Begin typing your search above and press return to search.

కొత్త గవర్నర్ చేతిలో సీఎం గా ప్రమాణం చేసే చాన్స్ ఎవరిది....?

By:  Tupaki Desk   |   17 Feb 2023 3:00 PM GMT
కొత్త గవర్నర్ చేతిలో సీఎం గా ప్రమాణం చేసే చాన్స్ ఎవరిది....?
X
ఏపీకి కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ఈ నెల 24న ఏపీకి కొత్త గవర్నర్ గా ప్రమాణం చేయనున్నారని తెలుస్తోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ రాజ్ భవన్ లో జరుగుతున్నాయి. ప్రసుత గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ చత్తీస్ ఘడ్ కి ఈ నెల 21న బదిలీ మీద వెళ్తారని, ఆ తరువాత రెండు రోజులకే కొత్త గవర్నర్ గా నజీర్ బాధ్యతలు స్వీకరిస్తారని రాజ్ భవన్ వర్గాల భోగట్టా.

ఇక చూస్తే కొత్త గవర్నర్ నజీర్ సరైన టైం లోనే ఏపీకి వస్తున్నారు. ఆయన వస్తూనే ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పాలు పంచుకుంటారు. మార్చి లో ఏపీ ప్రభుత్వం పాతిక రోజుల పాటు సాగేలా బడ్జెట్ సెషన్ ని నిర్వహిస్తోంది. ఏటా బడ్జెట్ సెషన్ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది.

అంటే కొత్త గవర్నర్ వస్తూనే మొత్తం ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను కూడా నేరుగా కలుసుకునేందుకు ఇదొక చక్కని అవకాశంగా మారనుంది అంటున్నారు. ఇక చూస్తే కొత్త గవర్నర్ ఎన్నికల ఏడాదిలో ఏపీకి వచ్చారు. ఆయన గవర్నర్ గా ఉండగానే 2024 ఏప్రిల్ లో ఏపీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం పదవీ కాలం పద్నాలుగు నెలలు మాత్రమే ఉంది. ఇక చూస్తే ఉమ్మడి ఏపీకి విభజన ఏపీకి కూడా గవర్నర్ గా సుదీర్ఘ కాలం పాటు నరసింహం వ్యవహరించారు.

ఆయన 2014లో ఏపీలో చంద్రబాబుని, తెలంగాణాలో కేసీయార్ ను సీఎం సీట్లో కూర్చోబెట్టి ప్రమాణం చేయించారు. ఇక 2019లో కూడా ఆయనే ఉన్నారు. దాంతో రెండవసారి కేసీయార్ ని సీఎం గా ప్రమాణం చేయిస్తే ఏపీలో జగన్ చేత నరసింహం ప్రమాణం చేయించారు. ఆయన తరువాత వచ్చి మూడున్నరేళ్ళ పాటు గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ఎన్నికల దాకా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన బదిలీ మీద వెళ్తున్నారు. దాంతో ఇపుడు జస్టిస్ అబ్దుల్ నజీర్ కొత్త గవర్నర్ అయ్యారు.

ఇక ఆయనే ఏపీ ఎన్నికలను మొత్తం చూస్తారు. ఆ మీదట ఎన్నికల్లఒ గెలిచిన పార్టీ నుంచి వచ్చిన నాయకుడిని కొత్త ముఖ్యమంత్రిగా చేస్తూ ప్రమాణ స్వీకారం చేయిసారు అని అంటున్నారు. మరి నజీర్ చేతిలో ఎవరు కొత్త సీఎం గా ప్రమాణం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఏపీలో చూస్తే రాజకీయం ఢీ అంటే ఢీ అన్నట్లుగా వైసీపీ టీడీపీల మధ్య ఉంది. తానే కాబోయే సీఎం అని చంద్రబాబు అంటూంటే తాను మళ్లీ గెలుస్తాను అని జగన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ ఇద్దరులో ఎవరో ఒకరి చేత నజీర్ సీఎం గా ప్రమాణం చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజకీయ అద్భుతం జరిగితే పవన్ కళ్యాణ్ కూడా సీఎం రేసులోకి వచ్చే చాన్స్ ని కూడా కొట్టి పారేయలేరు. ఇదిలా ఉండగా ఈ నెల 24న గవర్నర్ గా బాధ్యతలు తీసుకుంటారు అని భావిస్తున్న అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకార కార్యర్కమానికి ప్రతిపక్ష నాయకులు కూడా వస్తారని తెలుస్తోంది.

ఈ మధ్య దాకా గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు, ఎట్ హోం కార్యక్రమంలో విపక్షాలు పెద్దగా హాజరు కావడంలేదు. కానీ ఈసారి మాత్రం కొత్త గవర్నర్ తో సాన్నిహిత్యం నెరిపేందుకు విపక్షాలు ఆసక్తిని చూపిస్తాయనే అంటున్నారు దానికి ఆయా పార్టీకి కొత్త గవర్నర్ కి వెల్ కం చెబుతూ ఇస్తున్న ప్రకటనలే కారణంగా భావిస్తున్నారు. ఇక బీజేపీ ఎటూ కొత్త గవర్నర్ ప్రమాణానికి వస్తుంది. చంద్రబాబు పవన్ కూడా హాజరయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు.

ఎటూ సీఎం జగన్ ఆయన మంత్రి వర్గ సహచరులు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి మొత్తానికి మొత్తం ఏపీ రాజకీయ నాయకత్వాన్ని కొత్త గవర్నర్ ప్రమాణం వేళ చూడవచ్చు అంటున్నారు. అదే జరిగితే ఇప్పటిదాకా నిలువునా విడిపోయిన ఏపీ రాజకీయాలను ఒక చోట కలిపి నిలిపిన ఘనత మాత్రం కొత్త గవర్నర్ కి దక్కుతుంది అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.