Begin typing your search above and press return to search.

అంతరాత్మ ప్రబోధం కొంపముంచేస్తుందా ?

By:  Tupaki Desk   |   16 March 2023 11:07 AM GMT
అంతరాత్మ ప్రబోధం కొంపముంచేస్తుందా ?
X
ఈనెల 23వ తేదీన జరగబోతున్న ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో హఠాత్తుగా అంతరాత్మ ప్రబోధం తెరపైకి వచ్చింది. ఎంఎల్ఏ కోటాలో భర్తీ అవ్వాల్సిన ఏడు ఎంఎల్సీ స్ధానాలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయం. అయితే పంచుమర్తి అనూరాధతో చంద్రబాబునాయుడు నామినేషన్ వేయించారు. దాంతో ఏకగ్రీవం అవుతాయని అనుకుంటే చివరకు ఎన్నిక అనివార్యమైంది. నిజానికి పంచుమర్తిని గెలిపించుకునేంత బలం టీడీపీకి లేదని అందరికీ తెలుసు.

టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో నలుగురు తిరుగుబాటు చేసి పార్టీకి దూరమైపోయారు. ఒక ఎంఎల్సీ గెలవాలంటే 22 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాల్సుంటుంది. కానీ టీడీపీకి ఉన్నది 19 మందే. అందుకనే దూరమైన నలుగురు ఎంఎల్ఏల ఓట్లకోసం టీడీపీ విప్ జారీచేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. నిజానికి ఈ ఎన్నికలో విప్ జారీచేసే అవకాశంలేదు. ఈ విషయం తెలీక మొదట్లో కొందరు తమ్ముళ్ళ ఆవేశపడినా తర్వాత సర్దుకున్నారు.

ఇందులో భాగంగానే ఇపుడు విప్ అనేది పక్కకుపోయి ఆత్మప్రబోధం అనే నినాదం తెరపైకి వచ్చింది. ఎంఎల్ఏ అందరూ తమ ఆత్మప్రబోధం ప్రకారమే ఓట్లేయాలని చంద్రబాబునాయుడు పిలుపిచ్చారు. అంటే వైసీపీలో రెబల్ ఎంఎల్ఏలు వైసీపీ అభ్యర్దులకు కాకుండా టీడీపీ అభ్యర్ధికి ఓట్లేయాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది.

ఇప్పటికే అధికారపార్టీ రెబల్ ఎంఎల్ఏలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తమ ఆత్మప్రబోధం ప్రకారమే ఓట్లేస్తామని ప్రకటించారు. ఎలాగూ విప్ జారీచేసే అవకాశం లేదుకాబట్టి ఎంఎల్ఏలు తమిష్టం వచ్చిన వారికి ఓట్లేసుకునే స్వేచ్చుంది.

అయితే పార్టీలు అనుసరించే వ్యూహాల ప్రకారం తమ అభ్యర్ధులకు ఎవరు ఓట్లేశారు ? ఎవరు వేయలేదని తెలుసుకునే అవకాశముంది. దానిప్రకారం అభ్యర్ధులకు కేటాయించిన 22 మంది ఎంఎల్ఏలు సరిగానే ఓట్లేశారా లేదా అన్నది గుర్తిస్తారు. తమ అభ్యర్ధులు గెలిస్తే సమస్యఉండదు కానీ ఓడిపోతే మాత్రం విషయం సీరియస్ గా తీసుకుంటారు.

ఈ విషయం రెండుపార్టీలకు సమానంగా వర్తిస్తుంది. కాబట్టి ఇపుడు ఆత్మప్రబోధం అన్నా మరోటన్నా ఫలితాల తర్వాత పోస్టుమార్టమ్ మాత్రం సీరియస్ గానే ఉంటుంది. కాబట్టి ఎంఎల్ఏలు జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు తప్పవు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.