Begin typing your search above and press return to search.

అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్సయ్యిందా ?

By:  Tupaki Desk   |   18 May 2022 12:04 PM IST
అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్సయ్యిందా ?
X
అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్సయినట్లు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా ప్రచారం మొదలు పెట్టింది. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని సదరు మీడియా తేల్చేసింది. రాబోయే నవంబర్లో శాసనసభ రద్దవుతుందని, మార్చిలో ఎన్నికలు తథ్యమని మీడియా చెప్పేసింది. మంగళవారం మధ్యాహ్నం సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని కాబట్టి నేతలంతా అందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టంగా ఆదేశించారు. ఒకవైపు ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని చెప్పటం రాత్రికల్లా జగన్ వ్యతిరేక మీడియా ముందస్తు ఎన్నికలు వస్తున్నట్లు చెప్పేసింది. కాకపోతే మీడియా ముహూర్తం కూడా ఫిక్స్ చేసేయటమే ఆశ్చర్యంగా ఉంది.

దాదాపు ఆరు మాసాల క్రితం వరకు చంద్రబాబు ముందస్తు ఎన్నికల జపంచేసిన విషయం తెలిసిందే. తర్వాత ఎందుకనో ఆ విషయాన్ని వదిలేశారు. అంతకుముందు దాదాపు ఏడాదిపాటు జమిలి ఎన్నికలన్నారు.

నేతలతో ఎప్పుడు సమావేశాలు పెట్టినా జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయనే చెప్పేవారు. తర్వాత ఏమైందో ఏమో రెండింటినీ వదిలేశారు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా చంద్రబాబు, మీడియా ఒకేసారి ముందస్తు ఎన్నికల రాగం ఎత్తుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

అసలు ముందస్తు ఎన్నికల గురించి చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. తన ప్రభుత్వాన్ని ఎప్పుడు రద్దుచేసుకోవాలనే విషయం పూర్తిగా జగనిష్టం. అలాంటి జగన్ ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు. ఇదే విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని చెప్పారు.

సరే రాజకీయాలన్నాక ఈరోజు చెప్పిన మాట రేపటికి మారే అవకాశం లేకపోలేదు. అయినా ముందస్తుకు చంద్రబాబు చెప్పే కారణం ఏమిటంటే జనాల్లో వ్యతిరేకతేనట. జనాల్లో వ్యతిరేకత ఉన్నా, రెండోసారి అధికారంలోకి రామనే అనుమానం ఉన్నా ఏ సీఎం అయినా పూర్తికాలం అధికారంలో ఉండాలని కోరుకుంటారే కానీ ముందే ఎన్నికలకు వెళ్ళి ఓడిపోవాలని కోరుకుంటారా ?