Begin typing your search above and press return to search.

ముద్రగడ కోరికను సీఎం జగన్‌ నెరవేరుస్తారా?

By:  Tupaki Desk   |   26 Dec 2022 9:28 AM GMT
ముద్రగడ కోరికను సీఎం జగన్‌ నెరవేరుస్తారా?
X
మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం స్తబ్దుగా ఉన్న విషయం తెలిసిందే. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని.. వారికి రిజర్వేషన్‌ కల్పించాలని ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన వ్యక్తం చేసిన సంగతి విదితమే. ముఖ్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 మధ్య ముద్రగడ పెద్ద ఉద్యమమే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌) కు కేటాయించిన పది శాతం రిజర్వేషన్లలో కాపులకే 5 శాతం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది.

అయినా సరే ముద్రగడ పద్మనాభం నాడు శాంతించలేదు. ఆయన చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారి.. విజయవాడ- విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ కు నిప్పు పెట్టే వరకు వెళ్లింది. ఈ వ్యవహారం నాటి టీడీపీ ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వైసీపీ నేతలే రైలుకు నిప్పు పెట్టి అమాయకులైన కాపుల మీదకు నెడుతున్నారని అప్పట్లో టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది.

ఆ తర్వాత ముద్రగడ పద్మనాభంను టీడీపీ ప్రభుత్వం అరెస్టు చేయడం వంటివి జరిగిపోయాయి. పోలీసుల బలప్రయోగంతో కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వం అణచివేసిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ మొదటి నుంచి కాపు రిజర్వేషన్లపై ఉద్యమంపై తన అభిప్రాయాన్ని చెబుతూనే వస్తున్నారు. కాపు రిజర్వేషన్లు తన పరిధిలో లేవని, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం కాపులకు రిజర్వేషన్లు కల్పించినా తమకేమీ అభ్యంతరం లేదని.. అయితే దీనివల్ల బీసీల రిజర్వేషన్లు దెబ్బతినకూడదనే తమ ఉద్దేశమని పలుమార్లు కుండబద్దలు కొట్టారు.

అంతేకాకుండా జగన్‌ అధికారంలోకి రాగానే కాపులకు చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లను కూడా ఎత్తేశారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలన్నింటికీ కేంద్రం పది శాతం రిజర్వేషన్లు కల్పించిందని.. ఇందులో 5 శాతాన్ని కేవలం కాపులకు మాత్రమే కల్పించడం అన్యాయమని జగన్‌ తన నిర్ణయాన్ని అప్పట్లో సమర్థించుకున్నారు.

విచిత్రంగా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపుల రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో సైలెంట్‌ అయిపోయారు. తనను తన తోటి కులస్తులే నిందిస్తున్నారని.. అందువల్ల ఇక తాను ఉద్యమం చేయడం సరికాదని.. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని ముద్రగడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ప్రకటించారు. ఈ వ్యవహారంలో టీడీపీ వైపు నుంచి గట్టి విమర్శలే పడ్డాయి.

మళ్లీ ఇన్నాళ్లకు జగన్‌ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లను తొలగించడంపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. గత చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లను తొలగించడం సరికాదన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌ కు లేఖ రాశారు. యధావిధిగా 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కల్పించాలని కోరారు.

కొద్ది రోజుల క్రితం శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేషన్లు తమ పరిధిలో అంశం కాదని.. అది రాష్ట్రాల పరిధిలోని అంశమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏదైనా కులాన్ని రిజర్వేషన్‌ పరిధిలో చేర్చాలన్నా, తొలగించాలన్నా, మార్పులు చేయాలన్నా అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని కేంద్రం పేర్కొంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు కాపులకు గత ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్‌ ను వర్తింపజేయాలని ముద్రగడ పద్మనాభం తాజాగా జగన్‌ కు లేఖ రాశారు. మరి ఈ లేఖపై ఏపీ సీఎం జగన్‌ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.