Begin typing your search above and press return to search.

ఒక్క ట్వీట్‌ తో ఆ అపోహలన్నిటికీ చెక్‌ పెట్టిన విజయసాయిరెడ్డి!

By:  Tupaki Desk   |   29 May 2023 12:17 PM GMT
ఒక్క ట్వీట్‌ తో ఆ అపోహలన్నిటికీ చెక్‌ పెట్టిన విజయసాయిరెడ్డి!
X
చాలాకాలం పాటు వైసీపీలో నంబర్‌ టూగా చక్రం తిప్పారు.. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. కేవలం రాజ్యసభ సభ్యుడిగానే కాకుండా వైసీపీ అనుబంధ విభాగాల ఇంచార్జిగా, ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా, ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ గా జగన్‌ తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారు.

నిత్యం సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌ లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు చేసేవారు. ఈ క్రమంలో ఆయన వినియోగిస్తున్న భాష సైతం విమర్శలపాలైంది. ద్వితీయ శ్రేణి కార్యకర్తల్లా ఆయన ట్వీట్లలో వాడుతున్న భాష ఉందని పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు అయితే ఏకంగా రాజ్యసభ చైర్మన్‌ కే ఫిర్యాదు చేశారు.

అలాంటి విజయసాయిరెడ్డి దాదాపు ఆరు నెలలుగా బాగా నెమ్మదించారు. అడపాదడపా ట్వీట్లు చేస్తున్నా అందులో పెద్దగా పస ఉండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశాక అతడు బెంగళూరులో చికిత్స పొందుతున్నప్పటి నుంచి మరణించాక అంత్యక్రియల వరకు విజయసాయిరెడ్డి దాదాపు అన్నీ చూసుకున్నారు. నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబులతో అన్ని కార్యక్రమాలను సమన్వయం చేశారు.

దీంతో విజయసాయిరెడ్డిపైన జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని.. చంద్రబాబు, బాలకృష్ణల పక్కనే కూర్చోవడం, వాళ్లతో రాసుకుపూసుకు తిరగడం ఏంటని మందలించారని గాసిప్స్‌ వినిపించాయి. అంతేకాకుండా ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్‌ గా జగన్‌ తన బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. దీంతో ఇక వైసీపీలో విజయసాయిరెడ్డి శకం ముగిసినట్టేనని దాదాపు అంతా భావించారు.

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. తాజాగా రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 27, 28 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలను ఆమోదించారు. అంతేకాకుండా 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో పలు పథకాలను చంద్రబాబు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బిడ్డలు ఉన్న ప్రతి తల్లికి ఏడాదికి రూ.15000, రైతులకు ఏటా రూ.20000, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, ఏడాదికి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం వంటి పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోనే వెబ్‌ సైట్‌ నుంచి మాయం చేసిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయమంటారేమోనని మేనిఫెస్టోనే మాయం చేసిన వారు ఇప్పుడు ఆల్‌ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఈ మాయ మేనిఫెస్టోలో ఎవరు పడతారని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌ లో ప్రశ్నించారు.

'అమలు చేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు.. ఇప్పుడు ఆల్‌ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ 'మాయా' ఫెస్టోలో ఎవరు పడతారు?' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

అయితే ఈ ట్వీటులో టీడీపీ పేరు కానీ, చంద్రబాబు పేరు కానీ లేకుండా విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేయడం విశేషం. ఎట్టకేలకు చాలా కాలం తర్వాత ప్రత్యర్థి పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ ఆయన ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.