Begin typing your search above and press return to search.

జగన్ 3.0లో ఇన్ ఎవరు? ఔట్ ఎవరు?

By:  Tupaki Desk   |   1 April 2023 9:53 AM GMT
జగన్ 3.0లో ఇన్ ఎవరు? ఔట్ ఎవరు?
X
అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా నిలుస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిగిలిన ముఖ్యమంత్రులు ఆలోచించటానికి కూడా పెద్దగా ఇష్టపడని అంశాల్ని.. సీఎం జగన్ మాత్రం ఇట్టే చేసేసుకుంటూ పోవటం కనిపిస్తూ ఉంటుంది. మంత్రివర్గంలోని సీనియర్లు.. పార్టీ పవర్లో లేనప్పుడు ఎంతో అండగా నిలిచిన నేతల్ని.. నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన టాలెంట్ వైఎస్ జగన్ సొంతమని చెప్పాలి. అలాంటి ఆయన.. తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా కసరత్తు జరుపుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 3న అంటే.. సోమవారం నాడు మంత్రివర్గంలోని మార్పులు చేర్పులకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడుతుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గ విస్తరణను చేపట్టి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీయించిన జగన్.. తాజాగా మరోసారి మార్పులతో కొత్త టెన్షన్ పెట్టుస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు అంతకు మించిన ఘాటుగా రియాక్టు అయ్యే వారు మంత్రులుగా ఉండాలన్న తన లక్ష్యానికి తగిన రీతిలో పని చేయని మంత్రుల్ని పక్కన పెట్టేసి.. ఇప్పటికే రిటైర్డు హార్డ్ ఇచ్చిన వారిని మళ్లీ జట్టులోకి తీసుకోవాలన్నది ఆలోచనగా చెబుతున్నారు.

ఇక.. ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు చేపట్టి.. జగన్ నిర్ణయం నేపథ్యంలో మంత్రి పదవుల్ని వదిలేసిన కొడాలి నాని.. బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఎమ్మెల్యేనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని.. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతను కేబినెట్ లోకి తీసుకోవటం ఖాయమని చెబుతున్నారు. వీరితో పాటు మండలికిఎన్నికైన గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత మర్రిరాజశేఖర్ కు అవకాశం ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. గోదావరిజిల్లాలకు చెందిన కాపు నేతను కూడా మంత్రివర్గంలో తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

తాజా మంత్రివర్గ ముఖచిత్రాన్ని చూస్తే.. మండలి నుంచి ఒక్కరు కూడా కాబినెట్ కు ప్రాతినిధ్యం వహించటం లేదు. గతంలో ఇద్దరు ఉన్నా.. వారిద్దరూ రాజ్యసభకు వెళ్లిపోవటంతో.. ఆ తర్వాత నుంచి ఎవరిని ఎంపిక చేసింది లేదు.ఆ లోటును తీర్చేందుకు వీలుగా.. ఇద్దరు ఎమ్మెల్సీలను కాబినెట్ లోకి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలోకి వచ్చే వారు ఇలా ఉంటే.. ఔట్ అయ్యే వారి మాటేమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మంత్రి పదవిని పోగొట్టుకునే అవకాశాలు ఉన్న మంత్రుల్లో.. రాయలసీమకు చెందిన ఒక మహిళా మంత్రి.. మిగిలిన ముగ్గురిలో ఒకరు ఉత్తరాంధ్రకు చెందిన వారు.. మరో ఇద్దరు గోదావరి జిల్లాకు చెందిన వారుగా చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గ సమావేశంలో తీరు మార్చుకోవాలని.. లేదంటే ముగ్గురు.. నలుగురు మంత్రుల్ని మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా జగన్ వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. మొత్తంగా నలుగురు ఇన్.. నలుగురు ఔట్ అన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ అంచనాలకు తగ్గట్లు మార్పులు ఉంటాయా లేదా? అన్నది రానున్న వారంలో తేలిపోనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.