Begin typing your search above and press return to search.

లేటెస్ట్ : ప్లీజ్ నోట్ దిస్ పాయింట్స్

By:  Tupaki Desk   |   15 Oct 2015 5:15 AM GMT
కాలంతో పాటు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది సర్వసాధారణం. ఇలాంటి మార్పులకు సంబంధించిన అంశాలు తెలుసుకోవటం అవసరం కూడా. ఎందుకంటే.. ఇవాల్టి సమాచార విప్లవం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ ఉండటం అత్యంత అవసరం. ఎప్పుడు ఏ సమాచారం అవసరమో తెలీని పరిస్థితి. ఇక.. అలాంటి లేటెస్ట్ ఛేంజెస్ కు సంబంధించి అంశాలు కొన్ని చూస్తే..

= నిన్నమొన్నటి వరకూ ఖర్చుల గురించి లైట్ అన్నట్లుగా వ్యవహరించే చంద్రబాబు.. ఖర్చుల గురించి కాస్త ఎక్కువ కాన్సంట్రేషన్ పెంచినట్లు కనిపిస్తోంది. గతంలో కార్యక్రమం అనుకున్నట్లు పూర్తి అయితే చాలన్నట్లుగా వ్యవహరించేవారు. కానీ.. మారిన పరిస్థితుల్లో అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఖర్చు విషయంలో తొందరపాటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనవసరమైన ఖర్చు చేస్తున్నారన్న అపప్రద రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీగా ఖర్చు చేయటంతో పాటు.. నిర్వహణ కోసం ఒక ఈవెంట్స్ సంస్థకు అప్పెజెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. కేవలం.. నిర్వహణ కోసం సదరు కంపెనీకి రూ.10కోట్లు చెల్లిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ అంశంపై వచ్చిన విమర్శలు బాబు దృష్టికి వెళ్లినట్లున్నాయి.. అందుకేనేమో.. ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఖర్చు విషయంలోనూ ఒక కన్నేస్తున్న బాబు.. ఇదే ధోరణితో సాగితే వెల్లువెత్తే విమర్శల జోరుకు బ్రేకులు పడినట్లే.

= తమ గురించి.. తమ డిమాండ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న కినుకుతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భారీ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి తమ అధినేత చేసిన దీక్ష విషయంలో ఏపీ సర్కారు అనుసరించిన వైఖరిపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ నేతలంతా కలిసి భారీ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. భావోద్వేగంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు వినటానికి బాగానే ఉంటాయి కానీ.. వాస్తవరూపంలోకి వచ్చేసరికి ఈ వ్యవహారానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఓకే చెబుతారన్నది సందేహంగా మారిందని చెబుతున్నారు. ఇదంతా కూడా ఏపీ అధికారపక్షానికి చిన్నపాటి ఝులక్ ఇవ్వటానికే ఇలాంటి సమాచారాన్ని లీక్ చేశారన్న మాట కూడా వినిపిస్తోంది.

= తెలంగాణ అధికారపక్షంపై తెలంగాణ టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకంపై తాజాగా వారు చేసిన ఆరోపణలు టీఆర్ఎస్ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద తెలంగాణ సర్కారు గొప్పగా ఏర్పాటుచేసిన వాటర్ గ్రిడ్ పైలాన్ కేవలం నెల వ్యవధిలో శిధిల స్థితికి చేరిందని ఆరోపిస్తున్నారు. తాజాగా పైలాన్ వద్దకు పర్యటనగా వెళ్లిన ఆయన రూ.2కోట్ల వ్యయంతోనిర్మించిన పైలాన్ కేవలం నెల రోజుల్లోనే ఎలా శిధిలం అవుతుందని ప్రశ్నించటమే కాదు.. ఇదే తీరుతో వాటర్ గ్రిడ్ పనులు చేపడితే పరిస్థితేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణ అధికారపక్షానికి కాస్తంత ఇబ్బంది కలిగించేదే.

= దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితురాలిగా అరెస్ట్ అయిన ఆమె తల్లి ఇంద్రాణి నోరు విప్పినట్లుగా తెలుస్తోంది. తన కుమార్తెను తాను చంపలేదని.. తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా చంపారని సీబీఐ విచారణలోఆమె చెప్పినట్లుగా చెబుతున్నారు. తన భర్త పీటర్ ముఖర్జీ కొడుకుతో షీనా సంబంధం పెట్టుకోవటం నచ్చకనే తన డ్రైవర్ తో కలిసి సంజీవ్ హత్య చేసినట్లుగా ఇంద్రాణి చెప్పినట్లుగా చెబుతున్నారు. మరి.. దీన్లో నిజమెంతో బయటకు రావాల్సి ఉంది.

= తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్తు లైన్లు వేసి తెలంగాణకు విద్యుత్తు తీసుకొస్తామని నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పటం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్తు లైన్ల ద్వారా విద్యుత్తు తీసుకురావటం ప్రాక్టికల్ గా కుదరదన్న వాదన వినిపించింది. ఈ వాదనను బలంగా వినిపించారు విద్యుత్తు రంగ నిపుణుడు రఘు. ఈయన మాటలు నచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ రఘు మాటలకు కస్సుమనటం తెలిసిందే. తాజాగా రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్ గఢ్ నుంచి చేసుకున్న ఒప్పందం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. ఒక్క విద్యుత్తు యూనిట్ వాడుకోనున్నా.. ఏడాదికి రూ.1314 కోట్ల మేర స్థిర ఛార్జీలు చెల్లించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే చేశారని.. దీని వల్ల తెలంగాణ రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

= ట్విట్టర్కు కొత్త ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వచ్చేశారు. ఇటీవల కాలంలో ట్విట్టర్ కు వస్తున్న నష్టాల కారణంగా సంస్థకు చెందిన దాదాపు 336 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పటికే 336 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లుగా ఉత్తర్వులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. ఒక.. సంస్థకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా ఒమిద్ కొర్డెస్టీనీని నియమించినట్లుగా సంస్థ పేర్కొంటోంది. మరి.. కొత్తగా భాద్యతలు చేపట్టే ఒమిద్ ట్విట్టర్ పిట్టను ఎంతమేర లాభాల బాట పట్టిస్తారో చూడాలి.