Begin typing your search above and press return to search.

కీలక నియోజకవర్గంలో టీడీపీ కథ మళ్లీ మొదటికి!

By:  Tupaki Desk   |   8 Jun 2023 11:00 AM GMT
కీలక నియోజకవర్గంలో టీడీపీ కథ మళ్లీ మొదటికి!
X
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు తిరిగి టీడీపీ గూటికి చేరతాన ని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన ఎస్సీవి నాయుడు ఆ పార్టీ తనకు అన్యాయం చేసిందని తిరిగి టీడీపీలో చేరడానికి నిర్ణయించారు. గడిచిన నాలుగేళ్లుగా అధికార వైసీపీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడం పట్ల ఎస్సీవి నాయుడు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అందుకే టీడీపీలో చేరుతున్నానని వెల్లడించారు.

ఈ మేరకు ఎస్సీవీ నాయుడు ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆయన అంగీకారం తీసుకున్నారు. జూన్‌ 8న చేరికకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు.

కాగా ఎస్సీవి నాయుడు తొలిసారి 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీకాళహస్తి నుంచి గెలుపొందారు. 2009లో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన టీడీపీలోకి వచ్చినా సీటు దక్కలేదు. దీంతో 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అయితే ఆయనకు ఎలాంటి పదవి రాలేదు. దీంతో మళ్లీ ఆయన తన మాతృ పార్టీ అయిన టీడీపీలో చేరాలని నిర్ణయించారు.

అయితే ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న బొజ్జల సుధీర్‌ రెడ్డి ఆగ్రహంతో చంద్రబాబు.. ఎస్సీవీ నాయుడు చేరికను ఆపేయాల్సి వచ్చింది. నియోజకవర్గ ఇంచార్జిని అయిన తనకు చెప్పకుండా ఎస్సీవీ నాయుడును పార్టీలో ఎలా చేర్చుకుంటారని బొజ్జల సుధీర్‌ బహిరంగంగానే అసంతృప్తి గళం వినిపించారు. ఈ మేరకు ఆయన తన వాయిస్‌ మేసేజును నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పంపారని తెలుస్తోంది.

నియోజకవర్గ ఇంచార్జిని అయిన తనకు ఎలాంటి సమాచారం లేకుండానే ఎస్సీవీ నాయుడిని పార్టీలో చేర్చుకుంటున్నారని, ఈ కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దంటూ ఆ వాయిస్‌ మెసేజులో బొజ్జల సుధీర్‌ ద్వితీయ శ్రేణి నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో చంద్రబాబు.. ఎస్సీవీ నాయుడి చేరికను తాత్కాలికంగా నిలిపేశారు. జూన్‌ 14న కుప్పానికి రావాల్సిందిగా బొజ్జల సుధీర్, ఎస్సీవీ నాయుడిని చంద్రబాబు ఆదేశించారు.

బొజ్జల సుధీర్‌ ఆగ్రహించకపోతే జూన్‌ 8న ఎస్సీవీ నాయుడి చేరిక జరిగిపోయేదనే చెబుతున్నారు. ఇటీవల సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణను నియోజకవర్గ ఇంచార్జిగా ప్రకటించడంతో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తనయుడు కోడెల శివరామ్‌ బహిరంగంగానే టీడీపీ అధిష్టానంపై విమర్శలు చేశారు. ఇక చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఇదే బాట పట్టారు. ఇప్పుడు బొజ్జల సుధీర్‌ వంతు వచ్చింది. మరి దీన్ని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాల్సిందే,