Begin typing your search above and press return to search.

తెలంగాణ గెలుపు.. బాబుకు అనుకూలం చేశారే..

By:  Tupaki Desk   |   13 Dec 2018 6:12 AM GMT
తెలంగాణ గెలుపు.. బాబుకు అనుకూలం చేశారే..
X
బాబు పచ్చ మీడియా తో కలిసి టీడీపీ నేతలు ఇప్పుడు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కి కర్రు కాచి వాతపెట్టినా బుద్ది తెచ్చుకోవడం లేదు. ఆంధ్రా డబ్బులు తెచ్చి మరోసారి ఇక్కడి ప్రజలకు మాయమాటలు చెప్పి గెలుద్దామని చూసిన బాబు కు సెటిలర్లు కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ప్రశాంతమైన తెలంగాణ కు బాబు శనిని లేకుండా చేశారని పోసాని కృష్ణమురళి లాంటి సినీ నటులు ప్రశంసించిన సంగతి తెలిసిందే..

ఇప్పుడు తాజాగా టీడీపీ తమ ఓటమిని, ప్రజాతీర్పును కూడా అపహాస్యం చేసేలా తప్పుడు ప్రచారాలకు తెరలేపింది. తెలంగాణ లో టీఆర్ఎస్ గెలిచింది కేసీఆర్ వల్ల కాదని.. అభివృద్ధి పథకాలే గులాబీ దళాన్ని గెలిపించాయని తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సహా టీడీపీ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. జనం కేసీఆర్ పాలనను ఎంత మెచ్చినా దాన్ని అంగీకరించకుండా పథకాలు, అభివృద్ధి అంటూ తమకు అన్వయించుకునే కొత్త కుట్రను టీడీపీ నేతలు చేస్తున్నారు.

తెలంగాణ లో అమలయ్యే పథకాలే పేరు మార్చి తాము అమలు చేస్తున్నామని.., కాబట్టి వచ్చే ఎన్నికల్లో తాము గెలవడం ఖాయమని టీడీపీ నేతలు, పచ్చ మీడియా కొత్త పలుకులు పలుకుతోంది. అయితే పథకాలు, అభివృద్ధి విషయంలో తెలంగాణ కు, ఏపీకి నక్క కు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ మాట మీద నిలబడి.. నోరు కట్టుకొని ప్రాజెక్టులు, పథకాలు శరవేగంగా పూర్తి చేసి కొనసాగిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రచార ఆర్భాటం మాత్రమే చూపిస్తూ ఎక్కడి పనులు అక్కడే వదిలేశాడన్న విమర్శలున్నాయి.. ప్రాజెక్టుల్లో దోపిడీ విపరీతంగా పెరిగిపోయిందంటున్నారు.

తెలంగాణలో కేసీఆర్ రుణమాఫీని పూర్తి చేయగా.. బాబు మాత్రం మాఫీ పేరు తో నిలువునా రైతులను ముంచాడు. ఇక తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు సరఫరా అవుతుండగా.. బాబు దీన్ని పక్కాగా అమలు చేయడం లేదు. ఇక మిషన్ భగీరథ- రైతుబందు- రైతు బీమా- కళ్యాణలక్ష్మి పథకాలు తెలంగాణ లో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కంటి వెలుగు సైతం బంపర్ హిట్ అయ్యింది. కానీ ఏపీలో మాత్రం ప్రచారం ఎక్కువ. అభివృద్ధి తక్కువలా పరిస్థితి ఉంది. ప్రతి పథకంలో దోపిడీ ఎక్కువైందన్న విమర్శలున్నాయి. రుణాల మంజూరులోనే నేతల కమీషన్లు ఉన్నాయంటున్నారు. మరి ఇలా తెలంగాణ లో అధికారపక్షం అవినీతి రహితంగా పాలించే గెలిచింది. దాన్ని చూసుకోకుండా దోపిడీ చేసిన పచ్చ బ్యాచ్ తాము గెలుస్తామని బీరాలకు పోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.