Begin typing your search above and press return to search.

హిట్ లిస్ట్ లో ఉన్న ఉత్తరాంధ్రా మంత్రి ఎవరు...?

By:  Tupaki Desk   |   10 Sep 2022 9:37 AM GMT
హిట్ లిస్ట్ లో ఉన్న ఉత్తరాంధ్రా మంత్రి ఎవరు...?
X
వైసీపీలో ఇపుడు సడెన్ గా మంత్రుల మీద చర్చ సాగుతోంది. పనిమంతులు, నోరున్న వారు జోరున్న వారు ఇలా జాబితాను విడదీసి చూస్తున్నారు. దాంతో ఈ లిస్ట్ లోని లేని వారు ఎవరూ అన్న చర్చ కూడా మొదలైంది. ఏపీ వ్యాప్తంగా చూస్తే పాతిక మంది మంత్రులలో వైసీపీ హై కమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రుల జాబితాలో గట్టిగా అయిదారుగురు ఉన్నారని తెలుస్తోంది.

వారిలో రాయలసీమ, కోస్తా, గోదావరి జిల్లాల నుంచి నలుగురు ఉంటే ఉత్తరాంధ్రా నుంచి ఒకరు ఉన్నారని అంటున్నారు. రాయలసీమలో ఒక మహిళా మంత్రి పేరు అయితే బాగా వినిపిస్తోంది. అలాగే గోదావరి జిల్లాలో మరో మహిళా మంత్రి పేరు నానుతోంది. పల్నాడు జిల్లా నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ రాజకీయ జీవిత చరమాంకంలో మంత్రి పదవి దక్కిన ఒకాయన ఉన్నారని అంటున్నారు.

అలాగే మరో మంత్రికి నోరుంది కానీ శాఖాపరంగా వీక్ అని అలాగే ఎపుడు సౌండ్ చేయాలో తెలియకపోవడమే సీటుకు ఎసరు తెస్తోంది అని అంటున్నారు. సరే ఆ జాబితా అలా ఉంటే ఉత్తరాంధ్రాలో హిట్ లిస్ట్ లో ఉన్న మంత్రి గారు ఎవరు అన్న చర్చ బయల్దేరింది.

ఉత్తరాంధ్రాలోని ఆరు జిల్లాలలో ఆరుగురు మంత్రులు ఉన్నారు. వీరిలో ఒక సీనియర్ మంత్రి సహా యువ మంత్రితో పాటు మరో మంత్రి పనితీరు బాగుందని నివేదికలు ఉన్నాయి. ఇక ఇద్దరు డిప్యూటీ సీఎంలతో పాటు ఒక మరో సీనియర్ మంత్రి గారు పనితీరు మీదనే చర్చ సాగుతోంది. ఇందులో సీనియర్ మంత్రి గారు తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటున్నారు.

ఆయన అసలు విపక్షం మీద నోరు కనీసమాత్రంగా అయినా చేసుకోవడంలేదు అని అంటున్నారు. ఆయన ఎంతసేపూ తన సొంత నియోజకవర్గంలోనే ఉంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయన మంచి మాటకారి. సబ్జెక్ట్ కూడా ఉంది. తలచుకుంటే విపక్షం దుమ్ము దులిపేయగలరు. కానీ ఎందుకో ఆయన తటపటాయిస్తున్నారు అని అంటున్నారు. ఆయన శాఖాపరంగా బాగానే ఉంటున్నారన్న పేరు ఉంది.

ఇక ఇద్దరు డిప్యూటీ సీఎంల విషయం తీసుకుంటే జగన్ క్లాస్ తీసుకున్నాక ఒకాయన ఇపుడిపుడే నోరు విప్పి విపక్షాన్ని విమర్శిస్తున్నారు. అయితే ఆయన మాటలింకా పదును తేరాల్సి ఉంది అంటున్నారు. ఇక శాఖాపరంగా ఆయన ఇంకా నేర్చుకునే దశలో ఉన్నారని అంటున్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లా బాధ్యతలు మొత్తం చూసుకోవాల్సిన మంత్రి గారు ఇంకా పూర్తిగా సర్దుకోలేదని కూడా అంటున్నారు.

ఇంకోకాయన సీనియర్ గానే ఉన్నా మాట్లాడడమే తక్కువ. ఆయన మితభాషిగానే ఉన్నారు. ఆయన సైతం తానూ తన నియోజకవర్గం అనే ధోరణితో ఉన్నారు. ఆరోపణలు విపక్షాలు చేసినా ఆయన అసలు పట్టించుకోవడంలేదుట. దాంతో ఆయన మీద కూడా హై కమాండ్ గుస్సాగా ఉంది అంటున్నారు. మరి హిట్ లిస్ట్ లో ఉన్న మంత్రులలో ఒకరికి ఉద్వాసన‌ ఖాయమని అంటున్నారు. అది నిజంగా జరుగుతుందా లేక వారికి టైం ఇచ్చి ఊరుకుంటారా అన్నదే చర్చ. ఏది ఏమైనా ఉత్తరాంధ్రా ఈసారి వైసీపీకి చాలా ఇంపార్టెంట్ అని భావిస్తున్న వేళ మంత్రులు నోరు విప్పాల్సిందే అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.