Begin typing your search above and press return to search.

కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసిన వైసీపీ నేత‌లు.. ఫిర్యాదు ఇదే!

By:  Tupaki Desk   |   29 Oct 2021 10:30 AM GMT
కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసిన వైసీపీ నేత‌లు.. ఫిర్యాదు ఇదే!
X
గ‌త వారం కింద‌ట జ‌రిగిన వివాదం.. వైసీపీ, టీడీపీల మ‌ధ్య ఎక్క‌డా చ‌ల్లార‌లేదు. నాలుగు రోజుల కింద‌ట‌.. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఆర్టిక‌ల్ 356 విధించాల‌న్నారు. రాష్ట్రంలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది. గురువారం ఒక్క‌రోజే.. వైసీపీ దూకుడు పెంచింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఆ పార్టీ ఎంపీ.. గోరంట్ల మాధ‌వ్ క‌లిసి టీడీపీపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత ప‌ట్టాభి ఏమ‌న్నారో.. పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు.

ఇక‌, ఈ ప‌రంప‌ర‌లో.. వైసీపీ ఎంపీలు.. కొంద‌రు.. రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నేతృత్వంలో క‌లిసి.. ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల పరుష వ్యాఖ్యలను సీఈసీకి వివరించామని.., తమ విజ్ఞప్తులపై ఈసీ సానుకూలంగా స్పందించిందని ఎంపీ విజయసాయి వెల్లడించారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని సీఈసీని కోరినట్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు పట్టాభి, లోకేశ్ చేసిన పరుష వ్యాఖ్యలను ఈసీకి వివరించామన్నారు.

అదేస‌మ‌యంలో టీడీపీ అధినేత హ‌యాంలోనే సాగిన గంజాయి పై ఇప్పుడు త‌మ ప్ర‌భుత్వానికి రుద్దుతున్న‌ట్టు సాయిరెడ్డి విమ‌ర్శించారు. దీనిపై తాము కూడా రాష్ట్ స్థాయిలో ప్ర‌జ‌ల‌ను క‌దిలిస్తామ‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో ఎంతెంత గంజాయి ప‌ట్టుబ‌డిందో రాష్ట్ర ప్ర‌భుత్వ‌ అధికారులు లెక్క‌లు తీస్తున్నార‌ని చెప్పారు. ఆయా వివరాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల ముందు ఉంచుతామ‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో శాసనమండలిలో ఖాళీలను భర్తీ చేయాలని ఈసీని కోరామని.. తమ విజ్ఞప్తులపై ఈసీ సానుకూలంగా స్పందించిందని విజయసాయి వెల్లడించారు