Begin typing your search above and press return to search.

తగ్గేదేలే.. మరో వివాదంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌!

By:  Tupaki Desk   |   9 Nov 2022 6:52 AM GMT
తగ్గేదేలే.. మరో వివాదంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌!
X
ఇప్పటికే ఒక మహిళతో న్యూడ్‌ వీడియో కాల్‌ మాట్లాడుతూ దొరికిపోయారంటూ హిందూపురం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీల మధ్య తీవ్ర స్థాయి విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీసింది. అంతేకాకుండా స్వయంగా గోరంట్ల మాధవ్‌ నా కొడుకుల్లారా అంటూ కొన్ని మీడియా అధినేతలను, ప్రతిపక్ష నేత చంద్రబాబును, టీడీపీ నేత చింతకాయల విజయ్‌ను తీవ్రంగా దూషించిన సంగతి తెలిసిందే.

న్యూడ్‌ వీడియో కాల్‌ వ్యవహారం దగ్గర నుంచి లోప్రొఫైల్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తూ వస్తున్నారు.. గోరంట్ల మాధవ్‌. అయినా సరే మరోమారు ఇంకో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో తాను ఉన్న అద్దె ఇంటి యజమానికి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదని బాధితుడు ఆరోపిస్తుండటం కలకలం రేపుతోంది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే.. బాధితుడు మల్లిఖార్జునరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అనంతపురంలోని రాంనగర్‌ 80 అడుగుల రోడ్డులో ఏడున్నర సెంట్లలో రెండంతస్తుల ఇల్లు ఉంది. గోరంట్ల మాధవ్‌ ఎంపీగా గెలిచాక తాను ఉండటం కోసం మల్లికార్జునరెడ్డి ఇంటిని అద్దెకు అడిగారు. 6 నెలలే ఉండి వేరే ఇంటికి మారతానని అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. గడువు దాటినా ఖాళీ చేయలేదు.. సరికదా అద్దె కూడా కట్టడంలేదు. మరికొన్ని నెలలపాటు ఇంట్లో ఉండేలా పెద్దమనుషుల ద్వారా వ్యవహారం నడిపారు. ఇప్పటికి మూడేళ్లయినా అద్దెకానీ, విద్యుత్తు బిల్లులుకానీ చెల్లించలేదు.

దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో ఇల్లు ఖాళీ చేయాలని మల్లిఖార్జునరెడ్డి.. వైఎస్సార్‌సీపీ గోరంట్ల మాధవ్‌ను కోరారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు, పలువురు రాజకీయ నాయకులు కల్పించుకుని మరో 2 నెలలు (అక్టోబరు వరకు) ఎంపీ మాధవ్‌కు గడువు ఇప్పించారు.

అక్టోబర్‌ ముగిసి నవంబర్‌ వచ్చినా వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇల్లు ఖాళీ చేయలేదు. అద్దె, కరెంటు బిల్లులు సైతం కట్టలేదని బాధితుడు చెబుతున్నారు. దీంతో బాధితుడు మల్లిఖార్జునరెడ్డి కొందరు పెద్దలతో కలిసి వెళ్లి తన ఇంటిని ఖాళీ చేయాలని కోరడానికి ప్రయత్నించగా ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరోసారి వాగ్వాదానికి దిగారని సమాచారం.

తాను ఇల్లు మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారని ఇంటి యజమాని మల్లికార్జునరెడ్డి చెబుతున్నారు. సీఐలు శివరాముడు, జాకీర్‌ హుస్సేన్‌ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఎంపీ మాధవ్‌ వినకపోగా తనను బెదిరిస్తున్నారని వాపోయారు. తనకు ఇప్పటివరకు అద్దె కింద రూ.13 లక్షలు, విద్యుత్తు బిల్లు కింద రూ. 2,50,413 చెల్లించాల్సి ఉందని మల్లిఖార్జునరెడ్డి చెబుతున్నారు.

ఆ న్యూడ్‌ వీడియో కాల్‌ వ్యవహారం ఇప్పుడిప్పుడే చల్లబడుతుందనుకునేలోపే మళ్లీ అద్దె ఇంటి వ్యవహారంలో గోరంట్ల మాధవ్‌ వ్యవహారం కలకలం రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.