Begin typing your search above and press return to search.

తమ్మినేని ఫస్ట్రేషన్ తో వైసీపీకి డ్యామేజ్ ?

By:  Tupaki Desk   |   31 May 2023 8:00 AM GMT
తమ్మినేని ఫస్ట్రేషన్ తో వైసీపీకి డ్యామేజ్ ?
X
వైసీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీకి ప్లస్ అవుతున్నారా లేక మైనస్ గా మారుతున్నారా అన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఏడు పదులకు చేరువ అవుతున్న ఈ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ని పట్టుకుని ఫినిష్ అంటూ చేసిన కామెంట్స్ ఇపుడు ఉత్తరాంధ్రాలో అతి పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తమ్మినేని చేసిన కామెంట్స్ ని తెలుగుదేశం నాయకులు ఖండించారు.

తమ్మినేని ఫ్రస్టేషన్ తో చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారని, బాబుకు భద్రత ఎందుకు అని ఆయన ప్రశ్నించడం ఏంటి అని వారు నిలదీస్తున్నారు. బాబుకు 12 ప్లస్ 12 ఎన్సీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే తమ్మినేని మాత్రం దాన్ని ఉప సంహరించాలని కోరుతున్నారు. తాను స్పీకర్ హోదాలో లేఖ రాస్తాను అంటున్నారు.

కేంద్ర హోం శాఖ ఆషామాషీగా ఎవరికీ సెక్యూరిటీ ఇవ్వదు. ఇంటలిజెన్స్ వర్గాల నివేదికలను చూసిన మీదంటే భద్రత ఇస్తుంది. చంద్రబాబుకు మొదట 6 ప్లస్ 6 ఎన్సీజీ భద్రత ఉండేది. గత ఏడాది కుప్పంలో బాబు మీద దాడి జరిగిన తరువాత దానిని రెట్టింపు చేశారు. ఇక ఉన్నట్లుండి తమ్మినేని చంద్రబాబు భద్రత మీద ఫోకస్ చేసి మాట్లాడటం ఎందుకు అన్న చర్చ సొంత పార్టీ నుంచే వస్తోంది

చంద్రబాబు భద్రత విషయంలో సీఎం జగన్ సైతం ఎలాంటి కామెంట్స్ ఇప్పటిదాకా చేయలేదు అని గుర్తు చేస్తున్నారు. విపక్ష నేతగా సీనియర్ గా ఉన్న చంద్రబాబు భద్రత అన్నది ముఖ్యం అన్న సంగతి సీనియర్ నేత తమ్మినేనికి తెలియదా అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశంలో పుట్టి పెరిగిన తమ్మినేని తొమ్మిదేళ్ల పాటు మంత్రిగా ఎన్టీయార్ చంద్రబాబుల మంత్రివర్గంలో పనిచేశారు. దాదాపు పద్దెనిమిది మంత్రిత్వ శాఖలను చూసారు.

ఆయన 1983లో తొలిసారి ఎన్టీయార్ పిలుపు మేరకు టీడీపీలో చేరి 1999 దాకా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. చంద్రబాబు సైతం జిల్లా రాజకీయాల్లో తమ్మినేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. 1996లో లక్ష్మీపార్వతి పార్టీ తరఫున ఎన్టీయార్ పెద్ద కొడుకు నందమూరి జయక్రిష్ణ శ్రీకాకుళం ఎంపీ సీటుకు పోటీ చేస్తే ఆయన మీద పోటీగా టీడీపీ నుంచి తమ్మినేనినే బరిలోకి దించాలని బాబు మొదట భావించారు.

అయితే తమ్మినేని లోక్ సభకు పోటీకి నో చెప్పడంతో ఎర్రన్నాయుడుకు ఆ అవకాశం ఇచ్చారు. ఆ విధంగా ఆయన గెలిచి కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అయితే ఎర్రన్నాయుడుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని భావించి తమ్మినేని బాబుకు దూరం జరిగారు అంటారు. ఆయన ప్రజారాజ్యం లోకి వెళ్ళి అక్కడ నుంచి వైసీపీలో చేరి స్పీకర్ అయ్యారు. ఇంత చేసినా తమ్మినేనికి టీడీపీలోనే ఎక్కువ గుర్తింపు గౌరవం దక్కిందని తమ్ముళ్ళు గుర్తు చేస్తున్నారు.

అన్ని విధాలుగా అవకాశం ఇచ్చిన టీడీపీ మీద చంద్రబాబు మీద ఈ రోజు తమ్మినేని అసహనంతో చేస్తున్న విమర్శలు చూసిన తమ్ముళ్ళు రేపటి రోజున జగన్ని కూడా ఇదే తీరున తమ్మినేని విమర్శించే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. ఇక స్పీకర్ గా రాజకీయాలు తక్కువగా మాట్లాడాలి. కానీ తమ్మినేని అన్నీ రాజకీయ విమర్శలే చేస్తున్నారు.

ఇపుడు చంద్రబాబు లాంటి సీనియర్ ని పట్టుకుని ఫినిష్ అన్న పదాలు ఉపయోగించడం ద్వారా ఆయన వైసెపీకి డ్యామేజింగ్ సిట్యువేషన్ తెచ్చారని అంటున్నారు. బాబుకు ఎవరైనా ప్రాణహాని తలపెట్టేందుకు చూస్తున్నారు అన్న అనుమానాలు తమకు ఉన్నాయని తమ్ముళ్ళు ఎలుగెత్తి విమర్శలు చేస్తున్నారు. కుట్ర కోణం ఇందులో ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఆముదాలవలసలో టీడీపీ జోరు మీద ఉంది.

అదే టైం లో వైసీపీలో వర్గ పోరు సాగుతోంది. ఈసారి టికెట్ ఇచ్చినా తమ్మినేని గెలుస్తారా అన్న డౌట్ ఉంది. అయినా తమ్మినేని తన నియోజకవర్గంలో గెలుపు కోసం చూసుకోకుండా బాబు మీద అక్కసుతో చేసే విమర్శలతో టీడీపీకి ఆయుధాలను ఇస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ పెద్దాయన వ్యవహారం మీద వైసీపీ హై కమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నదే చర్చగా ఉంది.