Begin typing your search above and press return to search.

బాబు జీవితంలో జరగనిది..ఈ ‘23’న జరగనుందా?

By:  Tupaki Desk   |   17 March 2021 2:30 PM GMT
బాబు జీవితంలో జరగనిది..ఈ ‘23’న జరగనుందా?
X
పంచాయితీ ఎన్నికలు.. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు. ఇలా వరుస ఎన్నికలతో పాటు అంతకు ముందు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో తరచూ ఏపీ రాష్ట్రం వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న (మంగళవారం) ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని బాబు నివాసానికి వచ్చి రాజధాని అమరావతి భూముల విషయంలో ఆయనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి నోటీసులు అందించి వెళ్లారు. ఈ నెల 23న ఆయన్ను విచారణకు హాజరు కావాలన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (బుధవారం) మాజీ మంత్రి.. రాజధాని భూముల సమీకరణలో కీలకభూమిక పోషించిన మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. హైదరాబాద్ లోని నారాయణ నివాసానికి ఏపీ అధికారులు రాగా.. ఆయన ఇంట్లో లేరని తెలిసి.. ఆయన సతీమణికి అందజేశారు. విచారణకు ఈ నెల 23న హాజరు కావాలని కోరారు.

దీంతో.. ఈ నెల 23న ఏం జరగనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాము చెప్పినట్లుగా 23న కనుక విచారణకు హాజరు కాకుండా అరెస్టు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో.. ఏం జరుగుతుంది? బాబు హాజరవుతారా? లేదా? ఒకవేళ బాబు హాజరు కాకుంటే ఏం జరుగుతుందన్న సందేహాలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చంద్రబాబు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో విచారణకు బాబు హాజరు కారన్న మాట వినిపిస్తోంది. న్యాయస్థానం కానీ స్టే ఇవ్వని పక్షంలో.. క్వాష్ పిటిషన్ వేసి అయినా.. విచారణకు వెళ్లకుండా ఉంటారంటున్నారు. ఒకవేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే.. అరెస్టు అయ్యేందుకు ఓకే చెబుతారని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక నేరారోపణ మీద అరెస్టు చేయటం ఇప్పటివరకు జరగలేదు. ఇదే విషయాన్ని ఆయన తరచూ చాలా గొప్పగా చెబుతుంటారు. ఒకవేళ.. ఈ 23న ఆయన కానీ అరెస్టు అయితే.. అదో రికార్డు అవుతుందని చెప్పాలి. మరోవైపు.. ఆయనకు 23 తేదీ ఏ మాత్రం సూట్ కాదంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకీ ఈ నెల 23న ఏం జరగనుందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.