Begin typing your search above and press return to search.

వైసీపీ వర్సెస్ అదర్స్...ఇవీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్...?

By:  Tupaki Desk   |   9 April 2022 8:36 AM GMT
వైసీపీ వర్సెస్ అదర్స్...ఇవీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్...?
X
ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేస్తోంది. మూడేళ్లు దాటితే ఇక ముందుకే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏపీలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. దానికి ఆజ్యం పోసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన స్పీచ్ లతో మరింత కేక పెట్టిస్తున్నారు. ఆయన పంచ్ డైలాగులతో పాటు విపక్షాన్ని గట్టిగానే కెలుకుతున్నారు. ఎవరూ నన్ను ఏమీ చేయలేరంటూ జగన్ స్ట్రాంగ్ మేసేజ్ ని ఇటు జనాల్లోకి, అటు క్యాడర్ లోకి పంపాలనుకుంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో పొలిటికల్ గా చూస్తే గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయి. ఏం చెబుతున్నాయి అన్నది కూడా విశ్లేషించుకోవాలి. మూడేళ్ల పాలనకు చేరువ అవుతున్న వైసీపీ ఏలుబడి పట్ల జనాల్లో వ్యతిరేకత అయితే వచ్చేసింది. నిజానికి దీనిని యాంటీ ఇంకెబెన్సీ అంటారు. అధికారంలో ఏ సర్కార్ ఉన్నా కూడా ఇలాంటి వ్యతిరేకతను చవి చూడక తప్పదు. నాడు అయిదేళ్ల పాటు బాగా పాలించాను అనుకున్న వైఎస్సార్ కి కూడా 2009 ఎన్నికల్లో జనాలు 156 సీట్లు మాత్రమే ఇచ్చారు.

దాంతో తనను జస్ట్ పాస్ చేశారని వైఎస్సార్ అన్నారు. అయినా రెండవసారి అధికారంలోకి రావడమే నాడున్న పరిస్థితుల్లో గొప్ప. ఇపుడు చూస్తే విభజన ఏపీలో విపక్షాలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. నాడు వైఎస్సార్ కి ప్రజారాజ్యం పేరిట చిరంజీవి పెట్టిన పార్టీ ఇండైరెక్ట్ గా కాపాడింది. ఓట్లు చీలి టీడీపీ నష్టపోతే వైఎస్సార్ మళ్లీ సీఎం అయ్యారు.

ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. విపక్ష నేత చంద్రబాబు చాలా తెలివైన వారు. ఆయన చాణక్యుడు. నాటి చిరంజీవి తమ్ముడు, నేటి జనసేనాని పవన్ కళ్యాణ్ తో వన్ సైడ్ లవ్ స్టార్ట్ చేసి ఆయన్ని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు కచ్చితంగా కలవడం తధ్యం. ఇక బీజేపీ కూడా కలిస్తే దానిని నైతిక బలంగా చూడాలి.

ఇవన్నీ పక్కన పెడితే 2019 ఎన్నికల్లో 49.95 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి 2024 లో అలాంటి ఓట్ల షేర్ దక్కుతుందా అంటే లేదు కాదు అనే మాట వినిపిస్తుంది. నాడు అనేక వర్గాలు ఏకమొత్తంగా ఓట్లు వేశాయి. జగన్ సీఎం కావాలని కోరుకున్న వారంతా ఓట్లు గుద్దేశారు.

ఇపుడు జగన్ కి ఓట్లు వేయాలీ అనుకుంటే కచ్చితంగా ఆయన పాలన చూసి ఓట్లు వేస్తారు. ఆ విధంగా చూస్తే చాలా వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. నాడు వైసీపీ అధికారంలోకి రావడానికి కారణమైన అతి పెద్ద వర్గం ఉద్యోగులు కూడా దూరం జరుగుతున్నారు అన్న మాట ఉంది, వారు పూర్తిగా కాకపొయినా కొంత ఎడమైతే వచ్చింది.

మరో వైపు చూస్తే గతంలో కాపులు ఎక్కువగా వైసీపీకి వేశారు. ఈసారి ఆ వర్గం నుంచి వైసీపీ ఆశలు పూర్తిగా పెట్టుకోలేకపోవచ్చు. అలాగే బీసీలను చంద్రబాబు కూడా దువ్వుతున్నారు. దాంతో వారు పూర్తిగా వైసీపీ వైపు మళ్ళీ చాన్స్ లేదు. ఇక అగ్ర వర్ణాలు ఈసారి ఎక్కువగా విపక్షాల వైపే ఉంటాయి. వైట్ కాలర్స్, చదువరులు ఇలాంటి సెక్షన్లు అన్నీ కూడా సర్కార్ మీద ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి.

ఇలా తీసుకుంటే కచ్చితంగా 2024 నాటికి వైసీపీకి వచ్చే ఓటింగ్ నాలుగు నుంచి అయిదారు శాతం తగ్గవచ్చు అని ఉజ్జాయింపుగా లెక్కలు ఉన్నాయి. అదే టైమ్ లో గతంలో టీడీపీకి వచ్చిన 40 శాతం ఓటింగ్ ఈ మధ్య కొంత తగ్గింది అన్న మాట ఉంది. అది కాస్తా అటూ ఇటుగా 35 శాతం దగ్గర స్టాండ్ అయినా అదే టైమ్ లో జనసేన ఓటింగ్ బాగా పెరుగుతోంది. ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చిన ఆరు శాతం ఓటింగ్ ఇపుడు పది పన్నెండు శాతంగా మారిందని అంతున్నారు. దాంతో ఈ రెండు పార్టీలు కలిస్తే 2024 నాటికి ఈ ఓటింగ్ ఇంకా పెరుగుతుంది అన్న చర్చ కూడా ఉంది.

అంటే రేపటి ఎన్నికల్లో పవన్ ప్లస్ చంద్రబాబు ముందుకు వస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈజీగా 46 శాతం పైగా ఓట్లను తెచ్చుకోగలుగుతారు. అదే టైమ్ లో వైసీపీ ఓటింగ్ షేర్ నాలుగైదు శాతం కంటే ఏ మాత్రం తగ్గినా అధికారం అయితే చేజారుతుంది అన్న లెక్కలు ఉన్నాయి. అందుకే ఈ రెండు పార్టీలు కలవకుండా వైసీపీ నేతలు చూస్తున్నారు అంటున్నారు. ఒక వేళ కలసినా కూడా రెండు పార్టీలలో అసంతృప్తిని రెచ్చగొట్టాలన్న మరో వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ రోజుకు ఉన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చెప్పేది ఏంటంటే వచ్చే ఎన్నికలలో టఫ్ ఫైట్ నడవడం ఖాయమని. దానికి ధీటుగానే వ్యూహాలు రూపొందించుకోవడంలోనే ఎవరికి వారు బిజీగా ఉన్నారిపుడు.