Begin typing your search above and press return to search.

భారతీయులే తమ విజయ రహస్యమన్న అఫ్ఘాన్ కెప్టెన్!

అఫ్జాన్ జట్టు వరుస విజయాల మీద చర్చ జరుగుతున్న వేళ.. ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 4:40 AM GMT
భారతీయులే తమ విజయ రహస్యమన్న అఫ్ఘాన్ కెప్టెన్!
X

తాజాగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అప్ఘానిస్తాన్ జట్టు సంచలనాల మీద సంచనాల్ని క్రియేట్ చేయటం తెలిసిందే. సాధారణంగా ప్రపంచకప్ టోర్నీలో ఒకట్రెండు సంచనాలు చోటు చేసుకోవటం.. తమ సత్తా చాటటం.. అందరి చూపు తమ మీద పడేలా చేసుకోవటం తెలిసిందే. తాజా ప్రపంచ కప్ లో ఆప్ఘానిస్తాన్ జట్టుకు ఇలాంటి పేరు ప్రఖ్యాతులే వచ్చాయి.

ఒకట్రెండు బలమైన జట్లను ఓడించటం అప్పుడప్పుడు జరిగేదే. కానీ.. ఈ ప్రపంచ కప్ లో మాత్రం అందుకు భిన్నంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను ఓడించటం ద్వారా అందరి చూపు తమ మీద పడేలా చేశారు అఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులు. సరైన శిక్షణ లేకున్నా.. పరిమితమైన నిధులతో తమ సత్తా చాటిన వీరి తీరు.. ఈ టోర్నీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంగ్లండ్ తో సంచలన విజయాలకు బోణీ కొట్టిన ఈ జట్టు ఆ తర్వాత పాకిస్థాన్.. శ్రీలంకలతో జరిగిన మ్యాచ్ లలో తమ సత్తా చాటింది. అఫ్జాన్ జట్టు వరుస విజయాల మీద చర్చ జరుగుతున్న వేళ.. ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ అత్యుత్తమ ప్రదర్శనకు కారణం భారతీయులేనని.. భారతీయ అభిమానుల మద్దతుతోనే తాము విజయాల్ని సాధిస్తున్నట్లుగా చెబుతూ.. ‘‘భారత అభిమానుల మద్దతే మా విజయ రహస్యం’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

తాము ఆడిన ప్రతి మ్యాచ్ కు భారీగా క్రికెట్ అభిమానులు తరలి వస్తూ.. తమను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇదే తమకు అతి పెద్ద స్ఫూర్తిగా ఆప్ఘాన్ కెప్టెన్ పేర్కొన్నారు. అంతేకాదు.. భారత్ అభిమానుల మద్దతుతో పాటు తమ మైండ్ సెట్ మార్చుకోవటం కూడా వరుస విజయాలకు కారణమన్న అతడు.. ‘‘మైదానంలోనే కాదు బయట కూడా భారత ప్రజలు మా మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. చాలామంది మమ్మల్ని అఫ్ఘానిస్తాన్ క్రికెటర్లుగా గుర్తిస్తున్నారు. చాలా ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తున్నారు. ఒకసారి ఒక ట్యాక్సీ డ్రైవర్ నా దగ్గర డబ్బులు తీసుకోలేదు. భారత ప్రజలు మమ్మల్నిఎంతలా ప్రేమిస్తున్నారని చెప్పటానికి ఇదో చక్కటి నిదర్శనం’’ అంటూ తన అనుభవాల్ని చెప్పుకొచ్చారు.

గత ప్రపంచ కప్ లో తాము ఒక మ్యాచ్ లోనే విజయం సాధించామని.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా విజయాల్ని సాధించినట్లు చెప్పారు. మూడు అంశాలు తమను ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వటానికి కారణమైనట్లు చెబుతూ.. ‘‘నమ్మకం.. కఠోర శ్రమ.. ప్రతిభ.. ఈ మూడు ముఖ్యాంశాలు మా జట్టులో ఉన్నాయి. మాపై మాకు నమ్మకం ఉంది. ఇంగ్లండ్ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత ఆ నమ్మకం రెట్టింపు అయ్యింది. పాక్ తో గెలిచిన తర్వాత అది మరింత పెరిగింది. ఇప్పుడు మేం వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. మా ఫోకస్ అంతా ఫ్యూచర్ మీదే. ప్రతి మ్యాచ్ కు మరింత రాణిస్తూ మరింత మెరుగు అవ్వాలన్నదే లక్ష్యం’’ అని చెప్పారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం మరొకటి ఉంది. వేర్వేరు దేశాల్లో ఉండే అప్ఘాన్ జట్టును ఒక చోటుకు చేర్చి.. వారికి ట్రైనింగ్ ఇవ్వటం.. వారినో జట్టుగా ప్రపంచానికి చూపించటంలో మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే.