Begin typing your search above and press return to search.

అదేంటమ్మా పట్టాభికి బుద్ధి లేదనుకుందాం.. మీ నోటి నుంచి ఇలాంటి మాటలా?

By:  Tupaki Desk   |   22 Oct 2021 8:30 AM GMT
అదేంటమ్మా పట్టాభికి బుద్ధి లేదనుకుందాం.. మీ నోటి నుంచి ఇలాంటి మాటలా?
X
‘‘నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా. నువ్వు నాలుగు అంటే.. నేను పద్నాలుగు అంటా’’ అనే వైఖరి సమస్యకు పరిష్కారమా? అన్నది ప్రశ్న. దూకుడు రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలై చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు అది మరో స్థాయికి వెళ్లిపోతోంది. మర్యాద అన్నది లేకుండా తమకు నచ్చని వారి మీద నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఎక్కువైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య చేసిన పట్టాభిని సమర్థించాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా కొందరు టీడీపీ నేతలు వాదిస్తున్నట్లు.. అసలీ బూతుపురాణాలు.. బూతులు తిట్టటాలు ఎవరు ప్రారంభించారు? లాంటి ప్రశ్నలు వినేందుకు బాగానే ఉన్నా.. వారికి బుద్ది లేదని మీ బుద్ధి ఏమైందన్నది కూడా ఒక వాదనే.

ఒకరిని తప్పు పట్టే క్రమంలో.. వారు అలాంటి తప్పు చేయకూడదు కదా? ఈ పాయింట్ లో చూసినప్పుడు పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్య తప్పే. అందులో మరో మాటకు అవకాశం లేదు. తనను ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి అన్న మాటను సీఎం జగన్ విడమర్చి మరీ చెప్పటం.. అది బహిరంగంగా.. ఆ దరిద్రపుగొట్టు మాటను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మంచిని నలుగురితో పంచుకుంటే బాగుంటుంది. చెడును ఇద్దరితో పంచుకున్నా చేటే.

ముఖ్యమంత్రి స్థానంలో తనను అన్న మాట అర్థం ఫలానా.. అని చెప్పటం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇప్పుడు బాధిత స్థానంలో ఉన్న ఆయన తన ఆవేదనను పంచుకోవటంలో తప్పేముందన్న వాదనను వినిపించొచ్చు. అది కూడా సరైనదే అనుకుందాం. కానీ.. పట్టాభి అన్న అనుచిత మాటల్ని ఖండించే క్రమంలో వైసీపీ నేతలు.. సానుభూతిపరుల నోటి నుంచి వస్తున్న మాటలు సబబుగా ఉన్నాయా? అన్నది ప్రశ్న.

తనను అనరాని మాటను అన్న పట్టాభి అనుచిత పదానికి అర్థం చెప్పి.. ‘మా అమ్మను ఇంతలా అవమానిస్తారా?’ అని సీఎం జగన్ వ్యక్తంచేసిన ఆగ్రహంలో ధర్మం ఉంది. అదే సమయంలో.. పట్టాభిని ఉద్దేశించి.. వైసీపీకి చెందిన వారు చేస్తున్న వ్యాఖ్యలు.. అతడి తండ్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా సరైనవి కావు. సీఎం జగన్ ను పట్టాబి అన్నాడు.దానికి చట్టం తన పని తాను చేసుకెళ్లింది. పట్టాభి మాటను పట్టుకొని ఎంత మాట పడితే అంత మాట అనటంలో అర్థమేమిటి? అన్నది ప్రశ్న. సీఎం జగన్ ఆవేదనకు తీవ్రంగా కదిలిపోయిన వారు.. తమ మాటలతో ద్వారా వేరే వారిని కష్టపెట్టకూడదని ఎందుకు అనుకోవటం లేదు? అన్నది ప్రశ్న.

ఇలాంటి వైఖరితో వచ్చే సమస్య ఏమంటే.. అసలు పోయి.. కొసరు మిగిలినట్లుగా.. చివరకు ఏపీ ప్రజలకు మిగిలేది బూతులు.. వాటి అర్థాలే తప్పించి.. ఇంకేం కాదు. రాజకీయ రగడ ఉండాలి. కానీ దేని విషయంలో? ప్రజలకు మేలు చేసే అంశాల్లో. అంతేకానీ.. నోటికి వచ్చినట్లు మాట్లాడే మాటలతో వాతావరణం మరింత వేడెక్కుతుందే తప్పించి చల్లారదు. దీనికో ఉదాహరణ ఇక్కడ ప్రస్తావిస్తాం. ఒక పది మంది రోడ్డు మీద కొట్టుకుంటున్నారనుకుందాం.

ముందు అయితే.. వాళ్లను విడదీసి..ఊరుకోబెడతాం కదా? అందుకు భిన్నంగా కొట్టుకునే వారి చేతికి కత్తులు.. కర్రలు ఇవ్వం కదా? ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు. ఇక్కడ పోస్టుచేసే వీడియోను చూసినప్పుడు.. ఇందులో ఉన్న మాటలు మరింత ఆగ్రహాన్ని కలిగించి.. వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తాయన్నది మర్చిపోకూడదు. అందుకే.. ఎవరికి వారు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అలా అని చేతకాని దద్దమ్మల్లా మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు చేపట్టాల్సిందే. తప్పు చేసిన వారి తాట తీసేలా పోరాడాల్సిందే. కానీ.. పరిధి దాటకుండా అన్న లక్ష్మణ రేఖ ఒకటి ఉందన్నది మాత్రం మర్చిపోకూడదు.