Begin typing your search above and press return to search.

నేనే యంగ్...నేనే కింగ్...గోదారి నీళ్ళ మహిమ

By:  Tupaki Desk   |   1 Dec 2022 5:00 PM GMT
నేనే యంగ్...నేనే కింగ్...గోదారి నీళ్ళ మహిమ
X
ఆయన గొంతు బిగ్గరగా వినిపిస్తోంది ఇపుడు. ధాటిగా మాట్లాడుతున్నారు. సూటిగా చూసి మాటల దాడి చేస్తున్నారు. గోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రసంగాలు గోదారి ప్రవాహాన్ని తలపిస్తున్నాయి. పంచులకే కేరాఫ్ అన్నట్లుగా ఆయన జగన్ మీద విరుచుకుపడుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా టూర్ లో బాబు ఏపీలో పవర్ లోకి వచ్చేది నేనే, అన్నీ ఇచ్చేది నేనే. జగన్ ఇంక ఎప్పటికీ సీఎం కాలేరని తేల్చేశారు.

అంతే కాదు నేనే యంగ్ అని కూడా గొప్పగా చెప్పుకున్నారు. నేను నవ యువకుడిని నాలా ఆలోచనలు చేసే వారు ఏపీలో ఉన్నారా అని ఆయన జనాలనే ప్రశ్నించారు. నేను ఒక ఇరవై ఏళ్ల ముందు ఆలోచనలు చేస్తాను, దేవుడు నాకు అలాంటి నేర్పు ఇచ్చాడని బాబు చెప్పుకున్నారు. దూర దృష్టి నాకు ఎక్కువ. నేను అందుకే నా పాలనలో ఏపీని అభివృద్ధి చేశాను, రేపు మళ్లీ కింగ్ నేనే కాబట్టి ఇంతకు రెట్టింపు ప్రగతి బాటన నడిపిస్తాను అంటూ బాసలు చేశారు.

ఏపీలో ఇపుడు అభివృద్ధి అన్నది ఎక్కడైనా ఉందా తమ్ముళ్ళూ అంటూ చంద్రబాబు ప్రశ్నించడమే కాదు ఎన్నికల ముందు జగన్ ఒక్క చాన్స్ అంటూ ముద్దులతో జనాన్ని వంచించాడని, తీరా అధికారంలోకి వచ్చాక గుద్దుదే గుద్దుడు అంటూ అన్నింటి మీద ధర్లు పెంచేసి పిడి గుద్దులు గుద్దేశారు అని బాబు పంచు డైలాగులు పేల్చారు. గోదావరి జిల్లాల టూర్ లో తన నడుం విరిగినంత పని అయిందని, గత రాత్రి సరిగ్గా తనకు నిద్ర పట్టలేదని, నడుం నొప్పితనే ఇపుడు కూడా సభకు వచ్చాను అని బాబు చెప్పారు.

రోడ్లు అంత దారుణంగా ఉన్నాయని ఆయన జనాలకు చెబుతూ ఏపీలో ఆసుపత్రుల నిండా నడుం నొప్పితో బాధపడుతున్న వారే ఉన్నారు అంటే అది జగన్ పుణ్యమే అని పంచులేశారు. జగన్ పాలనలో కొత్తగా ఒక్క రోడ్డు అయినా వేశారా అని ఆయన ప్రశ్నించారు. తాము ఉన్నపుడు రోడ్లు ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాలని ఆయన కోరారు.

ఏపీలో మధ్య పాన నిషేధం అన్నారు. ఏమైంది, ఇపుడు అంతా కొత్త బ్రాండ్లు పెట్టి మరీ దోచుకోవడమే కదా జగన్ సర్కార్ చేస్తున్న పని అని ఆయన విమర్శించారు. డైరెక్ట్ క్యాష్ విధానం పెట్టి వచ్చిన డబ్బుని రాత్రులు లెక్కపెట్టుకోవడానికే వైసీపీ నేతలకు సమయం సరిపోవడం లేదు అని ఆయన మండిపడ్డారు.

ఏపీలో అమ్మ ఒడి అంటూ కబుర్లు చెబుతున్నారని, సగానికి సగం పాఠశాలను ఎత్తేసి విద్యార్ధులను ఇళ్ళకే పరిమితం చేశారని ఆయన దుయ్యబెట్టారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడమే జగన్ కి తెలుసు అని ఏపీని అప్పుల పాలు చేయడమే ఆయనకు అలవాటు అని విమర్శించారు. తాను సంపద సృష్టి కర్తను అని ఎలా ఏపీలో సంపద పెంచాలో తనకు తెలినట్లుగా ఎవరికీ తెలియదు అని బాబు చెప్పుకున్నారు. మొత్తానికి ఏపీలో తానే యంగ్ అని నవతరం ఆలోచనలు తనవని చెప్పుకోవడం ద్వారా జగన్ కి గట్టి షాక్ ఇచ్చేశారు బాబు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.