Begin typing your search above and press return to search.

తిన‌టానికి తిండికి తికాణా లేదు.. కోట్ల‌కు కోట్లు పెట్టి 3-4 బెడ్‌రూమ్ ఇల్లు కొంటారా?

రూ.5ల‌క్ష‌లకే ఐవిఆర్.సిఎల్ సంస్థ హైద‌రాబాద్ లోని చిత్ర‌పురి కాల‌నీలో సింగిల్ బెడ్ రూమ్ ల‌ను నిర్మించి దాదాపు 1000 కుటుంబాల‌ను ఆదుకుంది

By:  Tupaki Desk   |   24 April 2026 12:00 PM IST
తిన‌టానికి తిండికి తికాణా లేదు.. కోట్ల‌కు కోట్లు పెట్టి 3-4 బెడ్‌రూమ్ ఇల్లు కొంటారా?
X

రూ.5ల‌క్ష‌లకే ఐవిఆర్.సిఎల్ సంస్థ హైద‌రాబాద్ లోని చిత్ర‌పురి కాల‌నీలో సింగిల్ బెడ్ రూమ్ ల‌ను నిర్మించి దాదాపు 1000 కుటుంబాల‌ను ఆదుకుంది.. ఈరోజుల్లో నిర్మాణ రంగ‌ వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయి కాబ‌ట్టి అంత త‌క్కువ రేటుకు కుద‌ర‌దు కానీ.. చాలా నిరుపేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇంత‌కంటే తికాణా ఏమీ లేదు. అల్పాదాయ వ‌ర్గాలు నివ‌శించేందుకు ఒక భ‌వ‌న స‌ముదాయాన్ని అయినా నిర్మించాల‌నే ప్ర‌తిపాద‌న రియ‌ల్ట‌ర్ల వ‌ద్ద లేదు. డ‌బ్బును క‌ళ్లు మూసుకుని విసిరేసే అధిక ఆదాయ వ‌ర్గాల‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తూ 3 బీహెచ్ కే , 4 బీహెచ్ కే, ఖ‌రీదైన విల్లాల‌ను, ఇండివిడ్యువ‌ల్ ఇండ్ల‌ను మాత్ర‌మే నిర్మించే ప్ర‌తిపాద‌న‌ల‌తో ఉంటున్నారు. ఇది నిజంగా భార‌త‌దేశంలోని 150 కోట్లు పైబ‌డిన జ‌నాభా నివాస‌ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రంచ‌గ‌ల‌దు?

తిన‌డానికి తిండి లేదు.. చేయ‌డానికి ప‌ని లేదు.. ఉండ‌టానికి గూడు లేదు... ! ఇలాంటి స‌మ‌స్య‌ల‌తోనే చాలా మంది ఉన్నారు. నెల‌వారీ సంపాద‌న నుంచి 30-40 శాతం కేటాయించి సొంత ఇంటిని కొనుగోలు చేయాల‌ని క‌ల‌లుగ‌నేవారి సంఖ్య అంత‌కంత‌కు త‌గ్గుతోందే కానీ పెర‌గ‌డం లేదు. ప్ర‌భుత్వాలు బ‌య‌టికి భార‌తావ‌ని గొప్ప‌గా వెలిగిపోతోంద‌ని ప్ర‌చారం చేసినంత సులువుగా ప్ర‌జ‌ల జీవ‌నం లేనే లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఆదాయానికి మించి ఖ‌ర్చులు పెరిగాయి.. నిత్యావ‌స‌రాల‌ ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో మూడు బెడ్ రూములు, నాలుగు బెడ్ రూములు ఉండే ఇళ్ల‌ను కోట్ల‌కు కోట్లు వెచ్చించి ప్ర‌జ‌లు కొనుగోలు చేయ‌గ‌ల‌రా? పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నేడు రియల్టర్లు - డెవలపర్లు కేవలం అధిక ఆదాయ వర్గాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. మార్కెట్‌లో ఎక్కడ చూసినా 3 BHK, 4 BHK ఫ్లాట్లు, విలాసవంతమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల సందడి మాత్రమే కనిపిస్తోంది. భారీగా లాభాలను తెచ్చిపెట్టే లగ్జరీ సెగ్మెంట్‌పై ఉన్న శ్రద్ధ సామాన్యుడు కొనుగోలు చేయగలిగే చిన్న ఇళ్లపై లేకపోవడం గమనార్హం. అల్పాదాయ వర్గాల కోసం కనీసం ఒక భవన సముదాయాన్ని నిర్మించాలనే ఆలోచన కూడా నేటి రియల్టర్ల వద్ద లేకపోవడం సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తోంది.

ముంబై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్, దిల్లీ వంటి మహానగరాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2025 నాటి గణాంకాల ప్రకారం.. ముంబైలో 1 BHK ఇళ్ల లాంచింగ్‌లు దాదాపు 50 శాతం పడిపోయాయి. గతంలో ఏడాదికి సగటున 20,000 యూనిట్లు అందుబాటులోకి వచ్చే చోట.. ఇప్పుడు ఆ సంఖ్య పది వేల లోపుకు పరిమితమైంది. కోవిడ్ అనంతర కాలంలో స్టాక్ మార్కెట్ లాభాలు, స్టార్టప్ విజయాలతో సంపన్న వర్గాల కొనుగోలు శక్తి పెరగడంతో బిల్డర్లు అందరూ పెద్ద ఇళ్ల వైపే మొగ్గు చూపారు. దీనివల్ల ముంబై వంటి నగరాల్లో సగటు ఇంటి ధర 3 కోట్ల రూపాయలకు చేరింది.. ఇది సామాన్య మధ్యతరగతి జీవి ఊహకు కూడా అందనంత దూరం. ఇది కేవ‌లం ముంబైకే ప‌రిమితం కాదు హైద‌రాబాద్, బెంగ‌ళూరు వంటి మెట్రోల నుంచి విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి వంటి టూటైర్ సిటీల‌లో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

నిజానికి 150 కోట్లకు పైబడిన జనాభా కలిగిన భారతదేశంలో నివాస సమస్యను కేవలం లగ్జరీ ఇళ్లతో పరిష్కరించగ‌ల‌రా. మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నట్లుగా రియల్ ఎస్టేట్ రంగం మధ్యతరగతి ప్రజలను పూర్తిగా విస్మరించింది. కోటి రూపాయలు వెచ్చించినా నగరం నడిబొడ్డున కనీస వసతులు లేని చిన్న ఇల్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ అధిక ధరల భారం భరించలేక సామాన్యులు నగరం వెలుపల ఎక్కడో దూరంగా ఉన్న శివారు ప్రాంతాలకు తరలిపోవాల్సి వస్తోంది. కొనుగోలు శక్తికి.. మార్కెట్ ధరలకు మధ్య ఉన్న అగాధం నానాటికీ పెరుగుతోంది.

అయితే విలాసవంతమైన ఇళ్ల విక్రయాలు మందగించినప్పుడు మార్కెట్ మళ్లీ వాస్తవంలోకి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. లాభాల వేటలో పడి సామాన్యుడిని మరిచిన నిర్మాణ రంగం.. అమ్మకాలు తగ్గినప్పుడు తిరిగి మధ్యతరగతి వైపు చూడక తప్పదు. కేవలం ప్రభుత్వ పథకాలకు మాత్రమే పరిమితం కాకుండా.. ప్రైవేట్ డెవలపర్లు కూడా సామాజిక బాధ్యతతో చిన్న ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలి. అప్పుడే దేశంలోని మెజారిటీ ప్రజల నివాస సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. లేదంటే ఆకాశహర్మ్యాల నీడలో సామాన్యుడి సొంతింటి కల కేవలం కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్ర‌జ‌ల ఆదాయాలు అమాంతం పెరిగిపోయాయి! అనే ప్ర‌చారం ఓవైపు జ‌రుగుతున్నా.. వాస్తవంలో ప‌రిస్థితి వేరుగా ఉంది.. ఆదాయాలు పెరిగినా ఒక‌టో తేదీ త‌ర్వాత అప్పుల కోసం వెతికే భార‌త‌మే ఎక్కువ‌గా క‌ళ్ల ముందు గోచ‌రిస్తుంది. అందువ‌ల్ల డ‌బ్బును ఆదా చేసి, పొడుపుగా దాచుకుని సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చుకునే బాప‌తు చాలా ప‌రిమితంగా ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు.