Begin typing your search above and press return to search.

బాబే అసలైన అడ్డంకి... అందుకే ...?

By:  Tupaki Desk   |   18 Dec 2021 6:26 AM GMT
బాబే అసలైన అడ్డంకి... అందుకే ...?
X
చంద్రబాబు రాజకీయ గండర గండడు. అయినా సరే వ్యూహాలు అన్నీఅన్ని వేళలా పారవు. దానికి కారణం 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కావడమే. ఇది పక్కన పెడితే చంద్రబాబు రాజకీయం వేరు, అమరావతి రాజధాని వేరు. కానీ ఈ రెండింటినీ కలిపేసిన ఘనత మాత్రం ఆయనదే. ఇప్పటికీ ఆయన అది తెలుసుకోలేకపోవడం, ఆయన వెనక పడిన రైతులు కూడా అర్ధం చేసుకోలేకపోవడంతో అమరావతి కధ అలా ధారావాహికంగా సాగిపోతూనే ఉంది.

ఇంతకీ అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన తప్పేంటి అంటే ఆయన పూర్తిగా దాన్ని సొంత వ్యవహరంగా తీసుకోవడమే. ఏపీకి అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మించాలి. అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత. అదే సమయంలో దాన్ని రాజకీయాలకు వాడుకోవాలని చూడడమే తప్పుగా మారుతోంది.

సైబరాబాద్ ని కట్టింది నేనే. అమరావతిని నేనే అభివృద్ధి చేస్తాను, ప్రపంచం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన రాజధానిగా మలుస్తాను అంటూ చంద్రబాబు నాడు సీఎం హోదాలో ఇచ్చిన ప్రకటనలే నేడు కొంపముంచాయి.

దాంతో అమరావతి బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబుకు పోతోంది అన్న ఆలోచనతోనే వైసీపీ ఆది నుంచి మోకాలడ్డుతోంది. ఇక అక్కడ రైతులు కానీ రాజధాని కోరుకునే వారు కానీ అధికార పార్టీకి ఈ రోజుకీ దూరంగా ఉంటున్నారు.

గత కాలం ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటే వెళ్తున్నారు. రాజధానిని జగన్ కట్టినా కూడా ఆ క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు తహతహలాడుతూంటే ఆయననే ఆధునిక రాజధాని నిర్మాతగా చూపడానికి చాలా మంది తాపత్రయపడుతున్నారు. తాజాగా తిరుపతి సభలో కూడా బాబు తన కలల రాజధాని అమరావతి అని బోల్డ్ గా స్టేట్మెంట్ ఇస్తూంటే ఇక రాజకీయ ఫైట్ తప్ప అక్కడ మరేమి జరిగేను అన్న సందేహాలు రాక తప్పవు.

మరి ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు నిర్మాణం చేస్తుంది. రాజధానిని గత ప్రభుత్వం ఒక బాధ్యతగా చూసి అక్కడితో అలా వదిలేసి ఉంటే తరువాత ఎవరు వచ్చినా పూర్తి చేసేవారు. కానీ అది చంద్రబాబు సొత్తు అన్నట్లుగా జరిగిన అతి ప్రచారం మూలంగానే ఈ రోజు అమరావతి రైతులు రోడ్డున పడాల్సి వచ్చిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.

మరో వైపు ఉన్న రాజధానిని కొనసాగించకుండా తగ్గించాలని చూడడం ద్వారా వైసీపీ వేసిన రాజకీయపు ఎత్తుగడలు కూడా చంద్రబాబుని టార్గెట్ చేసి మాత్రమే ఉన్నాయి. అంటే అమరావతిని చంద్రబాబు ఉక్కు పిడికిలి నుంచి ఎంత త్వరగా విడిపించగలిగితేనే అంత ఎక్కువగా మేలు జరుగుతుంది. కానీ అది జరిగే పనేనా అన్నదే డౌట్.

సగం పాలన పూర్తి అయినా వైసీపీ వైపు రాజధాని రైతులు చూడడంలేదు. అదే సమయంలో టీడీపీ కూడా తన రాజకీయాన్ని అక్కడే పెట్టి పందెం కాస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలోనే అమరావతి కధ ఎప్పటికీ కంచికి చేరకుండా అలాగే ఉండిపోతోంది.

మొత్తానికి చూసుకుంటే అమరావతికి అసలైన అడ్డంకి చంద్రబాబేనా అంటే అవును అన్న సమాధానం వస్తోంది. అయితే ఇది ఇంతటితో ఆగదు, అలా ముందుకు సాగుతూనే ఉంటుంది. మరి అమరావతి రాజధాని రైతుల కోరిక తీరుతుందా. ఒకే ఒక రాజధానిగా ఉంటుందా అంటే చంద్రబాబు సీఎం కావడం మీదనే అది ఆధారపడి ఉంటుంది.

వచ్చే ఎన్నికల్లో అమరావతి రాజధాని నినాదం పదమూడు జిల్లాలకు పాకి టీడీపీకి అనుకూలిస్తేనే బాబు సీఎం కాగలరు, అలా కాకుండా కొద్ది జిల్లాలకే పరిమితమైతే మాత్రం అమరావతి రాజధాని కల అలాగే ఉండే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా అమరావతి కధకు లాజికల్ గా ముగింపు రావాలి అంటే 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పును అహ్వానించాల్సిందే అన్న మాట మాత్రం సత్యం.