Begin typing your search above and press return to search.

కేసీఆర్ కేబినెట్ లోకి తుమ్మల..ఎవరి పోస్టుకు ఎసరు?

By:  Tupaki Desk   |   17 Jan 2023 6:35 AM GMT
కేసీఆర్ కేబినెట్ లోకి తుమ్మల..ఎవరి పోస్టుకు ఎసరు?
X
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని అధికార పార్టీ బీఆర్ఎస్ రకరకాల వ్యూహాలు పన్నుతోంది. అయితే గులాబీ పార్టీకి పట్టున్న స్థానాలు అటుంచితే.. తక్కువగా ఉన్న స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఖమ్మం జిల్లా పూర్తిస్థాయిలో కారుకు చిక్కడం లేదు. 2018 ఎన్నికల్లోనూ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి మాత్రం అన్ని స్థానాల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అక్కడున్న అసంతృప్త నేతలకు పదవులు కట్టబెట్టి వారిని ప్రోత్సహిస్తోంది. తాజాగా కొంతకాలంగా కనుమరుగైన తుమ్మల నాగేశ్వర్ రావుపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినేట్ లోకి తీసుకోవాలని చూస్తున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్ రావుది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయడుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన తెలంగాణ ఉద్యమంలోనూ సైకిల్ పార్టీతోనే ఉన్నారు. ఈ క్రమంలో 2014లో టీడీపీ తరుపున సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత గులాబీ కండువా కప్పుకున్న ఆయనకు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఆ తరువాత కేబినేట్ లోకి తీసుకున్నారు. అయితే 2016లో పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేసిన ఆయన 45 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఇక 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే తుమ్మల నాగేశ్వర్ రావుపై కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచిన ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరారు. అప్పటి నుంచి తుమ్మల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన మరింత అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల తుమ్మల నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ లో ఉన్నా ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఖమ్మం జిల్లాలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయినట్లయింది.

ఇదే సమయంలో ఎంపీ పొంగులేటీ శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో పార్టీపై దృష్టి పెట్టకపోతే భారీ నష్టం వస్తుందని కేసీఆర్ భావించారు. అందుకే పొంగులేటికి సెక్యూరిటీ తగ్గించారు.

అటు తుమ్మల నాగేశ్వర్ రావును ఆదరించారు. ఖమ్మంలో ఈనెల 18న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను తుమ్మల నాగేశ్వర్ రావుకు అప్పగించారు. అయితే అంతకుముందే తుమ్మల ప్రగతిభవన్ కు వచ్చారు.

ఈ భేటీలో తుమ్మల నాగేశ్వర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబీనేట్ లోకి తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈయన స్తానంలో మల్లారెడ్డికి చెక్ పడుతుందా? పోయిన ఈటల స్థానంలో భర్తీ చేస్తారా? అన్నది చూడాలి. మార్చిలో పలు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో ఏదో ఒకటి తుమ్మలకు కేటాయించి, ఆ వెంటనే కేబినేట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వర్ రావు సభా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సభ ద్వారా జిల్లాలో పట్టు పెంచుకునేందుకు చూస్తున్నారు.

టీడీపీలో ఉండగా తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లాను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. అందువల్ల ఆయనను చేరదీస్తే పార్టీకి లాభం జరుగుతుందని కేసీఆర్ ఆలోచించారు. అందుకే పొంగులేటి, ఇతర నాయకులను కాదని తుమ్మలకు అప్పగించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లోనూ తుమ్మలకు పాలేరు నుంచి టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మరి తనపై నమ్మకం ఉంచిన కేసీఆర్ కు తుమ్మల ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.