Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర కాంగ్రెస్ కు సిద్ధరామయ్య 'ఉచిత' సలహా!

By:  Tupaki Desk   |   26 Jun 2023 5:00 PM GMT
మహారాష్ట్ర కాంగ్రెస్ కు సిద్ధరామయ్య ఉచిత సలహా!
X
తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 224 అసెంబ్లీ స్థానాలలో 135 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ గెలుపులో కీలక భూమిక పోషించినవాటిలో బీజేపీ అవినీతి, ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత సంగతి కాసేపు పక్కనపెడితే... కాంగ్రె పార్టీ మేనిఫెస్టో మరింత కీలకంగా వ్యవహరించిందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను సన్మానించారు. ఇందులో భాగంగా పుణేలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో సిద్ధరామయ్య సహా పలువురు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మైకందుకున్న సిద్ధరామయ్య... వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్‌ - ఎన్సీపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటకలో తాము అనుసరించిన వ్యూహాలను అమలు చేయాలని సిద్ధరామయ్య సూచించారు. కర్ణాటకలో తాము మహిళలకు ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టామో.. అవే పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని శరద్ పవార్‌, అజిత్‌ పవార్‌ లను కోరుతున్నానని సిద్ధరామయ్య అన్నారు.

ఇదే సమయంలో... మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించకపోతే ఏ దేశం కూడా పురోగమించదని అహల్యా దేవి అభిప్రాయపడ్డారని గుర్తు చేసిన సిద్ధరామయ్య... ఆమె అభిప్రాయాలకు అనుగుణంగానే తాము కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు. మహారాష్ట్రలో కూడా ఇదే సూత్రాన్ని పాటించాలని, ఫలితంగా అధికారం ఖాయమని చెబుతున్నారు.

కాగా... కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయిదు ఉచిత హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సత్వర అమలుపై కూడా ప్రభుత్వం శ్రద్ధపెట్టింది. ఇందులో భాంగా... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఇప్పటికే అమలు చేసిన సిద్దు సర్కార్... జులై 1వ తేదీన గృహావసర వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం "గృహజ్యోతి"ని అమల్లోకి తేనుంది.

ఇదే క్రమంలో... మహిళలకు ప్రతినెలా 2,000 రూపాయల నగదు చెల్లింపు పథకం "గృహ లక్ష్మి"ని అమలు చేయడానికి ఇప్పటికే ముహూర్తం పెట్టిన కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం... ఆగస్టు 15వ తేదీన "యువనిధి" పథకాన్ని ప్రవేశపెట్టనుంది!