Begin typing your search above and press return to search.

సొమ్ములుండాలే : తమ్ముళ్ళకు విచిత్ర పరిస్థితి

By:  Tupaki Desk   |   22 July 2022 3:30 PM GMT
సొమ్ములుండాలే : తమ్ముళ్ళకు విచిత్ర పరిస్థితి
X
ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయి మూడేళ్ళు పై దాటింది. నాడు పదవులు అనుభవించిన వారు అయితే ఇపుడు సైడ్ అయినారు. సైలెంట్ అయ్యారు. మరో రెండేళ్ల దాకా చూస్తే ఎన్నికలు లేవు. దాంతో ఖర్చు చేసేందుకు పార్టీ జనాలు ముందుకు రావడంలేదు అంటున్నారు. అధినాయకుడు చంద్రబాబు ఎంతగా జనంలోకి దూసుకువస్తున్నా లీడర్స్ అయితే అంతలా వెనకడుగు వేస్తున్నారు అని అంటున్నారు.

ఏపీలో ఈసారి ఎన్నికలు పూర్తిగా ఢీ అంటే ఢీ అనేలా సాగుతాయని అంటున్నారు. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. దాంతో ఎన్నికల వేళ టికెట్లు తెచ్చుకున్న వారు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచే మినీ మహానాడులంటూ ఇతర కార్యక్రమాలకు తాము ఖర్చులు చేయలేమని తమ్ముళ్ళు చెబుతున్నారని టాక్.

ఏపీలో పరిస్థితి టీడీపీని అనుకూలంగా ఉందని, దాన్ని కొనసాగించేందుకు వరస టూర్లు చేయాలని, అనేక కార్యక్రమాలు చేపట్టాలని అధినాయకత్వం అయితే ఉత్సాహం చూపిస్తోంది. కానీ కనీసంగా పది కోట్ల దాకా ఖర్చు అయ్యే జిల్లా మహానాడులకు సొమ్ములు పెట్టుకోలేమని తమ్ముళ్ళు అంటున్నారుట.

పార్టీ హై కమాండ్ ఏమైనా సాయం చేస్తే తాము రావడానికి రెడీ అంటున్నారుట. మరో వైపు చూస్తే అసలైన ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా ఇప్పటి నుంచే ఉన్న సొమ్ములు కరగదీస్తే కీలకమైన వేళ చేతులు ఎత్తేయాల్సి ఉంటుందని ముందు జాగ్రత్తపరులు అంటున్నారుట.

ఇక టీడీపీ అధినాయకత్వం అయితే చాలా చోట్ల టికెట్లు ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. దాంతో ఎవరికి టికెట్ వస్తుందో తెలియని వేళ తాము ముందుకొచ్చి చేతులు కాల్చుకోవడం కూడా మంచిది కాదు అన్న ఆలోచనలతో వెనకడుగు వేస్తున్న వారు ఉన్నారని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తమకు పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిధుల సాయం కావాలని కూడా తమ్ముళ్ళు కోరుతున్నారుట. తమ వద్ద ఉన్న నిధులు సరిపోవని చెబుతున్నారుట. రాయలసీమ నుంచి కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాల తమ్ముళ్ల గోడు అంతా ఇదేనని అంటున్నారు. దానితో మహానాడుతో వచ్చిన ఊపుని మరింతగా పెంచి జనాలలోకి దూసుకెళ్ళాలని చూస్తున్న టీడీపీ హై కమాండ్ కి ఈ సొమ్ముల్లేవ్ అన్న మాటలు ఇబ్బందిగా మారుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ కొరతను ఎలా తీర్చుకుంటారో.