపేశాడు..

అతడిని ఓపెనింగ్ కు పంపి సాహసం చేసింది న్యూజిలాండ్. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న రచిన్.. ఆడుతున్న తొలి వరల్డ్ కప్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 11:11 AM GMT
సచిన్ పేరు పెట్టుకుని.. అతడి రికార్డునే చెరిపేశాడు..
X

అతడసలు స్పెషలిస్ట్ బ్యాట్స్ మనే కాదు.. ప్రపంచ కప్ ముందు వరకు ఎంపిక ప్రణాళికల్లోనే లేడు.. ఓపెనర్ గా పంపుతారని ఆలోచనే లేదు.. కానీ, అంతా ఇలానే జరిగింది.. ఫలితం మాత్రం అద్భుతంగా ఉంది. ఎనిమిది మ్యాచ్ లలో మూడు సెంచరీలు.. రెండు అర్ధ సెంచరీలు.. ఓపెనింగ్ కు దిగితే పరుగులు ప్రవాహమే.. రికార్డులు అతడికి దాసోహమే.. ఇంకో రెండు-మూడు మ్యాచ్ లు ఉండగానే అతడు ప్రపంచ కప్ లో 500 పరుగులకు దగ్గరకు వచ్చేశాడు.

కుర్రాడు కేక..

న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్, భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర ప్రపంచ కప్ లో మామూలు జోరు మీద లేడు. ఏదో ప్రయోగాత్మకంగా ఓపెనింగ్ కు పంపితే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. పాకిస్థాన్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో రచిన్ ఓపెనర్ గా దిగి మరో సెంచరీ కొట్టాడు. ఈ టోర్నీలో అతడికిది మూడో శతకం. అతడు చేసిన సెంచరీలు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి పెద్ద జట్లపైనే కావడం విశేషం. భారత్ మీద కూడా 75 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన రచిన్.. దక్షిణాఫ్రికా మీద మాత్రమే 9 పరుగులకు ఔటయ్యాడు. ఇక పాక్ తో మ్యాచ్ లోనూ సెంచరీ ద్వారా రచిన్ రవీంద్ర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

మొదటి కప్.. అయినా బెరుకు లేదు..

23 ఏళ్ల రచిన్ రవీంద్ర ప్రధానంగా స్పిన్ ఆల్ రౌండర్. ఒక్కమాటలో చెప్పాలంటే మన రవీంద్ర జడేజా లాగా. కానీ, అతడిని ఓపెనింగ్ కు పంపి సాహసం చేసింది న్యూజిలాండ్. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న రచిన్.. ఆడుతున్న తొలి వరల్డ్ కప్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కివీస్ బ్యాట్స్ మన్ గ్లెన్ టర్నర్ 1975 వరల్డ్‌కప్‌లో రెండు, మార్టిన్ గప్టిల్ 2015లో రెండు, 2019లో కేన్‌ విలిమయ్సన్‌ రెండు శతకాలు సాధించారు. వారందరినీ తొలి ప్రపంచ కప్ లోనే వెనక్కునెట్టాడు రచిన్. ఇక టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కూడా బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఆయన పేరు పెట్టుకుని..

రచిన్ తండ్రిది బెంగళూరు. 30 ఏళ్ల కిందటే న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడిన అతడు.. తన ఆరాధ్య క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ ఇద్దరి పేర్లూ కలిసివచ్చేలా తన కొడుక్కి రచిన్ రవీంద్ర అని పేరు పెట్టుకున్నాడు. అందుకేనేమో రచిన్ చెలరేగిపోతున్నాడు. పాతికేళ్ల వయసులోపే వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. రచిన్‌ 23 ఏళ్ల 351 రోజుల వయసులో 3 శతకాలు సాధించగా.. సచిన్‌ టెండూల్కర్‌ కు 22 ఏళ్ల 313 రోజుల వయసులో ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు చేశాడు. కాగా, ఈ వరల్డ్ కప్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో 74.71 సగటుతో 107.39 స్ట్రైక్ రేట్‌తో రచిన్ 523 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ మరో లీగ్ మ్యాచ్ తో పాటు సెమీస్ కూడా ఆడడం ఖాయం. వీలైతే ఫైనల్ కూ చేరినా ఆశ్చర్యం లేదు. మరి రచిన్ ఇంకెన్ని పరుగులు చేస్తాడో?