Begin typing your search above and press return to search.

ఎన్నికల నాటికి పొత్తులు సెట్ అవుతాయా?

By:  Tupaki Desk   |   19 Jun 2022 2:30 AM GMT
ఎన్నికల నాటికి పొత్తులు సెట్ అవుతాయా?
X
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అప్పుడే పార్టీలు పొత్తులపై ఆసక్తికర చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన -బీజేపీల మధ్య పొత్తు ఉంది. ఇటీవల జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జుల సమావేశంలోనూ పొత్తుల విషయంలో తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరించిన సంగతి తెలిసిందే.

బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, లేదా టీడీపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా ఒంటరిగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమ ముందున్న ఆప్షన్లు అని పవన్ పవన్ నాడు చెప్పారు.

అయితే.. విచిత్రంగా పవన్ కల్యాణ్ పొత్తులకు సంబంధించి చేసిన మూడు ఆప్షన్లపై ఆయా పార్టీలు మౌన ముద్ర దాల్చాయి. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జనసేన పార్టీ ప్రస్తావన కానీ, పవన్ కల్యాణ్ ప్రస్తావన కానీ తేకపోవడం జనసేన శ్రేణులను విస్మయపరిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజమహేంద్రవరంలో సభ పెట్టిన జేపీ నడ్డా ఎక్కడా జనసేనతో పొత్తు ఉందని, పవన్ కల్యాణే తమ కూటమి తరఫున సీఎం అభ్యర్థి అని ప్రకటించలేదని గుర్తు చేస్తున్నారు.

మరోవైపు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్ పొత్తుల ప్రకటనలపై మౌన ముద్ర దాల్చారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడు, ప్రస్తుతం చార్జీల పెంపుపై నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమాలు విజయవంతమయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో ఆ పార్టీ నూతనోత్సాహంతో తొణికిసలాడుతోందని పేర్కొంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ పొత్తులు, మూడు ఆప్షన్లపై చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు.

దీంతో పవన్ తనదారిన తాను వెళ్లాలని ప్రస్తుతానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వేటికవి తమ కార్యక్రమాలను సొంతంగా నిర్వహిస్తున్నా.. ఎన్నికల సమయానికి మాత్రం పొత్తులకు ముందుకు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలనాటికి తమ మధ్య విభేదాలన్నింటినీ పక్కనపెట్టి కలిసిపోతాయని చెబుతున్నారు.

జగన్ ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ వేర్వేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతోందని పేర్కొంటున్నారు. ఇది అంతిమంగా వైఎస్సార్సీపీకి మేలు చేస్తుంది కాబట్టి ఎన్నికల నాటికి మూడు ప్రతిపక్ష పార్టీలు ఒకే కూటమిగా పోటీ చేయొచ్చని అంటున్నారు. ఇందుకు బీజేపీ ఒప్పుకోకపోతే జనసేన, టీడీపీ మాత్రం కలసి పోటీ చేసే అవకాశముందని వివరిస్తున్నారు.