Begin typing your search above and press return to search.

పార్థ‌సార‌ధికి ఈసారి టికెట్ హుళ‌క్కేనా?

By:  Tupaki Desk   |   18 July 2022 4:36 AM GMT
పార్థ‌సార‌ధికి ఈసారి టికెట్ హుళ‌క్కేనా?
X
శ్రీ స‌త్యసాయి జిల్లా పెనుకొండ‌లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు బీకే పార్థ‌సార‌ధికి ఈసారి టిక్కెట్ హుళ‌క్కేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ సంకేతాలు ఇచ్చార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం కోసం పెనుకొండ‌కు వ‌చ్చిన చంద్రబాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కే అసెంబ్లీ సీటు ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బీకే పార్థసారధికి సీటు ద‌క్క‌న‌ట్టేన‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పార్థ‌సార‌ధి 2009, 2014ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పెనుకొండ నుంచి గెలుపొందారు. అయితే 2019లో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి మాల‌గుండ్ల శంక‌ర నారాయ‌ణ‌పై పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గానికి బీకే పార్థ‌సారిధే ఇన్చార్జుగా ఉన్నారు.

అయితే ఈసారి యువ‌త‌కు సీటు ఇస్తామ‌ని టీడీపీ అధిష్టానం ప్ర‌క‌టించ‌డంపై ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందువల్లే నెల రోజులుగా పెనుకొండ‌లో టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని అంటున్నారు.

అదేవిధంగా ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు సోమందేపల్లికి రాగా...బీకే పార్థ‌సార‌ధి అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. అయితే బీకే వ్యతిరేక వర్గం 'కియా' కార్ల పరిశ్రమ వద్దే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబును ఆహ్వానించింది. క్రమశిక్షణ ముఖ్యమని పదేపదే చెప్పే చంద్రబాబు కూడా బీకే వైరి వర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని అనంతరం సోమందేపల్లి కార్యక్రమానికి వచ్చార‌ని అంటున్నారు.

తనకు టికెట్‌ ఇవ్వని పక్షంలో తన పెద్ద కుమార్తెకు గానీ, లేదా కుడి భుజంగా ఉంటున్న అల్లుడు శశిధర్‌కు గానీ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని బీకే పార్థ‌సార‌ధి.. చంద్రబాబు, లోకేష్‌ను కోరినట్లు చెబుతున్నారు. ఇప్పటికే వారిద్దరి బయోడేటాలను పార్టీ నేతలకు అందించినట్లు సమాచారం.

అసెంబ్లీ టికెట్ యువ‌త‌కే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతుండ‌టంతో బీకే పార్థ‌సార‌ధి హిందూపురం ఎంపీ టికెట్‌ అయినా అడుగుదామన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ వాల్మీకి వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ అడ్డుగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.