Begin typing your search above and press return to search.

టీడీపీ అదిరిపోయే ప్ర‌శ్న‌.. వైసీపీకి ఉక్కిరి బిక్కిరి!

By:  Tupaki Desk   |   16 Sep 2022 5:39 AM GMT
టీడీపీ అదిరిపోయే ప్ర‌శ్న‌.. వైసీపీకి ఉక్కిరి బిక్కిరి!
X
తాజాగా జ‌రుగుతున్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో..ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రి స్తూ.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతోంద‌ని పరిశీల‌కులు అంటున్నారు. తాజాగా శుక్ర‌వారం నాటి స‌భ‌లో .. టీడీపీ స‌భ్యుడు.. కొండ‌పి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేస్వామి.. క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి.. ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీకి.. 2019, డిసెంబ‌రు 14న స్వ‌యంగా జ‌గ‌న్ శంకు స్థాప‌న చేశారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఒక్క ఇటుక కూడా పేర్చ‌లేదు.

ఇదే విష‌యాన్ని స్వామి ప్ర‌స్తావించారు. అంతేకాదు.. సుమారు 845 మంది రైతుల‌కు ఇప్ప‌టికీ.. ప‌రిహారం ఇవ్వ‌లేద‌ని తెలిపారు. దాదాపు 90 ఎక‌రాల‌కు సంబంధించిన రైతుల‌కు ప‌రిహారం అందాల్సి ఉంద‌ని.. గ‌ణాంకాల రూపంలో ఆయ‌న వివ‌రించారు.

ఇక్క‌డి రైతులు.. ఆవేదన వ్య‌క్తం చేస్తున్నార‌ని.. అన్నారు. ఇది సీఎం జ‌గన్ సొంత జిల్లాలోనే ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ప‌రిస్థితి ఎలా ఉందో.. తెలుస్తుంద‌ని పేర్కొన్నారు.

డోలా స్వామి చెప్పిన లెక్క ప్ర‌కారం.. సున్న‌పురాళ్ల ప‌ల్లిలో 259 మంది రైతుల‌కు, సిరిగేప‌ల్లిలో 177 మందికి, పెద్దంపురం గ్రామంలో 399 మంది రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాల్సి ఉంద‌న్నారు. జ‌గ‌న్‌ను ఆయ‌న కుటుంబాన్ని..ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఇక్క‌డి ప్ర‌జ‌లు గెలిపిస్తున్నార‌ని.. అయినాకూడా.. వారి ప‌ట్ల ప్ర‌భుత్వా నికి ఏమాత్రం జాలి, ద‌య కూడా లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి.. క‌రోనా నేప‌థ్యంలోనే ఇది ఆల‌స్య‌మైంద‌ని స‌మ‌ర్థించుకున్నారు.

కానీ, వాస్త‌వానికి.. ప‌రిహారం ఇచ్చేందుకు క‌రోనాతో అడ్డంకులు ఏంట‌నేది ప్ర‌శ్న‌. ఎందుకంటే. క‌రోనా తాండ‌వించిన స‌మ‌యంలోనూ.. ప్ర‌భుత్వం అమ్మ ఒడి, ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసింది. డీబీటీ విధానంలో నిధుల‌ను ల‌బ్ధి దారుల ఖాతాల్లో వేసింది.

మ‌రి అలాంట‌ప్పుడు.. రైతులకు ప‌రిహారం కూడా ఇదే విధంగా ఇవ్వొచ్చుక‌దా? ! అనేది ప్ర‌శ్న‌. అయితే.. దీనిని దాట‌వేసిన అధికార పార్టీ నేత‌లు.. ఎదురుదాడికే ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఒక‌ర‌కంగా.. టీడీపీ అడిగిన‌.. క‌డప ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్ర‌శ్న‌.. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసింద‌నేది వాస్త‌వం.. అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.