Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఆ పొరపాట్లు చేశారు.. సుజనా చౌదరి వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   17 Jun 2019 12:40 PM IST
చంద్రబాబు ఆ పొరపాట్లు చేశారు.. సుజనా చౌదరి వ్యాఖ్యలు!
X
ఎన్నికల ముందు అసలు ఉనికే లేని కాంగ్రెస్ తో సఖ్యతగా ఉండటం, అదే సమయంలో ఏపీలో పెద్దగా ఉనికిలో లేని బీజేపీతో యుద్ధం చేయడం.. ఈ రెండూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లు అని అంటున్నారట ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి! ఈ విషయంలో తమబోటి వాళ్లు చెప్పినా చంద్రబాబు నాయుడు వినలేదని చౌదరి అంటున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన నేపథ్యంలో సుజనా చౌదరి ఆ పార్టీలో ఉంటారా? అనేది చర్చనీయాంశంగా ఉంది. అందులోనూ ఆయనపై ఆల్రెడీ కేసులు నమోదై ఉన్నాయి. అందుకే ఆయన బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ కేసుల్లో మునిగిన చౌదరిని కమలం పార్టీ చేర్చుకుంటుందా? అనేది వేరే సంగతి.

అయితే చంద్రబాబు తీరులోని తప్పులను మాత్రం చౌదరి ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నారట. పదే పదే జగన్ పై కేసులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ప్రస్తావించడం కూడా ఆ పార్టీ ఓటమికి ఒక కారణం అని చౌదరి విశ్లేషిస్తూ ఉండటం గమనార్హం. జగన్ మోహన్ రెడ్డి తన తెలివితేటలతో డబ్బులు సంపాదించుకుని ఉండవచ్చని, అక్రమాలు చేసి కాదని.. సుజనా చౌదరి ఇప్పుడు అంటున్నారట!

అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం పదే పదే ఆ కేసులనే రాజకీయం అనుకుందని, దీంతో తేడా వచ్చిందని చౌదరి విశ్లేషిస్తున్నారు. అలాగే నారా లోకేష్ బాబు మంగళగిరి నుంచి పోటీ చేయడం పెద్ద పొరపాటు అని, అది బీసీల సీటు అని అలాంటి చోట లోకేష్ ను పోటీ చేయించి చంద్రబాబు నాయుడు తప్పు చేశారని చౌదరి విశ్లేషిస్తూ ఉండటం గమనార్హం!

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును సుజనా చౌదరి సమర్థిస్తూ ఉండటం కూడా గమనించాల్సిన అంశం. కేంద్రంతో సంబంధాల విషయంలో జగన్ సరిగానే వ్యవహరిస్తూ ఉన్నారని చౌదరి విశ్లేషించారు. తాము కూడా చంద్రబాబుకు అదే విషయాన్ని చెప్పటినట్టుగా చౌదరి చెప్పుకొచ్చారు.

కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసినా, ఎన్డీయేలో కొనసాగాలని తాము చంద్రబాబుకు చెబితే ఆయన ఆ మాట వినలేదని, బీజేపీపై అనవసరంగా యుద్ధం చేశారని చౌదరి వాపోతూ ఉన్నారు. అయినా ఇప్పుడు ఇలాంటి విశ్లేషణలు చేసినా ఉపయోగం ఉండకపోవచ్చేమో. అయితే సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీలో చేరే ప్రయత్నంలో ఉన్నారని.. అందుకే ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నారనే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి!