Begin typing your search above and press return to search.

బయటపడిన నాటకాలు!

By:  Tupaki Desk   |   20 Sep 2021 2:30 PM GMT
బయటపడిన నాటకాలు!
X
పరిషత్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత జనాలందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోయాయి. చంద్రబాబునాయుడు ఏమో పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించినట్లు అప్పట్లో ప్రకటించారు. అయితే తాజాగా కౌంటింగ్ సందర్భంగా బ్యాలెట్ పేపర్లను చూస్తే టీడీపీ సింబల్ కనిపించింది. అంతేకాకుండా చాలా చోట్ల జడ్పీటీసీ, ఎంపిటీసీ స్ధానాలకు పోటీచేసిన అభ్యర్ధులకు టీడీపీ సింబల్ అధికారికంగా కనబడింది. బహిష్కరణే వాస్తవమైతే అసలు ప్రచారానికే దూరంగా ఉండలి. అలాగే పోటీలో కూడా ఎక్కడా కనబడకూడదు. కానీ టీడీపీ అభ్యర్ధులు గట్టిగా ప్రచారం చేసుకున్నారు.

ఈ కారణంగానే అధికారికంగా టీడీపీ కొన్ని ఎంపిటీసీ స్ధానాల్లో గెలిచినట్లు స్టేట్ ఎన్నికల కమీషన్ కూడా ప్రకటించింది. ఇదంతా చూసిన తర్వాత పరిషత్ పోటీలో టీడీపీ ఉన్నట్లా ? లేనట్లా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. బ్యాలెట్ పేపర్లలో టీడీపీ సింబల్ కనబడింది కాబట్టి, గెలిచిన కొందరు అభ్యర్ధులు టీడీపీ గుర్తుమీదే గెలిచారు కాబట్టి పోటీలో టీడీపీ ఉన్నట్లే లెక్క. నిజంగానే టీడీపీ తరపున ఎవరు పోటీలో లేకపోతే బ్యాలెట్ బాక్సులోనేబాక్సులో టీడీపీ సింబల్ కనబడకూడదు. అంటే పైకి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించినా లోలోపల మాత్రం పార్టీ తరపున బీఫారంలు జారీచేసినట్లు అర్ధమైపోతోంది. మొత్తానికి టీడీపీ 7 జడ్పీటీసీలు, 923 ఎంపిటీసీలను గెలుచుకున్నది.

క్షేత్రస్ధాయిలో జరిగినదాన్ని బట్టి టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయినట్లే అనుకోవాలి. ఇలాంటి ఫలితాలు వస్తాయని ముందుగా ఊహించిందే. ఎందుకంటే పంచాయితి ఎన్నికల్లో పార్టీల సింబల్ లేకపోయినా మద్దతుదారులే ఉంటారు. కాబట్టి ఆ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే క్లీన్ స్వీప్ చేశారు. తర్వాత పార్టీగుర్తుల మీదే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికలు కూడా క్లీన్ స్వీప్ అయిపోయింది. నిజంగానే టీడీపీ ఎన్నికలను బహిష్కరించిందే కరెక్టయితే బ్యాలెట్ లో తమ పేర్లున్నా పోటీ చేయటంలేదని ప్రకటించుండాలి. కానీ ఆ పనిచేయకుండా పోటీచేయటమే కాకుండా ప్రచారం కూడా చేసుకున్నది.

మొత్తం మీద అర్ధమైందేమంటే ఎన్నికలు ఏవైనా అధికారపార్టీ క్లీన్ స్వీప్ చేస్తోందని. స్ధానికసంస్ధల ఎన్నికలు ఎలాగూ అధికారపార్టీకే అనుకూలంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రతిపక్షాలు మరీ ఇంతగా కుదేలైపోవటం మాత్రం ఇదే మొదటిసారి. 2019 అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన వైసీపీ జైత్రయాత్ర ఇప్పటివరకు కంటిన్యు అవుతునే ఉంది. మధ్యలో వచ్చిన తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో కూడా వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

నిజానికి ఈ ఫలితాలు సుమారు ఐదుమాసాల క్రితమే వెల్లడవ్వాల్సింది. ఫలితాలు ఎప్పుడు వచ్చినా విషయం మాత్రం ఇలాగే ఉంటుందని చంద్రబాబు అండ్ కో ఊహించినట్లే ఉన్నారు. అందుకనే అధికార దుర్వినియోగం అనే ఆరోపణలతో ఎన్నికల బహిష్కరణ నాటకమాడారు. సరే ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మళ్ళీ అధికార దుర్వినియోగమనే నాటకం మొదలుపెట్టడమే విచిత్రంగా ఉంది. ఏదేమైనా తాజా ఫలితాలను బట్టి నిజాయితీగా చంద్రబాబు లోపాలను సరిచేసుకుంటే పార్టీ భవిష్యత్తుకే మంచింది లేకపోతే అంతే సంగతులు.