Begin typing your search above and press return to search.

ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంక ఘోర ప్రదర్శన వెనుక భారీ కుట్ర?

ఈ టోర్నీలో ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే ఆ జట్టు గెలిచింది.

By:  Tupaki Desk   |   11 Nov 2023 10:26 AM IST
ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంక ఘోర ప్రదర్శన వెనుక భారీ కుట్ర?
X

తాజాగా జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో ఘోరంగా ఫెయిల్ అయిన శ్రీలంక జట్టు ఇంటికి వెళ్లిపోవటం తెలిసిందే. ఈ టోర్నీలో ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే ఆ జట్టు గెలిచింది. నెదర్లాండ్స్ తో పాటు ఇంగ్లండ్ జట్టు మీద మాత్రమే గెలిచింది. మిగిలిన జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. ఇంతటి పేలవమైన ప్రదర్శన అనంతరం షాకింగ్ పరిణామాలు మొదలయ్యాయి.

ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంక జట్టు చెత్త ప్రదర్శనపై స్పందించిన శ్రీలంక క్రీడా శాఖ తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేయటమే కాదు.. ఆ జట్టు చీఫ్ సెలక్టర్ ప్రమోదయ విక్రమ సింఘె సంచలన ఆరోపణలు చేవారు. తమ జట్టు ఘోర ప్రదర్శన వెనుక.. బయట శక్తులు కుట్ర చేశాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కారణంతోనే తమ జట్టు ఘోర వైఫల్యాన్ని చవి చూసినట్లుగా వ్యాఖ్యానించారు.

తమ జట్టు నుంచి ఇంతటి పేలవమైన ఆటతీరును తాను అస్సలు ఊహించలేదన్న విక్రమ సింఘె.. ‘‘ఘోర ప్రదర్శన వెనుక ఏదో కుట్ర ఉందనిపిస్తోంది. బయట శక్తులు ప్రభావం చూపించి ఉంటాయి. వాటి గురించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు నాకు రెండు రోజులు టైం ఇవ్వండి’’అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు.. శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని రద్దు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

గురువారం శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని రద్దు చేసే నిర్ణయానికి ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపటం ఒక ఎత్తు అయితే.. అంతకు ముందు షమ్మి సిల్వా సారథ్యంలోని క్రికెట్ బోర్డు కార్యవర్గ అప్పీల్ ను న్యాయస్థానం పునరుద్ధరించిన వేళ.. పార్లమెంటు తీర్మానం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఓటమి తర్వాత శ్రీలంక క్రీడల మంత్రి శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేయటం తెలిసిందే. దీని స్థానే ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తంగా లంక జట్టు ఘోర వైఫల్యం.. ఆ దేశ క్రికెట్ బోర్డుకే ఏసురు పెట్టేలా చేసిందని చెప్పాలి.