Begin typing your search above and press return to search.

మోడీ మాస్ట‌ర్ స్ట్రోక్ కి సేన అదిరే రిటార్ట్‌!

By:  Tupaki Desk   |   28 Jan 2019 10:39 AM GMT
మోడీ మాస్ట‌ర్ స్ట్రోక్ కి సేన అదిరే రిటార్ట్‌!
X
దేశ అత్యున్న‌త పుర‌స్కార‌మైన భార‌త‌ర‌త్న విష‌యంలో మోడీ స‌ర్కార్ ఈసారి తీసుకున్న నిర్ణ‌యంపై కొన్ని రాజ‌కీయ ప‌క్షాలు రియాక్ట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ నోట మాట రాకుండా చేయ‌టంలో మోడీ స‌క్సెస్ అయినా.. ఎన్నిక‌ల వేళ మోడీ తీసుకున్న నిర్ణ‌యంపై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు. ఇదే ప‌ని గ‌తంలో చేసి ఉంటే బాగుండేద‌న్న మాట ప‌లువురి నోటి వెంట వినిపించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మోడీకి జిగిరీ దోస్త్‌.. ఎన్డీయే ప‌క్షంలోని కీల‌క మిత్రుడిగా చెప్పే శివ‌సేన తాజాగా భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి ఇవ్వ‌టంపై నిప్పులు చెరిగింది. భార‌త‌ర‌త్న పేరుతో బీజేపీ అవార్డు రాజ‌కీయాల‌కు పాల్ప‌డిందంటూ మండిప‌డింది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు వినాయ‌క్ దామోద‌ర్ సావార్క‌ర్ గుర్తుకు రాక‌పోవ‌టం ఏమిటి? అంటూ ప్ర‌శ్నించింది.

ప్ర‌ణ‌బ్ దాకు భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ఇచ్చేంత పెద్ద మ‌న‌సు ఉన్న‌ప్పుడు.. ఆయ‌న్ను రెండో ట‌ర్మ్ లోనూ కొన‌సాగేలా మోడీ ఎందుకు నిర్ణ‌యాన్ని తీసుకోలేదంటూ సూటిగా ప్ర‌శ్నించింది. వీర సావ‌ర్క‌ర్ ను మోడీ స‌ర్కార్ ఎందుకు గౌర‌వించ‌లేద‌ని ప్ర‌శ్నించిన శివ‌సేన‌.. హిందు రాష్ట్ర ఆలోచ‌న ఆయ‌న‌దేన‌ని.. స్వాతంత్య్ర పోరాటంలో ఆయ‌న త్యాగాల‌కు వెల‌క‌ట్ట‌లేమంది. ఇంత చేసినా ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌టంలో మోడీ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌న్నారు. ఆ వీరుడికి మొండిచేయి చూపించిన‌ట్లుగా శివ‌సేన పార్టీ ప‌త్రిక సామ్నా త‌న సంపాద‌కీయంలో మోడీపై విరుచుకుప‌డింది.

ప్ర‌ణ‌బ్ దా భార‌త‌ర‌త్న అయితే మోడీ.. బీజేపీ స‌ర్కార్లు ఆయ‌న‌కు రెండోసారి రాష్ట్రప‌తి ప‌ద‌విలో ఎందుకు కొన‌సాగించ‌లేదు? అని ప్ర‌శ్నించింది. రాజ‌కీయాల్లో మార్గ‌ద‌ర్శి అని.. పాల‌నాధ్య‌క్షుడ‌ని.. రాష్ట్రప‌తిగా త‌న హ‌యాంలో ఎంత‌గానో స‌హ‌క‌రించిన‌ట్లుగా మోడీ చెబుతున్న‌ప్పుడు.. అలాంటి గొప్ప వ్య‌క్తికి రెండోసారి రాష్ట్రప‌తిని చేసే అవ‌కాశాన్ని ఎందుకు ఇవ్వ‌లేరు? అని ప్ర‌శ్నించింది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడుసావ‌ర్క‌ర్ ను నిర్ల‌క్ష్యం చేశార‌ని.. ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ఎందుకు ఇవ్వ‌రంటూ త‌న ప్ర‌చారాస్త్రంగా బీజేపీ వాడుకుంద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు నాటి ప్ర‌భుత్వ చ‌ర్య‌ను ఎండ‌గ‌ట్టిన బీజేపీ.. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు అంత‌కంటే ఎక్కువేం చేశార‌ని నిప్పులు చెరిగింది. రామ మందిరాన్ని క‌ట్ట‌లేద‌ని.. సావార్క‌ర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌లేద‌ని.. ఆయ‌న్ను దుర‌దృష్టం మ‌రోసారి వెంటాడింద‌న్నారు. మొత్తంగా చూస్తే.. భార‌త‌ర‌త్న పుర‌స్కారాల ప్ర‌క‌ట‌న మోడీ స‌ర్కారుపై మిత్రుడికి మండేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.